Violation of human rights
-
వీగర్లపై చైనా పంజా
చైనా వాయవ్యప్రాంతం షింజియాంగ్‌లో సర్కారీ దౌష్ట్యానికి లోనవుతున్న మైనారిటీ వీగర్ ముస్లింల విషయంలో ఐక్యరాజ్యసమితి పట్టనట్టు వ్యవహరిస్తున్నదని కొంతకాలంగా హక్కుల సంస్థలు చేస్తున్న ఆరోపణలకు బ్రేక్ పడింది. అక్కడ చైనా ప్రభుత్వం తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సంగతి నిజమేనని గురువారం విడుదలైన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ(యూఎన్హెచ్ఆర్సీ) నివేదిక నిర్ధారించింది. ఈ నివేదిక బయటకు రాకుండా ఆపడానికి చైనా చేయని ప్రయత్నం లేదు. దీన్ని పూర్తిగా బుట్టదాఖలయ్యేలా చూడాలనీ, కనీసం నివేదిక విడుదలను దీర్ఘకాలం వాయిదాపడేలా చూడాలనీ చైనా అనేక ఎత్తులు వేసింది. ఇప్పుడిక నివేదికను ఖండించే పనిలోపడింది. 48 పేజీల యూఎన్హెచ్ఆర్సీ నివేదికకు 122 పేజీల్లో బదులిచ్చింది. ఆ ప్రాంత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అణచేస్తున్నాం తప్ప సాధారణ పౌరుల జోలికి పోవటం లేదన్నది దాని సారాంశం. నియంతృత్వం, అణచివేత గాల్లోంచి ఊడిపడవు. వాటికి రాజకీయ కారణాలతోపాటు ఆర్థిక, భౌగోళిక, జాతి, మత, భాషాపరమైన కారణాలు కూడా ఉంటాయి. వరమో, శాపమో వీగర్ ముస్లింలు అత్యధికంగా ఉండే షింజియాంగ్ ప్రాంతం పర్వతాలు, అడవులు, ఎడారులతో నిండి ఉంటుంది. వాటిమధ్య బతకడానికి అనువైన చోటు ఎంచుకోవడం వారికి కష్టమే. అందుకే జనా వాసప్రాంతాలు విసిరేసినట్టు ఎక్కడెక్కడో ఉంటాయి. ఇరుగుపొరుగున రష్యాతోపాటు పలు మధ్య ఆసియా దేశాలుంటాయి. అందుకే దీన్ని నియంత్రించేందుకు ప్రస్తుత చైనా పాలకులు మాత్రమే కాదు... గతంలో పాలించినవారూ ప్రయత్నించారు. ఎందుకంటే ఇక్కడ అపారమైన ప్రకృతి సంపద ఉంది. పైగా వ్యూహాత్మకంగా చూస్తే పశ్చిమ దేశాలకు సమీపంగా, వాటిపై తన ప్రభా వాన్ని పెంచుకునేందుకు వీలుగా ఈ ప్రాంతం ఉంటుంది. భౌగోళికంగా చిన్నదే అయినా షింజి యాంగ్ ఎప్పుడూ బేలగా లేదు. చరిత్రలోకి తొంగిచూస్తే అనేక రాజరిక వ్యవస్థలకు అది కొరకరాని కొయ్యగా నిలిచింది. నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలకు చుక్కలు చూపింది. స్వయంప్రతిపత్తి నిలుపుకోవడమే లక్ష్యంగా పోరాడింది. 1949లో చైనా విప్లవ విజయానికి కాస్త ముందు ఆ ప్రాంతం స్వయంపాలనను రుచిచూసింది కూడా. కానీ జాతుల సమస్య విషయంలో కమ్యూనిస్టులకున్న అవగాహనను గౌరవించి కావొచ్చు... తొలిసారి వారికి తలవంచింది. ఆధిపత్య హాన్ జాతి పెత్తనమే ఇక్కడా కనబడటం, 1966–76 మధ్య సాగిన సాంస్కృతిక విప్లవకాలంలో అది మరింత బాహాటం కావడంతో మళ్లీ ఆ ప్రాంతం పోరుబాట పట్టింది. పథకం ప్రకారం వేరే ప్రాంతాలనుంచి హాన్ జనాభాను ఇక్కడికి తరలించడం, క్రమేపీ వారి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం పెంచడంతో వీగర్లు రగిలిపోయారు. 90వ దశకం మొదట్లో చెదురుమదురు నిరసనలుగా మొదలైన ఉద్యమం 2009 నాటికి తిరుగుబాటుగా మారింది. హింస చెలరేగి వందలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో 2014 నాటికి అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పూర్తిస్థాయి అణచివేత చర్యలకు ఆదేశాలిచ్చారు. అప్పటినుంచీ నరకానికి ప్రతీకలుగా ఉండే నిర్బంధ శిబిరాలకు లక్షలాదిమంది వీగర్లను తరలించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఉండే ఆ శిబిరాలు కిక్కిరిసి ఉంటున్నా యని వార్తలొస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈమధ్యవరకూ చైనా ఎవరినీ అనుమతించక పోవడంతో అనుమానాలు బలపడ్డాయి. సమితిలో కదలికలు రావడం మొదలయ్యాక శిబిరాల్లో పరిస్థితులు కొంత మారాయంటున్నారు. నిర్బంధితుల విడుదల కూడా చోటుచేసుకున్నదని కథనాలు వచ్చాయి. కానీ జరగాల్సినదాంతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. ఒక దేశ ఆంతరంగిక సమస్యగానో, సంబంధం లేని వ్యవహారమనో భావించి ప్రపంచ ప్రజానీకం ఈ నియంతృత్వ ధోరణులను చూస్తూ ఊరుకుంటే అంతటా ఇలాంటి పాలకులే తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈమధ్యే యూఎన్హెచ్ఆర్సీ హైకమిషనర్‌గా రిటైరైన మిషెల్ బాష్లెట్ చిలీలో పినోచెట్ పాలనాకాలంలో స్వయంగా నిర్బంధాన్ని అనుభవించినవారు. అందుకే ఆమె హైకమిషనర్‌గా వచ్చినప్పుడు అందరిలో ఆశలు చిగురించాయి. అందుకు తగ్గట్టు చైనా ఎంత మొండికేసినా దాన్ని ఒప్పించడానికి ఆమె ఓపిగ్గా ప్రయత్నించారు. పరిమిత సంఖ్యలోనైనా పాత్రికేయులను అక్కడి ప్రభుత్వం అనుమతించక తప్పని స్థితి ఏర్పడటం బాష్లెట్ విజయమే. కానీ ఏళ్లతరబడి నివేదిక వెలుగు చూడకపోవడం, అత్యంత అమానుషమైన ఉదంతాలు నిజమంటూనే వాటిని నరమేథంగా మాత్రం పరిగణించకపోవడం ఆమె పనితీరును ప్రశ్నార్థకం చేసింది. బక్క దేశాలపై ఆరోపణలు వచ్చినప్పుడు విరుచుకుపడే అగ్రరాజ్యాలు బలమైన దేశాలు కళ్లెదుటే దురాగ తాలకు పాల్పడుతున్నా పట్టించుకోవు. అరబ్ దేశాలు వీగర్ ముస్లింలకు ఏదో ఒరగబెడ తాయనుకోవడం దండగ. మతాన్ని కించపరిచారన్న ఆరోపణలపై తప్ప సాధారణ ముస్లింలపై జరిగే దాడుల విషయంలో అవి ఎప్పుడూ మౌనమే పాటిస్తాయి. చైనా రాక్షసత్వాన్ని నిగ్గుతేల్చడానికి మరింత లోతైన దర్యాప్తు అవసరమని నివేదిక తెలిపింది. యూఎన్హెచ్ఆర్సీ సభ్య దేశాలు అంగీకరిస్తేనే అది సాధ్యం. చైనా దీన్నెలాగైనా అడ్డుకుంటుంది. మొత్తానికి ఈ నివేదిక చైనా నేర వైఖరిని బయటపెట్టింది. ఉనికి కోసం, కనీస మానవ హక్కుల కోసం పోరాడుతున్న వీగర్ ముస్లింలకు నైతిక మద్దతునీయడం దేశదేశాల్లోని ప్రజాస్వామికవాదుల తక్షణ కర్తవ్యం. -
నరరూప రాక్షసులు: కిడ్నాప్ చేసి మానభంగం, ఆపై..
న్యూయార్క్: మానవ హక్కుల ఉల్లంఘనలో హేయనీయమైన ఘటనలు వెలుగులోకి రావడం కొత్తేం కాదు. కానీ, ప్రపంచమంతా ఉలిక్కిపడేలా దారుణాతిదారుణాలు ఆఫ్రికన్ దేశం కాంగోలో చోటుచేసుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బుధవారం ఓ మహిళ కథ.. అక్కడి రెబల్ గ్రూప్‌ల అరాచకాలను బయటపెట్టడంతో పాటు సభ్య దేశ్యాలను నివ్వెరపోయేలా చేసింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పరిస్థితులపై భద్రతా మండలిలో సాధారణ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా.. సోఫెపడి హక్కుల సంఘం అధ్యక్షురాలు, న్యాయవాది జూలియెన్నె లుసెంగె.. తూర్పు కాంగోలో తనకు తారసపడ్డ ఓ మహిళ కథను మండలికి వినిపించగా.. ఆమె ప్రసంగిస్తున్నంత సేపు అక్కడ నిశబ్ద వాతావరణం నెలకొంది. కాంగోలో ప్రభుత్వం, రెబెల్ గ్రూప్స్ మధ్య అంతర్యుద్ధం.. ఈ మే నెలలో తారాస్థాయికి చేరింది. ఆ పరిస్థితులు కాస్త తీవ్ర హింసకు దారి తీశాయి. ఈ తరుణంలో.. కోడ్‌కో అనే మిలిటెంట్ గ్రూప్ ఓ కుటుంబం నుంచి ఓ మహిళను ఎత్తుకెళ్లింది. పలుమార్లు ఆమెపై మానభంగానికి పాల్పడ్డారు ఆ గ్రూప్ సభ్యులు. ఆపై ఓ వ్యక్తిని ఆమె కళ్లెదుటే గొంతు కోసి హత్య చేశారు. ఆ శవం నుంచి పేగులు బయటకు లాగేసి.. వాటిని వండాలంటూ ఆమెకు ఆదేశించారు. రెండు కంటెయినర్ల నీళ్లు తెచ్చి.. భోజనం సిద్ధం చేయమన్నారు. ఆపై ఆమెతో మనిషి పచ్చి మాంసం బలవంతంగా తినిపించారు’ అంటూ భావోద్వేగంగా జూలియెన్నె ఆ ఘటనలను వినిపించారు. కొన్నిరోజుల తర్వాత ఆమెను విడిచిపెట్టింది ఆ గ్రూప్. కానీ, ఇంటికి వెళ్తున్న దారిలో ఆమెను మరొక మిలిటెంట్ ఎత్తుకెళ్లింది. పలుమార్లు మానభంగం చేశారు ఆ గ్రూప్‌సభ్యులు. అక్కడ ఆమెకు అలాంటి రాక్షస అనుభవమే ఎదురైంది. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు ఆమె తన ప్రాణాలనే పణంగా పెట్టుకుంది.. అని జూలియెన్నెకు భద్రతా మండలికి వినిపించారు. ఈ ఘటనను మండలి సంయుక్తంగా ఖండించింది. ఇలాంటి ఘటనలను నిలువరించాల్సిన అవసరం ఉందని, మానవ హక్కుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ ఆరోపణలపై కోడ్‌కో మిలిటెంట్ గ్రూప్‌గానీ, ఇతర సంస్థలుగానీ స్పందించలేదు. అంతర్యుద్ధంతో కాంగో నెత్తుటి నేలను తలపిస్తున్న వేళ.. గత 20 ఏళ్లుగా ఐరాస ప్రతినిధులు కాంగోలో శాంతి స్థాపనకు ప్రయత్నిస్తున్నా అది వీలుపడడం లేదు. Disclaimer: ఇందులోని కంటెంట్ ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు.. కేవలం పరిణామాలను తెలియజేయడానికే!. -
భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్ రికార్డు చేయడం నేరం: హైకోర్టు
Recording wife’s telephonic call without her consent is a blatant violation of her privacy చండీఘడ్: భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్‌ను భర్త రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. జనవరి 20, 2020 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ లిసా గిల ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. పంజాబ్‌లోని భటిండాకు చెందిన ఓ వ్యక్తి భార్య వేదింపులకు గురిచేస్తోందని, విడాకులు ఇప్పించమని కోర్టును ఆశ్రయించాడు. అందుకు సాక్షంగా ఫోన్ సంభాషణలను సమర్పించాడు. దీంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఫిబ్రవరి 20, 2007లో సదరు భార్యభర్తలిరువురికీ వివాహం జరిగింది. 2011 మేలో వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఐతే మనస్పర్ధల కారణంగా 2017లో విడాకులు కోరుతూ భర్త పిటిషన్ దాఖలు చేశాడు. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో జూలై 9, 2019న భార్య భర్తలిరువురి ఫోన్ సంభాషణకు సంబంధించిన సీడీ, సిమ్ కార్డులను సాక్షాలుగా సమర్పించాడు. దీన్ని సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. తనకు తెలియకుండా తన సంభాషణలను రికార్డు చేయడం గోప్యతను ఉల్లంఘించడమేనని వాదించింది. ఐతే భార్య వేధింపులకు సాక్షాలుగా మాత్రమే వీటిని సమర్పించామని, ఆమె గోప్యతకు భంగం కలిగించాలనే ఉద్దేశ్యంతోకాదని భర్త తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఫోన్ రికార్డులను సాక్షాలుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అంతేకాకుండా భార్య అనుమతి లేకుండా, ఆమెకు తెలియకుండా ఫోన్ సంభాషణలు రికార్డు చేయడం నేరమని పంజాబ్- హర్యానా హైకోర్టు వెల్లడించింది. ఈ సందర్భంగా ఫోన్ రికార్డింగ్‌లను సాక్ష్యంగా పరిగణించకుండా విడాకుల కేసుపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భటిండా ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. చదవండి: అదిరిపోయే స్కీమ్! ఈ సేవింగ్ స్కీమ్‌లో పొదుపు చేసిన సొమ్ము 124 నెలల్లో రెట్టింపవుతుంది! -
బాల్యవివాహాలు పిల్లల హక్కుల ఉల్లంఘనే!
భారత ప్రభుత్వం చట్టబద్ధ మైన వివాహ వయస్సును పెంచాలని భావిస్తోంది. అయితే వివాహాలకు చట్టబద్ధమైన వయస్సును పెంచడం ఒక్కటే సరిపోదు. ప్రధానంగా బాల్య వివాహం పిల్లల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇది వారి శారీరక వృద్ది, మానసిక, భావోద్వేగాల పెరుగుదల, విద్యావకాశాలపై కూడా వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఉత్తరాంధ్రలో కౌమారదశలోనే పెళ్లయి తల్లులైన వారితో బృంద చర్చలో, చిన్నవయసులోనే పెళ్లి చేయడం వల్ల తమ బాల్యాన్ని, ఆడుకునే, నేర్చుకునే స్వేచ్ఛను పోగొట్టుకున్నామని చెప్పారు. పెళ్లి కాగానే మానసికంగా సంసిద్ధం కాకుండానే ఆమె కుటుంబ పాత్రలు పోషిం చాల్సి వస్తోంది. భార్యగా, తల్లిగా, కోడలిగా బరువైన బాధ్యతలు స్వీకరించాల్సి రావడం మైనర్ బాలికకు కష్టమవుతుంది. దీంతో వారు ఒంటరితనానికి, కుంగుబాటుకు గురికావడానికి దారి తీస్తుంది. ప్రపంచంలోనే బాలికా వధువులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. మహిళలకు వివాహ వయస్సును 18 ఏళ్లుగా, పురుషులకు 21 ఏళ్లుగా స్థిరపర్చడం, బాల్యవివాహ నిషేధ చట్టాన్ని అమలుపర్చడం ఉనికిలో ఉన్నప్పటికీ దేశంలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలో బాల్య వివాహాలు 2005లో 47 శాతం ఉండగా ఇది 2015 నాటికి 27 శాతానికి పడిపోవడం మంచిదే కానీ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో బాల్యవివాహాలు అధికంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 20 నుంచి 24 ఏళ్ల వయసున్న మహిళల్లో 33 శాతం మందికి 18 ఏళ్ల లోపే పెళ్లవుతున్నట్లు ఎన్ఎఫ్హెచ్ఎస్–4 డేటా 2015–16 నివేదిక తెలిపింది. ఇక పురుషుల విషయానికి వస్తే 25 నుంచి 29 ఏళ్ల వయసున్న యువకుల్లో 21 ఏళ్లకు ముందే పెళ్లాడుతున్న వారు 11.8 శాతంగా ఉన్నారు. అదే తెలంగాణలో 20–24 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళల్లో 25.7 శాతం మంది వివాహం చేసుకుంటూండగా, 15–19 ఏళ్ల ప్రాయంలోని బాలికల్లో 14 శాతం మంది తల్లులవుతున్నారు. అయితే యంగ్ లైవ్స్ లాంగిట్యూడినల్ స్టడీ 2002 నుంచి తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న అధ్యయనం మరింత స్పష్టమైన చిత్రాన్ని ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2013లో 19 ఏళ్లలోపు వయసున్న బాలికల్లో 25 శాతం మంది చట్టబద్ధమైన వయసుకు ముందే పెళ్లాడుతున్నారని, 2020 నాటికి ఇది 14 శాతానికి పడిపోయిందని ఈ నివేదిక తెలిపింది. తెలంగాణలో కూడా 2013 నాటికి 19 ఏళ్ల లోపు వయసున్న బాలికల్లో 28 శాతం మంది చట్టబద్ద వయసుకు ముందే పెళ్లాడుతుండగా వీరి సంఖ్య 2020 నాటికి 17 శాతానికి పడిపోయింది. జిల్లాల వారీగా చూస్తే కడప, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 18 ఏళ్లకు ముందే వివాహ మాడుతున్న బాలికల సంఖ్య వరుసగా 20 శాతం, 24 శాతం, 27 శాతంగా నమోదైంది. ఈ జిల్లాల్లో కొన్ని మండలాల్లో ఇది 36 శాతం మేరకు అధికంగా నమోదైంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన 9 జిల్లాల్లోనూ, ఏపీలో 5 జిల్లాల్లో సంప్రదాయాలు, సామాజిక ఆచారాలు, విశ్వాసాలు, దారిద్య్రం వంటివి బాల్య వివాహాలకు ప్రధాన కారణం అవుతున్నాయి. పెద్దగా చదువుకోకపోవడం, విద్యావకాశాల లేమి కూడా వీటికి తోడవుతున్నాయి. రజస్వల అయితే చాలు పెళ్లీడు వచ్చేసినట్లే అని తల్లిదండ్రులు భావించడం, వారిలో అవిద్య, వలసలు, ఎక్కువమంది అమ్మాయిలు ఉండ టం వంటివి కూడా బాల్యవివాహాలను ప్రేరేపిస్తున్నాయి. చట్టం మాత్రమే ఈ దురాచారాన్ని అడ్డుకోలేదని, మార్పు అనేది కుటుంబం, కమ్యూనిటీ స్థాయి నుంచే ప్రారంభం కావాలని న్యాయనిపుణుల మాట. సెకండరీ విద్యను బాలికలకు అనుకూలంగా మలుస్తూ వారి రక్షణకోసం పెట్టుబడి పెట్టాలి. పేదలు బాలికలను బడికి పంపేలా చేయడానికి షరతులతో కూడిన నగదు బదిలీ చేయడం, 18 ఏళ్లదాకా నిర్బంధ విద్యను అందించడం మంచి ఫలితాలను తెస్తుంది. ముఖ్యంగా విద్య, బాల్యవివాహాలపై డేటా బ్యాంకును గ్రామీణ సంస్థలు ఏర్పర్చుకుంటే ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుంటుంది.' వ్యాసకర్త ఆర్థికవేత్త, సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ పి. పృథ్వీకర్ రెడ్డి మొబైల్ : 94408 90508 -
ఐరాసలో కశ్మీర్ ప్రస్తావన!
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల్లో చర్చల సందర్భంగా కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముందని ఐరాస ప్రధాన కార్యదర్శి అంటానియొ గ్యుటెరిస్ అధికార ప్రతినిధి స్టీఫానె డ్యుజారిక్ వెల్లడించారు. కశ్మీర్‌లోయలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, మానవహక్కుల ఉల్లంఘన తదితర అంశాలను వచ్చేవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ప్రధాన కార్యదర్శి గ్యుటెరిస్ లేవనెత్తవచ్చని పేర్కొన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం చర్చలేనన్న విషయాన్ని గ్యుటెరస్ బలంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. ‘ప్రస్తుత కశ్మీర్ సమస్య పరిష్కారంలో.. లోయలో మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని గ్యుటెరస్ అభిప్రాయపడ్డారని స్టీఫానె తెలిపారు. సాధారణ సభ సమావేశాలను ఈ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రధాన కార్యదర్శి ఉపయోగించుకోవచ్చన్నారు. అయితే, కశ్మీర్ పరిష్కారానికి భారత్ పాక్ ల మధ్య చర్చలే మార్గమని, వారు కోరితే ఇరువర్గాలకు ఐరాస కార్యాలయం అందుబాటులో ఉంటుందని, అదే సమయంలో మానవహక్కులకు సముచిత గౌరవం ఇవ్వాల్సిందేనని బుధవారం గ్యుటెరస్ అభిప్రాయపడిన విషయం ఇక్కడ గమనార్హం. ‘అక్కడ మానవ హక్కులను కచ్చితంగా గౌరవించాల్సిందే. అయితే, భారత్– పాక్‌ల మధ్య చర్చలే కశ్మీర్ సమస్యకు పరిష్కారమని నా విశ్వాసం’ అని నాడు పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు గ్యుటెరస్ సమాధానమిచ్చారు. కాగా, జమ్మూకశ్మీర్ భారత్ భూభాగం. దీనికి సంబంధించిన ఏ సమస్యలోనైనా.. ఐరాస లేదా అమెరికా.. ఎవరైనా సరే మూడో శక్తి ప్రమేయాన్ని అంగీకరించబోం’ అని ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారత్, పాక్‌లు కోరితేనే ఇందులో జోక్యం చేసుకుంటామని కూడా ఐరాస ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం భారత్, పాక్‌ల సంబంధాలు కనిష్ట స్థాయికి దిగజారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న న్యూయార్క్‌లో జరగనున్న ఐరాస సాధారణ సభ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతానని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేసిన విషయమూ విదితమే. అయితే, అదే సెప్టెంబర్ 27న భారత ప్రధాని మోదీ కూడా ఐరాస వేదికగా ప్రసంగించనుండటం విశేషం. దీటుగా సమాధానమిస్తాం ఐరాస వేదికపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తే అధమ స్థాయికి పాకిస్తాన్ దిగజారితే.. అందుకు భారత్ అత్యున్నత స్థాయిలో జవాబిస్తుందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తేల్చి చెప్పారు. గతంలోనూ ఇలా అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తిన సందర్భాల్లో భారత్ తిరుగులేని విధంగా వారికి జవాబిచ్చామన్నారు. ఇప్పటివరకు ఉగ్రవాద వ్యాప్తిలో పెరెన్నికగన్న పాకిస్తాన్.. ఇప్పుడు భారత్‌పై ద్వేష భావజాల ప్రచారాన్ని కూడా తలకెత్తుకుందని విమర్శించారు. -
‘కాశ్మీర్’పై అంతర్జాతీయ ప్రచారం
భారత సైన్యం మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ భారత్‌కు వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీలో తీర్మానం ఇస్లామాబాద్: జమ్మూకాశ్మీర్‌లో భారత సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని, ఈ దురాగతాలపై అంతర్జాతీయంగా ప్రచారం చేపడతామని పాకిస్థాన్ పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ శుక్రవారం పాకిస్థాన్ పార్లమెంట్ ఎగువసభలో ఓ ప్రకటన చేశారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ.. ఆక్రమిత కాశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘనలకు ఏడు లక్షల మంది భారత సైనికులే కారణమని, ఈ దురాగతాలపై అంతర్జాతీయ స్థాయి లో ప్రచారం చేపడతామన్నారు. ఈ ఉల్లంఘనలు నరేంద్ర మోదీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను ప్రతిబింబిస్తున్నాయని ఈ సందర్భంగా అజీజ్ అన్నట్టు రేడియో పాకిస్థాన్ పేర్కొంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ 224 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, గతం తో పోల్చితే ఇప్పుడు దాడుల తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించింది. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, అయితే భారత్ నుంచి సానుకూల స్పందన వ్యక్తం కావడం లేదని అజీజ్ పేర్కొన్నారు. మరోవైపు సరిహద్దుల్లో భారత్ చర్యలకు వ్యతిరేకంగా పాక్ జాతీయ అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది. అజీజ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకునేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరింది. మరోవైపు అంతర్జాతీయ సరిహద్దుల్లో భారత సైన్యం అక్రమంగా బంకర్లను నిర్మిస్తోందని ఆరోపించింది. అంతర్జాతీయ సరిహద్దుకు 500 మీటర్ల లోపుగా ఇరు దేశాలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని 2010లో చేసుకున్న ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించడమే అని పేర్కొంది. శాంతినే కోరుకుంటున్నాం: రాజ్‌నాథ్ గ్రేటర్ నోయిడా: సరిహద్దులో తాము శాంతినే కోరుకుంటున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) 53వ రైజింగ్ డే కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లోని బోర్డర్ ఔట్‌పోస్టులు, నివాస ప్రాంతాలపై పాకిస్థాన్ వరుస కాల్పులను ఆపాలని డిమాండ్ చేశారు. దీపావళి రోజునా పాక్ దళాల కాల్పులు జమ్మూ: దీపావళి రోజున, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్న సమయంలోనే పాకిస్థాన్ బలగాలు సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడ్డాయి. సాంబా, కతువా, జమ్మూ జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న బోర్డర్ ఔట్ పోస్టులు లక్ష్యంగా పాక్ దళాలు బుల్లెట్ల వర్షం కురిపించాయని బీఎస్ఎఫ్ ప్రతినిధి చెప్పారు. భారత బలగాలను రెచ్చగొట్టేందుకు పాక్ కాల్పులకు పాల్పడిందని పేర్కొన్నారు. కాగా, పూంచ్ జిల్లాలోని అధీన రేఖ వద్ద శుక్రవారం రాత్రి కూడా పాక్ సైన్యం భారత శిబిరాలపై కాల్పులు జరపగా భారత బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి. -
హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌కు అనుమతి ఇవ్వరా?: ఏవీ పటేల్
విశాఖపట్నం: హైదరాబాద్‌లో ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు అనుమతి లేదనడంపై సమైక్యాంధ్ర గెజిటెడ్ ఫోరం అధ్యక్షుడు ఏవీ పటేల్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆరోపించారు. విభజనకు వ్యతిరేకంగా తాము 15రోజుల్లో సమైక్యాంధ్ర ఉద్యమంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన చెప్పారు. అందులో భాగాంగానే త్వరలో ఉద్యమ కార్యాచారణ సిద్ధం చేస్తున్నామని ఏవీ పటేల్ తెలిపారు. హైదరాబాద్‌లో ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు అనుమతి లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చునని అన్నారు. ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌కు తెలియకుండానే .. రాష్ట్ర విభజనకు సిద్దమవ్వడం దారుణమని ఏవీ పటేల్ పేర్కొన్నారు.