‘పండగ’ నేపథ్యంలో అత్యంత అప్రమత్తం
హైదరాబాద్: దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత గణేష్ సామూహిక నిమజ్జనం–మిలాద్ ఉన్ నబీ కలిసి వస్తున్న నేపథ్యంలో నగర పోలీసు విభాగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఏమరుపాటుకు తావియ్యకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఆయన ఆదివారం డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గస్తీ బృందాలైన బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ కార్ల సిబ్బంది సైతం ఇందులో పాల్గొన్నారు. ఈ కీలక ఘట్టాన్ని ప్రశాంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్ని స్థాయిల అధికారులకు ఆనంద్ సూచించారు.
కొత్త అధికారులకు మార్గదర్శనం..
పదోన్నతులు, ఎన్నికల సంఘం మార్గదర్శకాల నేపథ్యంలో జరిగిన బదిలీలతో అనేక మంది అధికారులకు స్థానచలనం తప్పలేదు. ఈ నేపథ్యంలోనే నగరంలోని కొందరు డీసీపీ, ఇన్స్పెక్టర్లు నగరానికి కొత్తగా రావడంతో వారికి ఇదే తొలి కీలక బందోబస్తుగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే వారికి మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వాహనాలకు పాసుల కేటాయింపు వరకు ప్రతి అంశాన్నీ కొత్వాల్ ఆనంద్ వివరించారు. నగర పోలీసు విభాగానికే అత్యంత కీలక ఘట్టమైన గణేష్ ఉత్సవాలు, నిమజ్జనానికి ఆరు అంచెల భద్రతా ప్రణాళికను పోలీసు కమిషనర్ అధికారులు, సిబ్బందికి వివరించారు. ఓపక్క భద్రత, మరోపక్క ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి స్పష్టమైన రోడ్‌మ్యాప్ విడుదల చేశారు.
ఈ వేడుకలు సజావుగా పూర్తి చేయడానికి ప్రతి దశలోనూ తీసుకోవాల్సిన చర్యలను విశిదీకరించారు. ఈ ఏర్పాట్లలో మొదటి దశ ఇప్పటికే ప్రారంభమైందని... విగ్రహాల ఖరీదు, తరలింపు, ప్రతిష్ట తదితరాలను దీని కిందికి వస్తాయని ఆనంద్ వివరించారు. వీటికి సంబంధించి నిర్వాహకులు పోలీసులు సమాచారం ఇచ్చేలా, ఆన్లైన్ విధానం వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. విగ్రహాల విక్రయ కేంద్రాలు, తరలింపు మార్గంతో పాటు ఊరేగింపు మార్గాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
రెండో దశ భద్రతా ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయి అధికారులు కచ్చితంగా ప్రతి మండపాన్నీ సందర్శించాలని, అక్కడ బారికేడ్లు, సూచికల బోర్డులు, సీసీటీవీలు, క్యూ నిర్వహణ, ట్రాఫిక్ అంశాలను తనిఖీ చేయాలని సూచించారు. మూడో దశలో విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆనంద్ స్పష్టం చేశారు. దీనికోసం నిర్వాహకులతో సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేయాలని, అన్ని విభాగాలతో సమన్వయంతో ముందుకు వెళ్ళాలని ఆదేశించారు.
నిమజ్జనంపై ప్రత్యేక దృష్టి
నాలుగు–ఐదు దశల్లో భాగంగా గణేష్ చవితి ముగిసిన మూడో రోజు నుంచి తీసుకోవాల్సిన చర్యలను విపులీకరించారు. అప్పటి నుంచి నిమజ్జనాలు జరిగే నేపథ్యంలో అవసరమైన క్రేన్ద్రాంల సంఖ్య, మోహరించాల్సిన ప్రాంతాలు గుర్తించాలని, ఊరేగింపు ముగిసిన తర్వాత గస్తీ కొనసాగాలని కొత్వాల్ స్పష్టం చేశారు. ఇలా చేయడం ద్వారా నిమజ్జనం అనంతరం తిరిగి వచ్చే వాహనాలు సురక్షితంగా, సామాన్యులకు ఇబ్బంది లేకుండా తమ గమ్యాలకు చేరుకోవడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు.
వీటిలో ప్రతి దశలోనూ హైకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని, వాటికి అనుగుణంగానే ముందుకు వెళ్లాలని ఆనంద్ స్పష్టం చేశారు. బేబీ పాండ్స్, తాత్కాలిక చెరువుల్లోనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా, అసాంఘికశక్తులకు చెక్ చెప్పడానికి ఈ ఉత్సవాలు ముగిసే వరకు సున్నిత ప్రాంతాలు, కీలక చోట్ల ఆకస్మిక వాహనాల తనిఖీ, బాంబు నిర్వీర్య బృందాల సోదాలు తప్పనిసరి చేయాలని, సోషల్‌మీడియా పైనా ఓ కన్నేసి ఉంచాలని ఆనంద్ స్పష్టం చేశారు.
‘ఈ ఏడాది జనవరి నుంచి జరిగిన పండుగలతో పాటు ప్రతి ఘట్టాన్ని శాంతియుతంగా పూర్తి చేశాం. అవన్నీ పోలీసు విభాగానికి క్వార్టర్, సెమీ ఫైనల్స్ అయితే... గణేష్ ఉత్సవాల బందోబస్తు, నిమజ్జనం నిర్వహణ ఫైనల్స్ వంటిది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని’ అని ఆనంద్ తన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు.