క్లాసిక్ డ్రైవర్స్ వింటేజ్ టూర్...
ప్రయాణం.. జీవితకాలం ఆనందాన్ని, అనుభవాన్ని ఇస్తుందంటారు! ఆ మాటను ఆన్‌వీల్ ఆస్వాదిస్తున్న గ్రూప్ ‘క్లాసిక్ డ్రైవర్స్ గ్రూప్’! ముంబై కేరాఫ్‌గా సాగుతున్న ఈ ‘సీడీజీ’ పది రోజుల కిందట సౌత్ ఇండియా టూర్ స్టార్ట్ చేసి బెంగళూరు మీదుగా హైదరాబాద్ చేరుకుంది. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తమ వింటేజ్ అండ్ క్లాసిక్ కార్లకు కాస్తంత విరామం ఇచ్చింది. ఈ సందర్భంగా జర్నీ విశేషాలను సిటీప్లస్ మోసుకొచ్చింది..
ముంబై.. హానిమన్ సర్కిల్.. వింటేజ్ క్లార్లంటే షోకున్న వాళ్లు ప్రతి ఆదివారం కలుసుకునే చోటు! పద్దెనిమిదేళ్ల కుర్రాళ్ల నుంచి డెబ్బై ఏళ్ల సీనియర్ సిటిజన్స్ వరకు .. వాళ్లకు ఇష్టమైన వింటేజ్ అండ్ క్లాసిక్ కార్లను తీసుకుని వస్తారు. కాఫీ తాగేసి కాసేపు డ్రైవ్ చేసి వెళ్లిపోతారు. ఇలా కొన్నేళ్లు గడిచేసరికి ఒకరిద్దరే అనుకున్న వింటేజ్ లవర్స్ సంఖ్య కొన్ని పదుల సంఖ్యకు చేరుకుంది. తామంతా ఓ సమూహంగా ఏర్పడితే బాగుంటుంది కదా అనుకున్నారు.
అంతే ‘క్లాసిక్ డ్రైవర్స్ గ్రూప్’గా ఒక వాహనంలోకి చేరారు. కానీ రొటీన్‌గా ఆ ముంబై మహా ట్రాఫిక్‌లో క్లాసిక్ కార్లేసుకుని చక్కర్లు కొట్టడం గొప్పగా అనిపించలేదు. ఏడాదికి పది రోజులైనా బహుదూరం ప్రయాణించాలనుకున్నారు. వింటేజ్ జర్నీ ఎంజాయ్ చేయాలనుకున్నారు. పన్నెండు కుటుంబాలు కలసి రాజస్థాన్ టూర్ వెళ్లారు. దారిలో వింటేజ్ లవర్స్‌ను కలిసి తమ జర్నీ గురించి వివరించారు. ఆసక్తి చూపిన వాళ్లను గ్రూప్‌లో చేర్చుకుని ముందుకు కదిలారు. ఆ ఉత్సాహంతోనే ఈ ఏడాది జర్నీ స్టార్ట్ చేసి హైదరాబాద్ చేరారు.
కనిష్టం నాలుగు.. గరిష్టానికి లెక్కలేదు
పన్నెండు ఫ్యామిలీలు ఈ టూర్‌కి వచ్చాయి. 1941 నాటి బ్యూక్ నుంచి 60ల్లోని షెవర్లే.. ఆడి.. ఫియట్, అంబాసిడర్ల వరకు పన్నెండు మోడల్స్ వాహనాలు వీళ్లను తిప్పుతున్నాయి. ఈ వింటేజ్ కార్ల ఓనర్లందరికీ ఈ షోకు వాళ్ల తాతల, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిందే. ఈ గ్రూప్‌లో ఉన్న అత్యంత పిన్న వయస్కుడు ముప్పయ్యేళ్ల అనిరుధ్ అనే బిజినెస్ మ్యాన్ తానే సొంతంగా నాలుగు వింటేజ్ కార్లను మెయింటెయిన్ చేస్తున్నాడు.
అందరికన్నా పెద్దవాడైన ఫలీదోండీ (70), మీడియాలో పనిచేస్తున్న హెచ్ఎన్ కామా, పైలట్ అయిన సచిన్హోగ్లే, షిప్‌యార్డ్‌లో ఉద్యోగం చేస్తున్న దినేష్‌లాల్ అనే వింటేజ్ ప్రేమికులను ‘మీ దగ్గరున్న ఇలాంటి కార్ల కలెక్షన్ సంఖ్య ఎంత’ అని అడిగితే ‘ఆ ఒక్కటీ అడగొద్దు’ అంటారు నవ్వుతూ.
తడవతడవకి ఒక కార్లో
వెళ్లడమే వీళ్లకు హాబీ. వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని క్షేమంగా గమ్యం చేరుస్తున్న తమ వాహనాలను ముద్దు చేస్తారు ఆ యజమానులు. ఎప్పుడైనా కదలకుండా మొరాయిస్తే అని అడిగితే.. ‘కదిలించే టూల్ బాక్స్ వెంట ఉంద’ని చెప్తారు. ఎవరి కారుకు వాళ్లే రిపేర్ చేసుకుంటారు. వీరి ఆడవాళ్లకు కూడా డ్రైవింగ్ వచ్చు. భర్తల సహవాసంతో వాళ్లూ వింటేజ్ మజాను ఆస్వాదిస్తున్నారు.
ఒకే కుటుంబంలా ..
‘వింటేజ్ హాబీ ఎక్కడెక్కడో ఉన్న మా అందరినీ ఒకే కుటుంబంలా కుదిర్చింది. టూర్లు లేకపోయినా నెలలో రెండు సార్లయినా కలుసుకుంటాం. పార్టీలు చేసుకుంటాం. ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా అందరం వాలిపోతాం. ఇక ఈ టూర్లు మమ్మల్ని మరింత దగ్గర చేస్తున్నాయి. కొత్తవాళ్లనూ మా కుటుంబంలో చేరుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని వింటేజ్ లవర్స్నూ కలిశాం. వాళ్లూ మా గ్రూప్‌లో చేరుతారు’ అని ఆనందంగా చెప్తారు వీళ్లు. ముంబై చేరుకొని కాస్త సేదతీరాక వచ్చే ఏడాది టూర్ ప్లాన్‌లో పడిపోతారటఈ క్లాసిక్ డ్రైవర్స్.
సాక్షి, సిటీప్లస్
వింటేజ్ కార్ టూర్ ఎంత ఉత్సాహంగా... ఉల్లాసంగా సాగుతుందో ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. దశాబ్దాల నాటి కార్లను వాటి యజమానులు ఎంత అపురూపంగా... మురిపెంగా చూసుకొంటున్నారో... వాటి ప్రత్యేకతను నేటి తరానికి తెలియజెప్పడానికి అంతే ఆసక్తి చూపుతున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తమ తమ కార్ల ముందు ఇలా ఫొటోలకు పోజులిచ్చి మురిసిపోయారు.