గోదావరిలో వరద తగ్గుముఖం
కొవ్వూరు : గోదావరిలో వరద తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఇన్ఫ్లో తగ్గడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం ఉదయం ఆరు గంటలకు గోదావరి నుంచి 2,62,086 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. సాయంత్రానికి ఇన్ఫ్లో మరింత తగ్గింది. ఆరు గంటల నుంచి 2,44,475 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీనిలో 14,100 క్యూసెక్కుల నీటిని ఉ«భయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు సరఫరా చేస్తున్నారు. తూర్పు డెల్టాకి 4,600, సెంట్రల్ డెల్టాకి 2,500, పశ్చిమడెల్టాకి ఏడు వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఆనకట్టకి ధవళేశ్వరం, మద్దూరు ఆర్మ్లలోని 109 గేట్లును 0.40 మీటర్లు, ర్యాలీ, విజ్జేశ్వరం ఆర్మ్ల్లోని 66 గేట్లును 0.50 మీటర్లు ఎత్తు లేపి వరదనీటిని దిగువకు విడిచిపెడుతున్నారు.
పశ్చిమ డెల్టాకి 7 వేల క్యూసెక్కుల నీరు విడుదల
ఇది ఇలా ఉండగా జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువకు 7 వేల క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాల నిమిత్తం విడిచిపెడుతున్నారు. జిల్లాలో ఏలూరు కాలువకు 1,180 క్యూసెక్కులు, ఉండి కాలువకు 1,714, నరసాపురం కాలువకు 2,020, గోస్తనీ(జీఅండ్వీ)కి 1,035, అత్తిలి కాలువకు 578 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.