అరుణ్ జైట్లీ ప్రకటనలో నిజమెంత..?
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో రాళ్ల దాడులు తగ్గుముఖం పట్టాయని...ఉగ్రవాదులు, తీవ్రవాదులకు నిధుల కొరత ఏర్పడిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే అధికారిక దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్‌లో పొందుపరిచిన వివరాలు, స్థానిక మీడియా కథనాలు విశ్లేషిస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. జమ్ము కశ్మీర్‌లో నోట్ల రద్దు నిర్ణయంతో సంబంధం లేకుండా రాళ్ల దాడులు యథావిథిగా కొనసాగుతున్నాయి. గత నెలలో కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బుద్గాం జిల్లాలో రాళ్లు విసురుతున్న అల్లరి మూకలను చెదరగొట్టేందుకు సైన్యం కాల్పులు జరిపింది.
అంతకుముందు జూన్ 26న ఈద్ సందర్భంగా బారాముల్లా జిల్లాలో ఆందోళనకారులు రాళ్లు విసరడంతో 12 మంది గాయపడ్డారు. అదేరోజు అనంత్‌నాగ్, సోపియన్, కుల్గాం, పుల్వామా జిల్లాలు సహా కశ్మీర్ అంతటా అల్లర్లు చెలరేగాయి. మే 28నుంచి జూన్ 26 మధ్య రంజాన్ సందర్భంగా అల్లర్లలో 43 మంది మరణించడం ఇదే అత్యధికమని నివేదికలు చెబుతున్నాయి. నోట్ల రద్దు జరిగిన తర్వాత కాలంలో గత ఏడాదితో పోలిస్తే హింసాత్మక ఘటనలు మరింత పెరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.