ఎవరైనా అత్యాచారానికి గురైన ఒక యువతి వద్దకు వెళ్లి గొడవ చేస్తారా? అందులోను పురుషులు కూడా అంతమంది వెళ్లి అరాచకం సృష్టిస్తే సమాజానికి వీరు ఏమి చెబుతున్నట్లు? ఒక మహిళను పరామర్శించడానికి వెళ్లి మరో మహిళను అవమానిస్తారా? ఏ పార్టీ వారు ఇలా చేసినా తప్పే. కాని పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు సమక్షంలోనే ఈ రకంగా గందరగోళం సృష్టించడానికి తెలుగుదేశం నేతలు, కొందరు కార్యకర్తలు పూనుకోవడం అత్యంత శోచనీయం.
చదవండి👉: జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే ‘అధర్మ యుద్ధం’
విజయవాడలో బుద్దిమాద్యం ఉన్న ఒక యువతిపై ముగ్గురు నీచులు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు వచ్చాక ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఆమెకు పది లక్షల పరిహారం ఇవ్వడం, విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం వంటి చర్యలు తీసుకుంది. అయినా ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అక్కడకు వెళ్లడాన్ని ఆక్షేపించనవసరం లేదు. ఆయన ఒక్కరు మర్యాదగా వెళ్లి ఆ యువతిని పరామర్శించి వచ్చి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. అలా కాకుండా తనతోపాటు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలను తీసుకువెళ్లడం ఏమిటి? అక్కడ వారు అద్దాలు పగులకొట్టి గొడవ చేయడం ఏమిటి? అసలే బాధలో ఉంటే, ఆ బాధిత యువతి వద్దకు అంతమంది పురుషులు వెళితే ఆమె కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది?
అదే సమయంలో అక్కడ ఉన్న మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు అనుచితంగా వ్యవహరించడం ఏమిటి? నిజానికి ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే మహిళా కమిషన్ రంగంలోకి దిగి బాధితులకు జరుగుతున్న ఉపశమన చర్యలను పరిశీలించి, కమిషన్‌గా తానేమీ చేయాలో ఆలోచించి చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి పద్మ వెళ్లగా టీడీపీ వారు గో బ్యాక్ అనాల్సిన అవసరం ఏముంది. అంటే టీడీపీ వారు తప్ప ఆ యువతిని మరెవరూ పరామర్శించకూడదా? ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని, మహిళా కమిషన్ ఏమి చేస్తుందని ప్రశ్నించవచ్చని వారి ఉద్దేశమా? లేక చంద్రబాబు ఇంకా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారని ఫీల్ అవుతూ వారు ఈ గోల చేశారా?
చదవండి👉: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటే గౌరవమే కాని...
మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన ఇష్టారీతిలో పద్మపై నోరు పారేసుకుంటుంటే చంద్రబాబు వారించి ఉంటే ఎంత బాగుండేది. పద్మతో పాటు ఆయన కదా ఆ బాధిత యువతిని పరామర్శించి, ఇంకా ఏ విధంగా ఆ యువతి సాయం చేయాలో ఆమెకు చెప్పి ఉంటే ఎంత హుందాగా ఉండేది. తద్వారా తన పెద్దరికం నిలబడేది కదా? అలా చేయకపోగా బొండా ఉమాను, మరో మహిళా నేతను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడారట. ఈ నేపథ్యంలోనే తన అధికారిక హోదాలో చంద్రబాబుకు, బొండాకు సమన్లు జారీ చేశారు. వీటిని వారు పాటించకపోవచ్చు. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెరపైనే చూడాలి.
చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాచేపల్లి వద్ద అత్యాచారం ఘటన జరిగితే ఏమని సూక్తులు చెప్పారు. ఎవరికి వారు భద్రత కల్పించుకోవాలి కాని, ప్రతి ఒక్కరికి పోలీసును పెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అది వాస్తవం కూడా. కాని ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి వైసీపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్‌పైన నిందారోపణలు సాగించారు.
ఇక్కడే ఆయనలో ఉన్న రాజకీయ కుట్ర కోణం బయటపడుతోంది. ప్రతిదానిని రాజకీయం చేయాలని, రాజకీయాలకు వాడుకోవాలన్న ఆయన దురుద్దేశం బహిర్గతం అవుతుంది. పోనీ తన హయాంలో కాని, ఈ మధ్య కాలంలో ఒకరిద్దరు టీడీపీ నేతలపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కాని, ఆయన ఇదే రీతిలో స్పందించారా? అలాంటిదేమీ లేదు. మరి ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నారంటే, మరో రెండేళ్లలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో జగన్‌ను ఓడించాలన్న తహతహతో ఉన్న చంద్రబాబు ఏ చిన్న అవకాశం వచ్చినా, పెద్దరాయితో కొట్టాలని చూస్తున్నారు. కాని ఆ క్రమంలో ఆయన తప్పులపై తప్పులు చేస్తూ, ప్రజలలో అప్రతిష్టపాలవుతున్నారు.
ఇక ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా మాత్రం అసలు వాసిరెడ్డి పద్మపై ఏ దాడి జరగలేదేమో అన్న చందంగా వార్తలు ఇచ్చాయి. ఒకవేళ ఇదే పరిస్థితి టీడీపీ మహిళా నేతకు ఎదురైతే, చంద్రబాబు, టీడీపీ మీడియా తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. బ్యానర్ కథనాలు వచ్చేవి. తప్పు టీడీపీ వైపు ఉంది కనుకే ఆ సంబంధింత కథనాన్ని కనిపడి, కనిపించకుండా ప్రచురించారనుకోవచ్చు. ఏ ప్రభుత్వ హయాంలో ఇలాంటివి జరిగినా సహించరాదు. కాని సమాజంలో ఇలాంటి ఘటనలు వివిధ కారణాల వల్ల పెరుగుతూనే ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్ ఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి ఆందోళన కలిగించిందో తెలుసు. తెలంగాణలో కొద్ది రోజుల క్రితమే ఒక ప్రేమోన్నాది మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చంద్రబాబు పాలనలో తహశీల్దార్ వనజాక్షికి ఎదురైన చేదు అనుభవం, ఆ కేసులో ఏకంగా తన పార్టీ ఎమ్మెల్యేలని చంద్రబాబు ఎలా కాపాడే యత్నం చేశారో అంతా వినే ఉంటారు. అలా చేయడం తప్పు. ప్రభుత్వం ప్రభుత్వంగానే వ్యవహరిస్తే ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశంఉంటుంది. మరి చంద్రబాబుకు అవన్ని గుర్తుకు ఉండవా. వయసురీత్యా ఆయన బాగా పెద్దవాడు కావచ్చు. కాని ఏపీలో ఆయనకు ఒక కీలకమైన బాధ్యత ఉంది. అందువల్ల ఆయన మరింత అర్థవంతంగా ఉండాలి. లేకుంటే వచ్చే ఎన్నికలలో టీడీపీకి మరోసారి కర్రుకాల్చి వాతపెడతారని హెచ్చరించక తప్పదు.
-కొమ్మినేని శ్రీనివాస రావు
సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment