సాక్షి, కాకినాడ జిల్లా: రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం. ఆరు సార్లు ఎమ్మెల్యే. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దశాబ్దకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పచ్చ పార్టీలో నెంబర్ టూ అని చెప్పుకునేవారు. అయితే ఇప్పడాయనకు పార్టీలో కష్టం వచ్చి పడింది. వచ్చే ఎన్నికల్లో ఆయన కుటుంబానికి సీటు లేదంటున్నారట చినబాబు.
చదవండి: టీడీపీ స్పాన్సర్డ్.. ఫేక్ యాత్ర అసలు ‘లోగుట్టు’ ఇదే..
బాబు కంటే సీనియర్
తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడు చంద్రబాబు కంటే సీనియర్. ఎన్టీఆర్ హయాంలోను..ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలోనూ ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్‌గా.. ఆర్ధిక మంత్రిగా పని చేసిన ఆయన పార్టీలో నెంబర్ టూగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థికాంశాల్లో యనమల మాటను చంద్రబాబు దాటేవారు కాదని టాక్. అలాంటి నేతకు ఇప్పుడు పార్టీలో గడ్డు పరిస్దితులు ఎదురవుతున్నాయి.
యనమల శకం ముగిసినట్లే అన్న ప్రచారం కూడా సాగుతోంది. అసలు విషయానికి వస్తే.. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు తూర్పుగోదావరి జిల్లాలో తుని నుండి యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఖరారు చేశారు. ఇక అక్కడ నుండి వరుసగా ఆరు సార్లు అంటే 2004 వరకు.. తుని నుంచి యనమల విజయం సాధిస్తూ వచ్చారు. 2009 ఎన్నికల్లో తొలిసారిగా ఆయన గెలుపునకు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకుండా.. శాసనమండలికి వెళుతూ పార్టీలో చక్రం తిప్పుతున్నారు. ఎమ్మెల్సీగానే 2014 నుంచి విభజిత ఆంధ్రకు చంద్రబాబు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
వెన్నుపోటులో కీలక పాత్ర
తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడంలో యనమల ముఖ్య ప్రాత పోషించారు కూడా. ఇక 2009 ఓటమితో పోటీకి దూరంగా ఉన్న యనమల రామకృష్ణుడు 2014, 2019 ఎన్నికల్లో తుని నుండి తన సోదరుడు యనమల కృష్ణుడుని టిడిపి అభ్యర్ధి గా పోటీ చేయించారు. ఐతే ఈ రెండు పర్యాయాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి చేతిలో యనమల కృష్ణుడు ఓటమి చెందారు. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే తుని నియోజకర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడింది.
వచ్చే సాధారణ ఎన్నికల కోసం యనమల రామకృష్ణుడుతో పాటుగా.. ఆయన సోదరుడు కృష్ణుడు కూడా సిద్దమవుతున్నారు. తుని లేదా ప్రత్తిపాడు నుండి యనమల కృష్ణుడు లేదా ఆయన కుమారుడు పోటీ చేయాలని పధకం రచించారు. అలాగే యనమల తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరిని కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి బరిలోకి దింపాలని అనుకున్నారు. ఇందుకోసం గత టీడీపీ ప్రభుత్వంలోనే ప్లాన్ వేసుకుని కాకినాడ రూరల్ తిమ్మాపురంలో యనమల ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టించుకున్నారు.
బిల్లుతో దెబ్బపడింది.!
ఈ మధ్య కాలంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారు. మరోవైపు పచ్చపార్టీ అధినేత తనయుడు లోకేష్ కూడా ప్రత్యేకంగా అధ్యయనాలు చేయిస్తున్నారు. ప్రత్యేకంగా తుని నియోజకవర్గంపై చంద్రబాబు కంటే లోకేష్ ఎక్కువ పట్టుదల ప్రదర్శిస్తున్నారని సమాచారం. తాజాగా తుని నియోజకవర్గం నివేదిక లోకేష్ చేతిలో పండిందని సమాచారం. దాని ఆధారంగా యనమల కుటుంబానికి షాక్ ఇచ్చారట చినబాబు లోకేష్. వచ్చే ఎన్నికల్లో మీ కుటుంబానికి సీట్లు ఇచ్చేది లేదని యనమలతో లోకేష్ తేల్చి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.
తుని నియోజకవర్గంలో యనమల కుటుంబం కాకుండా మరో ప్రత్యామ్నాయంపై టీడీపీ దృష్టి సారించినట్లు తెలుగు తముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. లోకేష్ తుని నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టడానికి.. యనమల రామకృష్ణుడితో ఆయనకున్న వైరం గురించి పార్టీలో చర్చ సాగుతోంది. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన ఓ కాంట్రాక్టర్ బిల్లులు మంజూరు చేయమని లోకేష్ పంపించిన ప్రతిపాదనను అప్పటి ఆర్థిక మంత్రి యనమల వెనక్కి తిప్పి పంపేశారట. ముందుగా సీఎం చంద్రబాబుతో సంతకం చేయిస్తే.. ఆ తరువాత తాను సంతకం చేస్తానని యనమల మొండి పట్టుపట్టారట. దీంతో చేసేది లేక ఆ బిల్లులపై చంద్రబాబుతో సంతకం చేయించి మళ్ళీ ఆర్థిక మంత్రి యనమలకు పంపించారట. ఈ వ్యవహారంతో ఇద్దరికీ బెడిసికొట్టిందని సమాచారం.
చినబాబు వంతు
పోలవరం బిల్లు వ్యవహారం దగ్గరినుంచి యనమలపై రివెంజ్ తీర్చుకోవడానికి లోకేష్ ఎదురుచూస్తున్నారని సమాచారం. ఇప్పుడా అవకాశం వచ్చింది. తునిలో యనమల కుటుంబ సభ్యులకు సీటిస్తే... గెలిచే అవకాశం లేదని నివేదిక వచ్చిందట. ఇక దాని ఆధారంగా మీ కుటుంబానికి టిక్కెట్ లేదని చెప్పేశారట లోకేష్. వచ్చే ఎన్నికల్లో యనమల కుటంబానికి ఎక్కడా సీటు లభించకపోతే ఇక టీడీపీ రాజకీయాల్లో ఆయన శకం అంతరించినట్లే అనే టాక్ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment