ఆయన టీడీపీలో సీనియర్ నాయకుడు. చంద్రబాబు తర్వాత అంతటివాడని చెప్పుకునేవారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవులు అలంకరించారు. కానీ, రెండుసార్లు ప్రజలు ఆయన్ను ఓడించారు. అయినా గత ప్రభుత్వంలో మండలి ద్వారా మంత్రి పదవి పొందారు. టీడీపీలో ఇప్పుడాయన హవా ఆగిపోయింది. వచ్చే ఎన్నికల్లో సీటే ఇవ్వొద్దని పచ్చ బాస్ నిర్ణయించినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన కథేంటో చూద్దాం.
తునిలో బ్రేక్ ఎందుకు పడింది?
తెలుగుదేశం పార్టీలో పరిచయం అక్కరలేని నాయకుడు యనమల రామకృష్ణుడు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుండి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యనమల ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్‌గా, అనేక సార్లు మంత్రిగా పదవులు అనుభవించారు. ఎమ్మెల్యేగా ఓడిన తర్వాత రెండు మార్లు ఎమ్మెల్సీ అయ్యారు. 2009 ఎన్నికల్లో మొదటి సారి ఓటమిని చవిచూసిన యనమల అప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో తన సోదరుడు యనమల కృష్ణుడుని తునిలో టీడీపీ తరపున పోటీ చేయించినా ఓటమి తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసి అదృష్టం పరీక్షించుకుందామనుకుంటున్న కృష్ణుడుకి టీడీపీ అధిష్టానం బ్రేక్ వేసింది.
అన్న అసలే వద్దు, తమ్ముడి ఊసే వద్దు
ఇటీవల టీడీపీ నిర్వహించిన ఒక సర్వేలో యనమల సోదరులకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయట. దీంతో కృష్ణుడుకి సీటు ఇచ్చేది లేదని పార్టీ అధిష్టానం స్పష్టం చేసిందని సమాచారం. అంతేకాదు.. తనకు సీటు ఇవ్వకపోతే.. తన కుమారుడికైనా సీటు వస్తుందని కృష్ణుడు పెట్టుకున్న ఆశలపై కూడా చంద్రబాబు, లోకేష్‌లు నీళ్లు చల్లేశారట. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి యనమల రామకృష్ణుడు తన పెద్ద కుమార్తె దివ్యను పోటీ చేయించాలని భావించారట. కానీ, అక్కడ ఈక్వేషన్స్ సూట్ కాకపోవడంతో తుని నుండే దివ్యను పోటీ చేయించాలని భావించారట. దివ్యకే తుని టీడీపీ బెర్తు ఖాయమనుకున్న సమయంలో.. అనూహ్యంగా తెర మీదకు వచ్చారు తుని మాజీ ఎమ్మెల్యే రాజా ఆశోక్ బాబు.
ఎలాగు గెలవరు, మీకెందుకు టికెట్?
2009 ఎన్నికల్లో యనమల మొట్ట మొదటిగా ఓటమి చెందింది ఆశోక్ బాబు పైనే. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ఆర్ ఆశీస్సులతో అపట్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు ఆశోక్ బాబు. అలాగే 2019 ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయారు. ఐతే అలాంటి ఆశోక్ బాబును ఇటీవలే తన దగ్గరకు పిలుచుకుని మాట్లాడారు చంద్రబాబు నాయుడు. దీంతో ఆ ఫోటో ఇప్పుడు లోకల్ పేపర్లు..సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి ఆశోక్ బాబే అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు, తునిలో యనమల సోదరులు పట్టు కోల్పోయారని.. సీటు ఇచ్చేది లేదని యనమల సోదరులకు అధిష్టానం స్పష్టం చేసిందని తునిలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఐతే యనమల మాత్రం సీటు తన పెద్ద కుమార్తె దివ్యకే అన్న ధీమా లో ఉన్నారట. పార్టీయే పాతాళంలో కూరుకుపోతే..టీడీపీలో సీట్ల పంచాయితీ నడుస్తోంది. తుని సీటు పోతే పోయింది..ఈసారి తనకు రాజ్యసభ సీటు వస్తుందని యనమల తెలుగు తమ్ముళ్ళకు చెబుతున్నారట.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com.
Comments
Please login to add a commentAdd a comment