బాలికపై వాచ్‌మన్ అత్యాచారయత్నం
కీసర, న్యూస్‌లైన్: ఎనిమిదేళ్ల బాలికపై ఓ ఉన్మాది అత్యాచారయత్నం చేశాడు. చిన్నారి చాకచక్యంగా అతడి నుంచి తప్పించుకుంది. స్థానికులు నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం మండల పరిధిలోని రాంపల్లిలో చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రులు, ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన దంపతులు కొన్నేళ్ల క్రితం మండల పరిధిలోని రాంపల్లి గ్రామానికి వలస వచ్చారు.
స్థానిక హరిజనవాడ సమీపంలోని ఓ సిమెంట్ ఇటుకల తయారీకేంద్రంలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు(8) స్థానికంగా మూడో తరగతి చదువుతోంది. వేసవి సెలవులు ఉండడంతో బాలిక తమ్ముడితో కలిసి ఇంటి వద్దే ఉంటోంది. గురువారం మధ్యాహ్నం బాలిక తల్లిదండ్రులు ఇటుకల ఆర్డర్ విషయమై సమీపంలోని మల్లాపూర్‌కు వెళ్లారు. రాంపల్లి సమీపంలోని ఓ వెంచర్లో వాచ్‌మన్‌గా పనిచేసే ఉత్తరప్రదేశ్వాసి విజయేంద్రమిశ్రా మద్యం మత్తులో గురువారం మధ్యాహ్నం ఇటుకల తయారీకేంద్రం వద్దకు వచ్చాడు. తమ్ముడితో కలిసి ఉన్న బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు.
విజయేంద్ర మిశ్రా బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నం చేశాడు. భయాందోళనకు గురైన బాలిక అతడి నుంచి తప్పించుకొని గ్రామంలోకి పరుగులు తీసింది. అదే సమయంలో ఇటుకల తయారీకేంద్రానికి వస్తున్న బాలిక తల్లిదండ్రులు గమనించి ఏం జరిగిందని చిన్నారిని ఆరా తీశారు. ఏడుస్తూ బాలిక విషయం చెప్పింది. అక్కడి నుంచి పరారవుతున్న విజయేంద్ర మిశ్రాను బాలిక తల్లిదండ్రులు, స్థానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.