Village Organizing Assistants
-
ప్రజలతో ఎలా వ్యవహరిస్తారు..?
బి.కొత్తకోట: ప్రజలతో మమేకం అయ్యేలా వారితో ఎలా వ్యవహరిస్తారు, ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు అంటే ఏమిటి అన్న ప్రశ్నలతో అధికారులు వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కోటావూరు, బండారువారిపల్లె, శీలంవారిపల్లె పంచాయతీలకు చెందిన వలంటీర్ అభ్యర్థులకు మండల ప్రత్యేక అధికారి శివశంకర్, ఎంపీడీఓ సుధాకర్, డెప్యూటీ తహసీల్దార్ చంద్రమునిలు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 100 మార్కులకు ప్రశ్నలు వేశారు. ములకలచెరువు: గ్రామ వలంటీర్ల కోసం దరఖాస్తులు చేసుకున్న గూడుపల్లి, వేపూరికోట, కదిరినాథునికోట పంచాయతీ అభ్యర్థులకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ ఎంపీడీఓ తాజ్మస్రూర్ గురువారం అన్నారు. మొత్తం 60 మందికి ఇంటర్వ్యూలు జరుగుతాయని అభ్యర్థులకు కేటాయించిన సమయానికి ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఎంపీడీఓ పేర్కొన్నారు. స్థానిక మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం జరిగిన గ్రామ వలంటీర్లకు జరిగిన ఇంటర్వ్యూల్లో 28 మంది హాజరయ్యారు. కాలువపల్లి, నాయనచెరువుపల్లెకు చెందిన 30 అభ్యర్థులకు గాను ఇద్దరు గైర్హాజరయ్యారు. పెద్దతిప్పసముద్రం: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం అంకిరెడ్డిపల్లి, బూచిపల్లి, సంపతికోట గ్రామాలకు చెందిన అభ్యర్థులకు వలంటీర్ల నియామకాలపై ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇన్చార్జి తహసీల్దార్ రెడ్డెప్ప, ఈఓఆర్డీ పద్మారాణి అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. శుక్రవారం మండలంలోని కాట్నగల్లు, రాపూరివాండ్లపల్లి, సంపతికోట గ్రామాల్లో దరఖాస్తు చేసుకుని వారి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లతో పాటు ఇంటర్వ్యూకు రావాలని ఫోన్ వచ్చిన వారు మాత్రమే హాజరు కావాలని అధికారులు కోరారు. తంబళ్లపల్లె: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు జరిగాయి. దిగువపాళ్యం, ఎగువసుగాలి తాండా, కన్నెమడుగు, మర్రిమాకుపల్లె, ఎర్రసానిపల్లె పంచాయతీల్లో 30 మంది దరఖాస్తుదారులకు గానూ 22 మంది మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వివిధ కారణాలతో 8 మంది గైర్హాజరైనట్లు డీటీ సుధాకర్‌బాబు తెలిపారు. -
బాబు వచ్చారు.. జాబు పోతుందా?
తుని :బాబు వస్తే జాబు వస్తుందంటూ ఎన్నికల ముందు తెలుగుదేశం నేతలు ఊదరగొట్టే ప్రచారం చేశారు. నిరుద్యోగులు, డ్వాక్రామహిళలు, రైతులు... ఇలా అన్ని వర్గాలపై వరాల జల్లులెన్నో కురిపించేశారు. తీరా అధికారంలోకి వచ్చాక దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మహిళా సంఘాల ఏర్పాటుతో మహిళలను లక్షాధికారులను చేసింది తామేనంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు, ఆ సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన యానిమేటర్లు (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్లు -వీఓఏ)లను విస్మరిస్తున్నారు. వారికి సక్రమంగా జీతాలందడం లేదు. జిల్లాలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న 1700 మంది వీఓఎలు 14 నెలలుగా జీతాలు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇప్పుడు తమ ఉపాధిపై అనుమానాలు వారిని పట్టిపీడిస్తున్నాయి. మహిళా సంఘాలకు మూలస్తంభాలు మహిళా సంఘాల ఏర్పాటు, వాటిని పటిష్టపరచడంలో యానిమేటర్ల పాత్ర ఎంతో ఉంది. గత తెలుగుదేశం జమానాలో ఏర్పాటైన పొదుపు సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు జిల్లా వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ద్వారా 1700 మంది యానిమేటర్లను 15 ఏళ్ల క్రితం నియమించారు. పేద వర్గాలకు చెందిన మహిళలను గుర్తించి వారితో సంఘాలను ఏర్పాటు చేయడం, పొదుపు వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం వీరి బాధ్యత. పుట్టిన పిల్లలను బంగారు తల్లి పధకంలో నమోదు చేయడం, ఆమ్ ఆద్మీ, అభయ హస్తం, ఐఎస్ఎల్, నిరుద్యోగుల వివరాలు సేకరణ తదితర పనులను కూడా వీరు చేస్తున్నారు. మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడం, తిరిగి బ్యాంకులకు కట్టించడం, నెలకు రెండు సార్లు మొబైల్ బుక్ కీపింగ్ వంటి విధులను నిర్వహిస్తున్నారు. డీఆర్డీఏ, గ్రామ సంఘాల నుంచి నెలకు రూ. రెండు వేలు వీరికి చెల్లించేవారు. జిల్లా సమాఖ్య నుంచి ఐడీ కార్డులు, నియామక పత్రాలు ఇవ్వాలని వారు సుదీర్ఘమైన పోరాటం చేసినా పట్టించుకోలేదు. 2013 మే 13వ తేదీన ప్రభుత్వం వీరందరికి రూ. 3500 జీతం ఇస్తామంటూ జీవో విడుదల చేసింది. అయితే క్షేత్ర స్థాయిలో ఆ జీఓ అమలు కాకుండా వాయిదా వేశారు. అప్పటి నుంచి తమకు జీతాలు చెల్లించడం మానేశారని వీఓఏలు చెబుతున్నారు. 25 రోజులుగా ఆందోళన పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా 1700 మంది వీఓఏలు విధులు బహిష్కరించి ఆందోళనలు చేస్తున్నారు. వీరికి 14 నెలల బకాయి కింద సుమారు రూ. 84 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో 60 శాతం ప్రభుత్వం, 40 శాతం గ్రామ సంఘాల నుంచి రావాలి. మహిళా సంఘాల ద్వారా చెల్లించాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లించాలని వీఓఏలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై డీఆర్డీఏ పీడీని కలిస్తే తమకు సంబంధం లేదని, మీరు ఎవరో తమకు తెలియదని సమాధానం ఇచ్చారని వీఓఏల సంఘం అధ్యక్షురాలు మాసా రాజేశ్వరి తెలిపారు. తమను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం జరిగేలా చూడాలని వీఓఏలు తుని శాసన సభ్యుడు దాడిశెట్టి రాజాను కలసి విన్నవించుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వారికి భరోసా ఇచ్చారు.