ప్రేమ వ్యవహారమే ప్రాణం తీసిందా..?
పెందుర్తి: పాలిటెక్నిక్ విద్యార్థి కిల్లి వినయ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాదించినట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జీవీఎంసీ 71వ వార్డు పులగాలిపాలెంలో నివాసం ఉంటున్న వినయ్ బుధవారం హత్యకు గురికావడం తెలిసిందే. మృతుడు వినయ్ ఒకటి కంటే ఎక్కువ సిమ్‌కార్డులు వాడుతున్నట్లు తెలిసింది.
వీటి కాల్‌డేటా సమాచారం అధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ‘నువ్వంటే నాకిష్టం’ అని పెందుర్తి పరిసర ప్రాంతాల యువతి నుంచి వినయ్‌కు మొబైల్‌కు వచ్చిన మెసేజ్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. స్నేహితుల వాగ్మూలాన్ని బట్టి ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం కావచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కీలక సమాచారం వారు సేకరించినట్టు తెలుస్తోంది.
పథకం ప్రకారమే..: వినయ్‌ను హతమార్చేందుకు దుండగులు ముందస్తు పథకం వేసుకున్నట్లు నిర్ధారణ అయింది. వినయ్‌ను అంతమొందించేందుకు అతడి పశువుల శాలనే ఎంచుకున్నారు. పలుపుతాడు, పాలిథిన్ కవర్ ముందుగానే సిద్ధం చేసుకున్న హంతకులు వినయ్‌కు ఫోన్ చేసి పశువులశాల వద్దకు రప్పించారు. హత్యకు ముందు వారు పశువుల శాలకు సమీపంలోనే మందు పార్టీ చేసుకున్నారు. అనంతరం వినయ్ కాళ్లు చేతులు కట్టేసి పాలిథిన్ కవర్ సాయంతో హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు.
కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు
కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామని సీఐ కొండపల్లి లక్ష్మణమూర్తి తెలిపారు. వినయ్ చదువుతున్న కళాశాలలో వివరాలు సేకరించినట్టు ఆయన వివరించారు.