బాబు వచ్చారు.. జాబు పోతుందా? | Job For Each House,Chandrababu NaiduTakes U-Turn? | Sakshi
Sakshi News home page

బాబు వచ్చారు.. జాబు పోతుందా?

Published Fri, Aug 15 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

బాబు వచ్చారు.. జాబు పోతుందా?

బాబు వచ్చారు.. జాబు పోతుందా?

తుని :బాబు వస్తే జాబు వస్తుందంటూ ఎన్నికల ముందు తెలుగుదేశం నేతలు ఊదరగొట్టే ప్రచారం చేశారు. నిరుద్యోగులు, డ్వాక్రామహిళలు, రైతులు... ఇలా అన్ని వర్గాలపై వరాల జల్లులెన్నో కురిపించేశారు. తీరా అధికారంలోకి వచ్చాక దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మహిళా సంఘాల ఏర్పాటుతో మహిళలను లక్షాధికారులను చేసింది తామేనంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు, ఆ సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన యానిమేటర్లు (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్లు -వీఓఏ)లను విస్మరిస్తున్నారు. వారికి సక్రమంగా జీతాలందడం లేదు. జిల్లాలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న 1700 మంది వీఓఎలు 14 నెలలుగా జీతాలు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇప్పుడు తమ ఉపాధిపై అనుమానాలు వారిని పట్టిపీడిస్తున్నాయి.
 
 మహిళా సంఘాలకు మూలస్తంభాలు
 మహిళా సంఘాల ఏర్పాటు, వాటిని పటిష్టపరచడంలో యానిమేటర్ల పాత్ర ఎంతో ఉంది. గత తెలుగుదేశం జమానాలో ఏర్పాటైన పొదుపు సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు జిల్లా వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ద్వారా 1700 మంది యానిమేటర్లను 15 ఏళ్ల క్రితం నియమించారు. పేద వర్గాలకు చెందిన మహిళలను గుర్తించి వారితో సంఘాలను ఏర్పాటు చేయడం, పొదుపు వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం వీరి బాధ్యత. పుట్టిన పిల్లలను బంగారు తల్లి పధకంలో నమోదు చేయడం, ఆమ్ ఆద్మీ, అభయ హస్తం, ఐఎస్‌ఎల్, నిరుద్యోగుల వివరాలు సేకరణ తదితర పనులను కూడా వీరు చేస్తున్నారు. మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడం,
 
 తిరిగి బ్యాంకులకు కట్టించడం, నెలకు రెండు సార్లు మొబైల్ బుక్ కీపింగ్ వంటి విధులను నిర్వహిస్తున్నారు. డీఆర్‌డీఏ, గ్రామ సంఘాల నుంచి నెలకు రూ. రెండు వేలు వీరికి చెల్లించేవారు. జిల్లా సమాఖ్య నుంచి ఐడీ కార్డులు, నియామక పత్రాలు ఇవ్వాలని వారు సుదీర్ఘమైన పోరాటం చేసినా పట్టించుకోలేదు. 2013 మే 13వ తేదీన ప్రభుత్వం వీరందరికి రూ. 3500 జీతం ఇస్తామంటూ జీవో విడుదల చేసింది. అయితే క్షేత్ర స్థాయిలో ఆ జీఓ అమలు కాకుండా వాయిదా వేశారు. అప్పటి నుంచి తమకు జీతాలు చెల్లించడం మానేశారని వీఓఏలు చెబుతున్నారు.
 
 25 రోజులుగా ఆందోళన
 పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా 1700 మంది వీఓఏలు విధులు బహిష్కరించి ఆందోళనలు చేస్తున్నారు. వీరికి 14 నెలల బకాయి కింద సుమారు రూ. 84 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో 60 శాతం ప్రభుత్వం, 40 శాతం గ్రామ సంఘాల నుంచి రావాలి. మహిళా సంఘాల ద్వారా చెల్లించాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లించాలని వీఓఏలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై డీఆర్‌డీఏ పీడీని కలిస్తే తమకు సంబంధం లేదని, మీరు ఎవరో తమకు తెలియదని సమాధానం ఇచ్చారని వీఓఏల సంఘం అధ్యక్షురాలు మాసా రాజేశ్వరి తెలిపారు. తమను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం జరిగేలా చూడాలని వీఓఏలు తుని శాసన సభ్యుడు దాడిశెట్టి రాజాను కలసి విన్నవించుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వారికి భరోసా ఇచ్చారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement