మహాత్ముడి కలకు ఒక ప్రతిరూపం...
పచ్చని పైరుల మైదానాలు.. పరుగులెత్తే లేగదూడల విన్యాసాలు... పిల్లకాల్వల్లో పిల్లల ఈదులాటలు.. ముగ్గుల ముస్తాబులు.. ఉత్సాహాన్నిచ్చే తిరునాళ్లు.. ఇవన్నీ పల్లెటూరుకు ఉన్న నిర్వచనాలు. ఈ నిర్వచనాలకు అతి దగ్గరగా ఉండే గ్రామమొకటుంది. ప్రపంచీకరణ వల్లనో, ప్రకృతి కటాక్షం లేకపోవడం వల్లనో.. చాలా పల్లెటూళ్లు శోభను కోల్పోతున్నాయి. కానీ ఆ పల్లెటూరు నిత్యం పచ్చగా ఉంటుంది. ‘గ్రామీణ స్వరాజ్యానికి’ నిర్వచనమిచ్చిన మహాత్ముడి కలలకు చాలా దగ్గరగా ఉంటుంది. మద్యపాన రహితంగా, కక్షకార్పణ్యాలకు దూరంగా ఉంటుంది.
ఎంతటి గ్లోబలైజేషన్ కూడా ఆ గ్రామాన్ని మార్చలేదు. ఎందుకంటే.. అది ప్రకృతి సహజంగా, మానవుడి సహితంగా ఏర్పడిన పల్లెటూరు కాదు. కృత్రిమంగా ఏర్పరిచిన పల్లెటూరి వాతావరణం. గ్రామీణ జీవన సౌందర్యానికి నిలువెత్తురూపం. జాతిపిత మహాత్మాగాంధీ కలలకు ప్రతిరూపంగా, ఆయన విజన్‌కు దగ్గరగా ఉన్న గ్రామాన్ని వాస్తవ ప్రపంచంలో చూపడానికి అవకాశం లేదని అనుకున్నారో ఏమో కానీ.. కళాత్మక రూపంలో అలాంటి గ్రామాన్ని ఆవిష్కరించారు శ్రీ క్షేత్ర సిద్ధగిరి మఠం వాళ్లు. మహారాష్ర్టలోని కొల్హాపూర్ జిల్లా కన్వేరీ తాలూకాలో సహజత్వాన్ని ప్రతిబింబించే ఈ కృత్రిమ గ్రామాన్ని ప్రతిమల రూపంలో ఏర్పాటు చేశారు.
మహాత్మా గాంధీ సిద్ధాంతాల పట్ల విశ్వాసంతో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేసినట్టు మఠం వాళ్లు తెలిపారు. మొత్తం ఏడు ఎకరాల విస్తీర్ణంలో 300 ప్రతిమలతో, 80 దృశ్యాలుగా ఈ మ్యూజియమ్ ఏర్పాటు చేశారు. వివిధ వృత్తుల వాళ్లు తమ తమ పనులు చేసుకుంటున్నట్టుగా సహజత్వాన్ని ప్రతిబింబించేలా ఇక్కడ దృశ్యాలను ఆవిష్కరిం చారు. ఒక గ్రామంలో ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావర ణాన్ని ఆశిస్తారో, ఒక గ్రామం అంటే ఎలా ఉండాలని అనుకుంటారో... అలా ఉంటుంది ఈ మ్యూజియం.