‘కాశ్మీర్’పై అంతర్జాతీయ ప్రచారం
భారత సైన్యం మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది
పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్
భారత్‌కు వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీలో తీర్మానం
ఇస్లామాబాద్: జమ్మూకాశ్మీర్‌లో భారత సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని, ఈ దురాగతాలపై అంతర్జాతీయంగా ప్రచారం చేపడతామని పాకిస్థాన్ పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ శుక్రవారం పాకిస్థాన్ పార్లమెంట్ ఎగువసభలో ఓ ప్రకటన చేశారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ.. ఆక్రమిత కాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనలకు ఏడు లక్షల మంది భారత సైనికులే కారణమని, ఈ దురాగతాలపై అంతర్జాతీయ స్థాయి లో ప్రచారం చేపడతామన్నారు.
ఈ ఉల్లంఘనలు నరేంద్ర మోదీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను ప్రతిబింబిస్తున్నాయని ఈ సందర్భంగా అజీజ్ అన్నట్టు రేడియో పాకిస్థాన్ పేర్కొంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ 224 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, గతం తో పోల్చితే ఇప్పుడు దాడుల తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించింది. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, అయితే భారత్ నుంచి సానుకూల స్పందన వ్యక్తం కావడం లేదని అజీజ్ పేర్కొన్నారు. మరోవైపు సరిహద్దుల్లో భారత్ చర్యలకు వ్యతిరేకంగా పాక్ జాతీయ అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది. అజీజ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకునేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరింది. మరోవైపు అంతర్జాతీయ సరిహద్దుల్లో భారత సైన్యం అక్రమంగా బంకర్లను నిర్మిస్తోందని ఆరోపించింది. అంతర్జాతీయ సరిహద్దుకు 500 మీటర్ల లోపుగా ఇరు దేశాలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని 2010లో చేసుకున్న ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించడమే అని పేర్కొంది.
శాంతినే కోరుకుంటున్నాం: రాజ్‌నాథ్
గ్రేటర్ నోయిడా: సరిహద్దులో తాము శాంతినే కోరుకుంటున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) 53వ రైజింగ్ డే కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లోని బోర్డర్ ఔట్‌పోస్టులు, నివాస ప్రాంతాలపై పాకిస్థాన్ వరుస కాల్పులను ఆపాలని డిమాండ్ చేశారు.
దీపావళి రోజునా పాక్ దళాల కాల్పులు
జమ్మూ: దీపావళి రోజున, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్న సమయంలోనే పాకిస్థాన్ బలగాలు సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడ్డాయి. సాంబా, కతువా, జమ్మూ జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న బోర్డర్ ఔట్ పోస్టులు లక్ష్యంగా పాక్ దళాలు బుల్లెట్ల వర్షం కురిపించాయని బీఎస్‌ఎఫ్ ప్రతినిధి చెప్పారు. భారత బలగాలను రెచ్చగొట్టేందుకు పాక్ కాల్పులకు పాల్పడిందని పేర్కొన్నారు. కాగా, పూంచ్ జిల్లాలోని అధీన రేఖ వద్ద శుక్రవారం రాత్రి కూడా పాక్ సైన్యం భారత శిబిరాలపై కాల్పులు జరపగా భారత బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి.