violence in kashmir
-
అరుణ్ జైట్లీ ప్రకటనలో నిజమెంత..?
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో రాళ్ల దాడులు తగ్గుముఖం పట్టాయని...ఉగ్రవాదులు, తీవ్రవాదులకు నిధుల కొరత ఏర్పడిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే అధికారిక దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్‌లో పొందుపరిచిన వివరాలు, స్థానిక మీడియా కథనాలు విశ్లేషిస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. జమ్ము కశ్మీర్లో నోట్ల రద్దు నిర్ణయంతో సంబంధం లేకుండా రాళ్ల దాడులు యథావిథిగా కొనసాగుతున్నాయి. గత నెలలో కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బుద్గాం జిల్లాలో రాళ్లు విసురుతున్న అల్లరి మూకలను చెదరగొట్టేందుకు సైన్యం కాల్పులు జరిపింది. అంతకుముందు జూన్ 26న ఈద్ సందర్భంగా బారాముల్లా జిల్లాలో ఆందోళనకారులు రాళ్లు విసరడంతో 12 మంది గాయపడ్డారు. అదేరోజు అనంత్‌నాగ్, సోపియన్, కుల్గాం, పుల్వామా జిల్లాలు సహా కశ్మీర్ అంతటా అల్లర్లు చెలరేగాయి. మే 28నుంచి జూన్ 26 మధ్య రంజాన్ సందర్భంగా అల్లర్లలో 43 మంది మరణించడం ఇదే అత్యధికమని నివేదికలు చెబుతున్నాయి. నోట్ల రద్దు జరిగిన తర్వాత కాలంలో గత ఏడాదితో పోలిస్తే హింసాత్మక ఘటనలు మరింత పెరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
‘మా అభ్యర్థిని సీఎంగా పెడదాం.. కుదరదు’
న్యూఢిల్లీ: తమ పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా పెడితే జమ్ముకశ్మీర్‌లోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయంట. ఈ మేరకు ఈ విషయాన్ని ఇప్పటికే హైకమాండ్ స్థాయిలో చర్చ కూడా చేసినట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే, ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరిస్థితులకు తగినట్లుగా ముఖ్యమంత్రిని మార్చే విధానం తీసుకొస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ఇటీవల సీఎం మెహబూబా మఫ్తీతో ఢిల్లీ బీజేపీ పెద్దలు చర్చించారట. అయితే, ఆమె మాత్రం నో అని చెప్పేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మారాలంటే, కల్లోలిత పరిస్థితులు అదుపులోకి రావాలంటే కచ్చితంగా ముఖ్యమంత్రిగా తమ పార్టీ వ్యక్తిని పెడితేనే బాగుంటుందని బీజేపీ ఉన్నత శ్రేణి నేతలు ముఫ్తీతో చర్చించగా ఆమె అందుకు ఒప్పుకోలేదని సమాచారం. ఈ విషయంపై ఉదంపూర్ ఎంపీగా పనిచేస్తున్న బీజేపీ నేత జితేందర్ సింగ్‌ను ప్రశ్నించగా ‘దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ అనేది అందరితో కూడుకున్న ఆర్గనైజేషనల్ పార్టీ. సమయానికి తగినట్లుగా హైకమాండ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది’ అని ఆయన చెప్పారు. బుర్హాన్ వనీ సంఘటన జరిగినప్పటి నుంచి ముఫ్తీ కశ్మీర్లో పరిస్థితులు నియంత్రించలేకపోతున్నారు. బీజేపీతో కలిసి తమ విశ్వాసాన్ని దెబ్బకొట్టారంటూ కూడా ఆమెపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిపై జితేందర్ సింగ్ స్పందిస్తూ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కావాలని ఈ విధంగా విమర్శిస్తున్నారని, వారికి అధికారం వచ్చే అవకాశం రావొచ్చని ఆశపడే ఇలాంటి చర్యలకు దిగుతున్నారంటూ కొట్టి పారేశారు. అయితే, బీజేపీ సీఎం వస్తే ఈ పరిస్ధితులు సర్దుమణుగుతాయా అని మీడియా ప్రశ్నించగా తన నియోజకవర్గంలోని ప్రజలు మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అసలు ఏ మాత్రం ఇష్టపడటం లేదని చెప్పారు. -
పాకిస్థాన్ గురివింద తీరు
న్యూఢిల్లీ: ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తర్వాత కశ్మీర్ లో చోటుచేసుకున్న పరిణామాలపై భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రభుత్వం, ఇతర నేతలు మాట్లాడటంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజుజు మండిపడ్డారు. కశ్మీర్ ఆందోళనల అంశం భారత్ అంతర్గత విషయమని, ఇందులో పాక్ జోక్యం అవసరం లేదని అన్నారు. (చదవండి: 'ఒక్క బుర్హాన్‌ను కాల్చిచంపితే...') 'ఒక వేళ పాకిస్థాన్ బాధపడాలనుకుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) గురించి, అక్కడ జరుగుతోన్న హక్కుల ఉల్లంఘన గురించి బాధపడాలే తప్ప కశ్మీర్ గురించి కాదు'అని రిజిజు వ్యాఖ్యానించారు. బుర్హానీ ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో చోటుచేసుకున్న కాల్పులు మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయని, దీనిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం చేయాలని పాక్ ప్రధాని నవాజ్ షరీప్ ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే.