Village atmosphere
-
పండగ పూట... ఊరు పిలుస్తోంది
నను గన్న నా ఊరుకు వందనం. నా మాటలు విని నాకు మాటలు చెప్పిన రావిచెట్టు అరుగుకు వందనం. సైకిల్ టైరును కర్రపుల్లతో పరుగులెత్తించే వేళ నన్ను విమానం పైలెట్‌లా ఫీలయ్యేలా చేసిన ఊరి వీధులకు వందనం. కరెంటు స్తంబం దగ్గర రేగుపళ్లను అమ్మిన అవ్వకు వందనం. దొంగ కొంగలను అదిలించక చేపలకు భద్రం చెప్పిన చెరువుకు వందనం. అక్కా.. పిన్ని... బాబాయ్ పలకరింపులకు వందనం. తప్పు చేస్తే ఉమ్మడిగా కలిసి ప్రేమగా విధించిన దండనకు వందనం. పండగొచ్చింది. ఊరెళ్లాలి. కోవిడ్ సమయం ఇది. జాగ్రత్తగా వెళ్లాలి. సురక్షితంగా తిరిగి రావాలి. పొలిమేరల్లో అడుగుపెడుతూనే జిల్లున తండ్రి పేరు వినపడుతుంది. ‘ఏయ్యా... నువ్వు వెంకన్న కొడుకువే కదా’... ‘ఏమ్మా... రామారావు మేష్టారి చివరమ్మాయివేగా’... ఊరికి అందరూ తెలుసు. ఊరు తన మనుషులను గుర్తు పెట్టుకుంటుంది. తల్లిదండ్రులతో పాటుగా పిల్లల్ని. పిల్లలతో పాటుగా తల్లిదండ్రులని. బ్యాగ్ పట్టుకుని నడుస్తూనే అవే వీధులు. అవే ఇంటి పైకప్పులు. అవే డాబాలు. అవే చిల్లర అంగళ్లు. కొన్ని ఏవో మారిపోయి ఉంటాయి. పాత దగ్గర కొత్తవి వచ్చి ఉంటాయి. మేకప్ కొద్దిగా తేడా. ముఖం అదే. చిర్నవ్వు అదే. కళ్లాపి చల్లిన ముంగిళ్లు ఎదురు పడతాయి. వాటి మీద వేసిన ముగ్గులు తమ రంగులను లెక్కపెట్టమంటాయి. ఒక తల్లి ఎవరో ముసుగు తన్ని నిద్ర పోతున్న పిల్లలను లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక ఇంటి మీద పాకిన గుమ్మడిపాదు తన కాయలను నీకివ్వను పో అంటూ ఉంటుంది. ఈ మనుషుల మధ్యే కదా బాల్యం గడిచింది అని గుండెలకు కొత్త గాలి ఏదో తాకుతుంది. పొద్దున్నే పాల కోసం గిన్నె పట్టుకుని వచ్చింది ఈ వీధుల్లోకే. అదిగో సుబ్బయ్య టీ అంగడి. మళ్లీ ఇస్తాలే అని తాగి మర్చిపోయిన ఒకటి రెండు టీల బాకీ గుర్తుకొస్తోంది. పుల్లట్లు వేసే కాంతమ్మ ఇంటికి కొంత దూరం నడవాలిలే. ఆ చట్నీ అంత రుచిగా ఎలా ఉంటుందో కెఎఫ్సి వాడికి తెలిసుంటే ఫార్ములా కొనుక్కొని వెళ్లేవాడు. పెద్ద శెట్టి అంగడి ఇంకా తెరవలేదు. పండక్కి అమ్మ చీటి రాసిస్తే ఈ అంగడిలోనేగా చక్కెర, బెల్లం, యాలకులు, సగ్గుబియ్యం, ఎండు కొబ్బరి కొనుక్కుని వెళ్లేది. బెల్లం పొట్లం కట్టాక చేయి సాచితే కొసరు అందేది. బుగ్గ పండేది. అబ్బ. కచ్చేరి అరుగు. ఉదయం అక్కడే పేపర్ చదవాలి. మధ్యాహ్నం అక్కడే గోలీలాడాలి. సాయంత్రం అక్కడే ట్రాన్సిస్టర్‌లో పాటలు వినాలి. పులిజూదం ఆటలో ఒలింపిక్స్ మొనగాళ్లు మామూలు లుంగీల్లో అక్కడే తిరుగాడుతుండేవారు. ఊరి వార్తలు చెవిలో పడేసే మహా మహా జర్నలిస్టులు రాత్రి కూడు తినేసి పై కండువా సర్దుకుంటూ వచ్చేసేవారు. అందరికీ నీడనిచ్చే అరుగు చెట్టు వేల కొద్ది గువ్వలకు పురుళ్లు పోసి పోసి పండిపోయి ఉండేది. అది ఆకులు రాల్చి మోడుగా నిలిచే రోజుల్లో ఊరు చిన్నబుచ్చుకుని ఉండేది. నాన్న సైకిల్ ఈ దారుల్లోనే తిరిగేది. అమ్మ చేయి పట్టుకొని తొలాటకు ఇటుగానే వెళ్లేది. ఐసు బండి వస్తే ఏ రంగుది కొనుక్కోవాలో తెలియక రెండు మూడు నిమిషాలు నెత్తి గీరుకునేది. గెలిచిన గోలీలు దొంగలించిన శీనుగాడి మీద నాలుగైదు వారాలు పగబట్టేది. ఊళ్లోని మేనత్త మేమమామలు అసలు చుట్టాలుగా అనిపించకపోయేది. రైలు దిగి వచ్చే బాబాయి పిన్నే తమను కూడా వెంటబెట్టుకుని వెళతారని సంబరం కలిగిచ్చేది. పండగ సెలవుల్లో స్కూలు మైదానంలో గాలిపటాలు ఎగిరేవి. తోకలు లేని పిట్టలు తోకలు ఉన్న పటాల దారాలు లాగేవి. బిళ్లంగోడు దెబ్బకు బిళ్ల గిర్రున గాలిలో లేచేది. హరిదాసు చిడతలకు వాకిట్లో ఇల్లు గుమిగూడేది. బుడబుడల డమరుకానికి పాత బట్టలనీ వెలికి వచ్చేది. గంగిరెద్దుల సన్నాయికి ఒక్కటే పాట వచ్చు. కొమ్మదాసులు చెట్టెక్కి దిగకపోయేది. పిట్టలదొరల కోతలకు పంట చేలు కూడా అచ్చెరువొందేవి. కోలాటానికి మోత ఫెళ్లుఫెళ్లున మోగేది. పులేషగాళ్లు నిమ్మకాయను పళ్లతో కొరికి భయపెట్టేవాళ్లు. తప్పెట్లు తాటాకు మంటల చివరలకు బెదరక సెగ పొందేవి. ఊరి దేవత ఊరేగింపు సంబరంగా జరిగేది. పిండి వంటలు లేని ఇల్లు ఎక్కడ? కనిపెట్టిన వారికి బహుమానమండోయ్. ఈ ఇంటి మనుబూలు.. ఆ ఇంటి అరిసెలు... పొరుగింటి లడ్లు... ఇరుగింటి పాయసం. పెద్దవాళ్లు అడక్క పోయినా పిల్లలకు సినిమాకు చిల్లర ఇచ్చేవారు. కొత్త సినిమాల పోస్టర్లు టైమ్ మొత్తం తినేసేవి. ఊరు వదిలి ఉపాధి కోసం వచ్చేశాము. ఊరు గుండెల్లోనే ఉంది. పండగ వచ్చిందంటే అది జాబు రాయకనే పిలుస్తుంది. ఊరిని చూడాలి. మళ్లీ బతకాలి. నేస్తుల్ని కలవాలి. ఊసులను రాసి పోయాలి. ఊరికి బయలుదేరుతున్నా. జాగ్రత్తలు తీసుకుంటున్నా. దూరం పాటిస్తా. పిల్లలను గుంపులో వెళ్లకుండా చూసుకుంటా. ఈ పండగను వదలుకోలేను. ఊరికి వెళతాను. కాని ఊరిని నా నుంచి నన్ను ఊరి నుంచి సురక్షితంగా ఉంచేలా వెళతాను. ఆల్ ది బెస్ట్ చెప్పండి. -
మహాత్ముడి కలకు ఒక ప్రతిరూపం...
పచ్చని పైరుల మైదానాలు.. పరుగులెత్తే లేగదూడల విన్యాసాలు... పిల్లకాల్వల్లో పిల్లల ఈదులాటలు.. ముగ్గుల ముస్తాబులు.. ఉత్సాహాన్నిచ్చే తిరునాళ్లు.. ఇవన్నీ పల్లెటూరుకు ఉన్న నిర్వచనాలు. ఈ నిర్వచనాలకు అతి దగ్గరగా ఉండే గ్రామమొకటుంది. ప్రపంచీకరణ వల్లనో, ప్రకృతి కటాక్షం లేకపోవడం వల్లనో.. చాలా పల్లెటూళ్లు శోభను కోల్పోతున్నాయి. కానీ ఆ పల్లెటూరు నిత్యం పచ్చగా ఉంటుంది. ‘గ్రామీణ స్వరాజ్యానికి’ నిర్వచనమిచ్చిన మహాత్ముడి కలలకు చాలా దగ్గరగా ఉంటుంది. మద్యపాన రహితంగా, కక్షకార్పణ్యాలకు దూరంగా ఉంటుంది. ఎంతటి గ్లోబలైజేషన్ కూడా ఆ గ్రామాన్ని మార్చలేదు. ఎందుకంటే.. అది ప్రకృతి సహజంగా, మానవుడి సహితంగా ఏర్పడిన పల్లెటూరు కాదు. కృత్రిమంగా ఏర్పరిచిన పల్లెటూరి వాతావరణం. గ్రామీణ జీవన సౌందర్యానికి నిలువెత్తురూపం. జాతిపిత మహాత్మాగాంధీ కలలకు ప్రతిరూపంగా, ఆయన విజన్‌కు దగ్గరగా ఉన్న గ్రామాన్ని వాస్తవ ప్రపంచంలో చూపడానికి అవకాశం లేదని అనుకున్నారో ఏమో కానీ.. కళాత్మక రూపంలో అలాంటి గ్రామాన్ని ఆవిష్కరించారు శ్రీ క్షేత్ర సిద్ధగిరి మఠం వాళ్లు. మహారాష్ర్టలోని కొల్హాపూర్ జిల్లా కన్వేరీ తాలూకాలో సహజత్వాన్ని ప్రతిబింబించే ఈ కృత్రిమ గ్రామాన్ని ప్రతిమల రూపంలో ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాల పట్ల విశ్వాసంతో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేసినట్టు మఠం వాళ్లు తెలిపారు. మొత్తం ఏడు ఎకరాల విస్తీర్ణంలో 300 ప్రతిమలతో, 80 దృశ్యాలుగా ఈ మ్యూజియమ్ ఏర్పాటు చేశారు. వివిధ వృత్తుల వాళ్లు తమ తమ పనులు చేసుకుంటున్నట్టుగా సహజత్వాన్ని ప్రతిబింబించేలా ఇక్కడ దృశ్యాలను ఆవిష్కరిం చారు. ఒక గ్రామంలో ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావర ణాన్ని ఆశిస్తారో, ఒక గ్రామం అంటే ఎలా ఉండాలని అనుకుంటారో... అలా ఉంటుంది ఈ మ్యూజియం.