భర్తను హత్యచేసిన భార్యకు జీవితఖైదు
అహ్మదాబాద్: శృంగారానికి నిరాకరించాడని భర్తను హతమార్చిన గుజరాత్ మహిళకు అహ్మదాబాద్ సిటీ కోర్టు జీవిత ఖైదు విధించింది. దోషిగా తేలిన విమ్లా వాఘేలా(54)కు యావజ్జీవ కారాగారంతో పాటు రూ. 2000 జరిమానా విధిస్తూ అడిషనల్ సెషన్స్ జడ్జి యుఎం భట్ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకుంటే మరో 6 నెలలు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించారు. 2013, నవంబర్ 2న నోబెల్ నగర్ లోని తనింట్లో భర్త నరసిన్హ్ తో గొడవపడి అతడిని హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించింది.
శృంగారానికి నిరాకరించడంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చార్జిషీట్ లో పోలీసులు పేర్కొన్నారు. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని కూడా ఆమె అనుమానించేది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయిన ఆమె కర్రతో భర్తపై దాడి చేసి హత్య చేసింది. తర్వాత ఇంటికి తాళం వేసి సర్దార్ నగర్ పోలీస్ స్టేషన్ వెళ్లి తన భర్త హత్యకు గురైనట్టు ఫిర్యాదు చేసింది. ఆమే హత్య చేసినట్టు పోలీసులు తర్వాత గుర్తించి అరెస్ట్ చేశారు.