తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల వ్యవహారం పలువురు నేతల ఇళ్ళల్లో కుంపట్లు రగిలిస్తోంది. టీడీపీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇంట్లోనే అన్నదమ్ముల మధ్య యుద్ధం మొదలైంది. ఇద్దరి మధ్యా టిక్కెట్ పోరు రచ్చకెక్కింది. దశాబ్దాలుగా వెంట నడిచిన తమ్ముడిని ఇప్పుడు అన్న దూరం చేసుకున్నాడు. ఇంతకి తుని సీటు కోరిందెవరు? దక్కించుకున్నది ఎవరు? యనమల ఇంట రచ్చకు కారణం ఎవరు?
తెలుగుదేశం పార్టీలో సూపర్ సీనియర్ నాయకుల్లో ఒకరైన యనమల రామకృష్ణుడు 2009లో ఓడిపోయాక ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ దశాబ్దాలుగా తన వెంట నడుస్తూ... నియోజకవర్గంలో పనులు చక్కబెట్టుకుడుతున్న యనమల కృష్ణుడికి సీటు ఇప్పించారు. రెండుసార్లు ఓడిపోయినా... మూడోసారి కూడా తనకు సీటు కావాలని కృష్ణుడు డిమాండ్ చేశారు. తనకు ఇవ్వకపోయినా..తన కొడుక్కి అయినా ఇవ్వాలని ఇటు అన్నను.. అటు టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. తన అన్న కోసమే దశాబ్దాలుగా నియోజకవర్గంలో పనిచేస్తున్నందున తనకు కచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనని కృష్ణుడు ఒత్తిడి చేశారు. కాని పరిస్థితి రివర్స్ అయ్యింది.
చంద్రబాబు తర్వాత పార్టీలో తానే సుపీరియర్‌గా చలామణీ అవుతున్న యనమల రామకృష్ణుడు తన తమ్ముడి ప్రయత్నాలకు చెక్ పెట్టారు. ఈసారి తన కుమార్తె దివ్యకు కాకినాడు జిల్లా తుని అసెంబ్లీ సీటు ఇప్పించుకున్నారు. దీంతో యనమల ఇంట చిచ్చు రగిలింది. ఇదే సమయంలో దివ్య తన ఎన్నికల ప్రచారంలో బాబాయ్ కృష్ణుడు వర్గాన్ని దూరంగా ఉంచుతున్నారు. తనతో ప్రచారానికి రావొద్దని.. పార్టీ కార్యాలయంలోనే ఉంటూ..ఆఫీస్ పని చూసుకోవాలని కొద్ది రోజుల క్రిందట కృష్ణుడు ముఖ్య అనుచరుడైన శేషగిరికి యనమల కుమార్తె దివ్య స్పష్టం చేశారు. ఇలా తండ్రి..కూతుళ్ళు కృష్ణుడు.. అతని వర్గాన్ని దూరం పెట్టడంతో తునిలో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆరుసార్లు తుని నుంచి గెలిచిన యనమల రామకృష్ణుడు 2009లో ఓడిపోయారు. అదే సమయంలో యనమల టీడీపీ రాష్ట్ర రాజకీయాల్లో..ప్రభుత్వ పదవుల్లో బిజీగా ఉండటంతో తునిలో పార్టీ తరపున అన్ని పనులూ ఆయన తమ్ముడు కృష్ణుడు చూసుకునేవారు. కార్యకర్తలకు..పార్టీకి మధ్య వారధిగా పనిచేశారు. అందుకే యనమల రెండుసార్లు సిఫార్సుచేసి సీటు ఇప్పించినా కృష్ణుడు ఓడిపోయారు. మూడోసారి తనకు కాకపోయినా తన వారసుడికి అయినా ఇవ్వాలని కోరినా..అన్న రామకృష్ణుడు చక్రం తిప్పి తన కుమార్తెకు ఇప్పించుకున్నారు. దీంతో కృష్ణుడు అవమానతో రగిలిపోతున్నారు.
కనీసం ప్రచారంలో కూడా తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇక అన్నకు..తెలుగుదేశం పార్టీకి కూడా గుడ్‌బై చెప్పాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తమ్ముడు దూరమైతే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దివ్యకు కచ్చితంగా నష్టమే అంటున్నాయి టీడీపీ వర్గాలు.
Comments
Please login to add a commentAdd a comment