వాళ్లుగాని... ‘వీల’గాని వేశారంటే!
స్వచ్ఛ భారత్... మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పే ఉద్యమం. అయితే ఏళ్లుగా ఆరుబయటే కానిచ్చేందుకు అలవాటై పోయిన పల్లెజనాలు అంత తొందరగా వింటారా. బహిరంగ మలమూత్ర విసర్జన ఆపేస్తారా? మరెలా? మధ్యప్రదేశ్ అధికారులకో బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. తట్టడమే ఆలస్యం... రంగంలోకి దిగి సెహోర్, సాగర్, విదిషా జిల్లాల్లో 300 పైచిలుకు హిజ్రాలను పోగేశారు. వీరికి విజిళ్లు అందించారు. గౌరవ వేతనమూ ఇస్తున్నారు. విజిల్స్‌తో వీరేం చేస్తారనేగా మీ డౌటు? ఎవరైనా, ఎక్కడైనా బహిరంగంగా పనికానిచ్చేస్తూ వీరి కంట పడ్డారనుకోండి... వెంటనే గట్టిగా ఈల వేస్తారు. దాంతో జనం దృష్టి అటువైపు మళ్లుతుంది.
ఇంకేముంది బహిరంగ రాయుళ్లు సిగ్గుతో పరుగు లంకించుకోవాల్సిందే. ఎవరైనా మొండిఘటాలుంటే దగ్గరికి వెళ్లి మరీ... ఇలాంటి అనారోగ్యకరమైన పనులు చేయొద్దని నచ్చజెపుతారు. మీకెందుకని ఎవరైనా హిజ్రాలకు ఎదురుతిరిగే ధైర్యం చేయగలరా? అందుకే... ఈల మంత్రం బాగా పనిచేసి... పై మూడు జిల్లాల్లో బహిరంగంగా మలమూత్ర విసర్జన చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందట.