నిశీథి వేళ.. ఇసుక జాతర!
♦ నిజాంపూర్ వాగులో నిబంధనలకు పాతర
♦ ప్రభుత్వ అవసరాల పేరిట భారీగా తరలింపు
♦ వాగులను చెరపడుతున్న ఇసుక మాఫియా
♦ గ్రామాభివృద్ధి కమిటీల పేరిట రూ.లక్షల్లో బేరం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో కొందరికి ఇసుక దందానే సర్వస్వం అయ్యింది. అక్రమార్జనకు అలవాటు పడిన వారు గాలి, నీరు కంటే ఇసుక ఆరోప్రాణంగా మారింది. వాగుల్లో ఇసుక తోడటానికి అలవాటైన వీరు కొద్ది రోజులుగా కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తున్నా.. అడ్డదారుల్లో వాగులను ఆక్రమించి తమ పని కానిచ్చేస్తున్నారు. నిర్మాణాలకు కీలకమైన ఇసుకకు డిమాండ్ అధికంగా ఉండటంతో ‘ప్రభుత్వ అవసరాల’ పేరిట అనుమతులు పొంది అక్రమంగా తరలిస్తూ ‘సొమ్ము’ చేసుకుంటున్నారు. వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా డంపులకు తరలించి.. ఆ తర్వాత యంత్రాలతో లారీలు నింపి హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిజాంపూర్ వాగులో నిబంధనలకు పాతరేస్తూ ప్రతి బుధవారం వందల ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. సాయంత్రం 5.30 గంటల తర్వాత ఇసుక తీయరాదన్న నిబంధనలను పాతరేసి రోజుకు 400 నుంచి 600 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. ఈ పాపంలో కాంట్రాక్టర్లు, కొందరు రెవెన్యూ అధికారులు ‘తిలా పాపం తలా పిడికెడు’లా పంచుకుంటుండం చర్చనీయాంశం అవుతోంది.
రెవెన్యూ సిబ్బందికి వాటాలు ఇస్తున్నాం..
నవీపేట మండలం నిజాంపూర్ వాగులో అధికారికంగా ఇసుక పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి బుధవారం అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ నిర్మాణాలు చేపడుతున్న గుత్తేదారులు కాకుండా వాగు చుట్టూ ఉన్న ఇసుక ట్రాక్టర్ల యజమానులు (అన్ని పార్టీల నాయకులు, ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు) ఒక రోజు ముందు (మంగళవారం) రాత్రి రెవెన్యూ అధికారులతో మంతనాలు జరిపి పని కానిచ్చేస్తున్నారు. ఇక్కడి నుంచి నవీపేటకే కాకుండా డిచ్పల్లి, నిజామాబాద్, బోధన్ వంటి దూరప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నట్లు వే బిల్లులు సిద్ధం చేసుకున్నారు. ఒక్కో వేబిల్లుకు రోజులో రెండు సార్లు అనుమతి ఉంటుంది. కానీ.. ఇక్కడ అధికారులు, ఇసుక మాఫియా కుమ్మక్కు కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా తోడేస్తుంటే రెవెన్యూ సిబ్బంది, నిజాంపూర్, బినోల కామ్దార్లు కబుర్లతో కాలం వెళ్లదీస్తున్నారు. ఒక్క ట్రాక్టర్‌ను కూడా తనిఖీ చేయకుండా,. ఇసుక మాఫియా ఏం చెబితే అదే చేస్తున్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో ట్రాక్టర్‌కు చట్ట విరుద్ధంగా రూ.300 వసూలు చేసి జేబులో వేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఇసుక పాయింట్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు అనుమతులు ఉంటాయి. ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తరలింపు జరిగింది. గత వారం గమనిస్తే సాయంత్రం 5 గంటల వరకు 180 ట్రాక్టర్లు తరలగా.. ఆ తర్వాత రాత్రి వరకు 310 ట్రాక్టర్ల ఇసుకను తరలించారు. ఈ విషయమై ఇసుక కాంట్రాక్టర్లను అడిగితే రెవెన్యూ సిబ్బందికి ముందుగానే వాటాలు ఇస్తున్నట్లు బహిరంగంగానే చెప్పడం చర్చనీయాంశం అవుతోంది.
ఇసుక తవ్వకాలకు కాదేవాగు అనర్హం
ఇసుక తవ్వకాలకు ఏ వాగు తక్కువ పోలేదు. ప్రభుత్వ అవసరాల పేరిట ‘మాఫియా’ వాగులను చెరబడుతోంది. మాక్లూర్ మండలం చిక్లీ వాగుల్లో నుంచి నెల రోజుల నుంచి రాత్రి పూట అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుతున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదు. చిక్లీ వాగు నుంచి, చిక్లీ క్యాంపు చెందిన ఇసుక వ్యాపారులు, చిక్లీ గ్రామాభివృద్ధి కమిటీ పేరిట దందా నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి నవీపేట మండలం జన్నేపల్లి, గాంధీనగర్, నాడాపూర్ గ్రామాలకు చెందిన వ్యాపారులు అక్రమంగా తరలిస్తున్నారు. గుంజిలి వాగు నుంచి టీఆర్ఎస్ పార్టీకి చెందిన మండల స్థాయి ప్రజాప్రతినిధి, మరికొందరు నాయకులు రాత్రి వేళలో ఇసుక తరలిస్తున్నారు. బొంకన్పల్లి వాగు నుంచి ప్రభుత్వ అనుమతి పేరిట రైల్వే పనుల కోసం ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ నాయకులు కొందరు ఈ దందా చేస్తున్నారు. మాక్లూర్, మాదాపూర్‌లకు చెందిన ఇద్దరు కీలక ప్రజాప్రతినిధులు, వారి ముఖ్య అనుచరులు మరో ఇద్దరు, గంగరమంద గ్రామానికి చెందిన ఒకరు కలిసి అవే వాగుల నుంచి రోజు ఇసుక తరలిస్తున్నారు. ఈ ఇసుక రెవెన్యూ, పోలీసు కార్యాలయాలు, అధికారుల ముందు నుంచే వెళ్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రతి రోజు రెండు వాగుల నుంచి సుమారు 15 నుంచి 25 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా.. జిల్లా వ్యాప్తంగా ఉన్న అనధికార ర్యాంపులను నుంచి రూ.లక్షల విలువ చేసే ఇసుక హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూరు, జగిత్యాల, కరీంనగర్ తదితర ప్రాంతాలకు తరలుతుంది.