సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేయడం భారత ఆర్థిక వ్యవస్థలోనే ఓ చరిత్రాత్మకమైన మలుపని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్థించుకున్నారు. పెద్ద నోట్లను రద్దుచేస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆర్థిక వ్యవస్థ పారదర్శకంగా మారిందని, స్వచ్ఛత నెలకొందని కూడా చెప్పుకున్నారు. అయితే ఆయన మాటల్లో స్వచ్ఛత ఎంతుందో ఆయనకే తెలియాలి. పెద్ద నోట్ల రద్దు వల్ల ఎంత నల్లడబ్బు వెలుగులోకి వచ్చిందో, జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)పై అది ఎంత ప్రభావం చూపిందో, దేశంలో ఎంత శాతం అవినీతి తగ్గిందో, టెర్రిరిజమ్, మావోయిజం ఏ మేరకు తగ్గిందో ఒక్కదానికి లెక్కచూపలేదు.
దేశ కరెన్సీలో 86 శాతం ఉన్న వెయ్యి రూపాయలు, ఐదు వందల రూపాయల నోట్లను గతేడాది నవంబర్ 8వ తేదీ నుంచి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెల్సిందే. దాదాపు దేశంలో 3.75 లక్షల కోట్ల రూపాయల నల్లధనం దాగుందని, పెద్ద నోట్ల రద్దుతో 3.5 లక్షల కోట్ల రూపాయల నల్లధనం వెనక్కి రాదని, అదంతా ప్రభుత్వానికి మిగిలినట్లేనని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం ఆర్థిక వ్యవస్థలో ఉన్న మొత్తం డబ్బు వచ్చి బ్యాంకులకు చేరడంతో ప్రభుత్వమే అవాక్కు అయింది.
పెద్ద నోట్ల మార్పిడి సందర్భంగా దాదాపు ఐదువేల కోట్ల నల్ల డబ్బు దొరకడం, కొన్ని వందల కోట్ల నోట్లను సముద్రంలో లేదా చెత్త కుప్పల్లో చించిపడేయం సానుకూల అంశాలు. ఏమైనా మేలు జరిగిందంటే ఈ దొరికిన డబ్బు. చించిన డబ్బే. అయినప్పటికీ బ్యాంకులకు దాదాపు మొత్తం పెద్ద నోట్ల డబ్బు చేరిందంటే నకిలీ కరెన్సీ కూడా అసలుగా మారిపోయి ఉంటుంది. అదే జరిగితే ఆర్థిక వ్యవస్థకు అది మరో దెబ్బ.
కొత్త నోట్లను ఓటీ అలవెన్సులు ఇచ్చి ముద్రించడానికి దాదాపు 30 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయన్నది ఓ ఆర్థిక సంస్థ అధ్యయనంలో తేలింది. అనియత ఆర్థిక వ్యవస్థలో (ఇన్‌ఫార్మల్ ఎకానమీ)లో 30 లక్షల ఉద్యోగాలు పోయాయన్నది మరో అంచనా. చిల్లర వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు ఎంతగా చితికిపోయారో అందరికి తెల్సిందే. గడువులోగా నోట్లను తీసుకునేందుకు, కొత్త నోట్లుగా మార్చుకునేందుకు ఏటీఎంలు, బ్యాంకుల ముందు రాత్రింబవళ్లు నిలబడి దేశవ్యాప్తంగా దాదాపు వందకుపైగా వృద్ధులు, నడివయస్కులు మరణించిన విషయం తెల్సిందే. వీరికి ఖరీదు కట్టేదెవరు?
పెద్ద నోట్లకు రద్దుకు ముందు అంటే, 2016, అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ 7.1 శాతం ఉండగా, 2017, ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి 5.7కు పడిపోయిందంటే అది పెద్ద నోట్ల రద్దు పర్యవసానం కాదా? మరి కారణం ఏమిటీ? చైనా వృద్ధి రేటు ఎందుకు పెరిగిందీ? మన దేశంలో చైనా ఉత్పత్తుల అమ్మకాలు ఏడాదిలో లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయంటే కారణం ఏమిటీ? ఈ లెక్కల గురించి అరుణ్ జైట్లీ ఒక్క ముక్కకూడా మాట్లాడలేదు. 18 లక్షల మంది అక్రమ డిపాజిట్‌దారులను గుర్తించామని చెప్పారు. అది అనుమానిత డిపాజిట్లు మాత్రమే అన్నది ఆయనకు తెలియదా? వారిలో సరైనవో, సరిచేసినవో లెక్కలు చూపే వారు ఉండరా? ఆ డిపాజిట్ల మొత్తం ఎంత? అందులో ప్రభుత్వానికి ఆదాయానికి వచ్చే వాటా ఎంత? పన్నుగట్టేవారు పెరిగారని కూడా మంత్రి అన్నారు. వాటి వివరాలు ఎందుకు వివరించలేదు? రిటర్న్‌లు చూపేవారు పెరిగారు గానీ, పన్నుగట్టేవారు పెద్దగా పెరగలేదన్నది పెద్ద మనుషులకు తెలియదా?
దేశంలో మావోయిస్టు కార్యకలాపాలు బాగా తగ్గాయని, జమ్మూ కశ్మీర్‌లో రాళ్లు విసిరే సంఘటనలు బాగా తగ్గాయని చెప్పారు. తగ్గడానికి నల్లడబ్బే కారణమా, ఇతర సామాజిక కారణాలు లేవా? అసలు ఇంతకు తగ్గాయా? కేంద్ర హోం శాఖ నుంచి వివరాలు తెప్పించుకొని అరుణ్ జైట్లీ వివరించవచ్చుగదా! మావోయిస్టు కార్యకలాపాలు తగ్గాయోమోగానీ కశ్మీర్‌లో రాళ్లు రువ్వే సంఘటనలు తగ్గలేదని పత్రికల్లో వస్తున్న వార్తలను చూస్తుంటేనే తెలుస్తోంది. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, ఫలితాన్ని వచ్చే తరం ఆదరిస్తుందని, ఆస్వాదిస్తుందని భవిష్యత్తు వైపు వేలుచూపించారు. భవిష్యత్తుకు ఇప్పుడు జోశ్యం చెప్పిన వాళ్లు రేపు భాష్యం చెప్పరా? దేశ, విదేశాల్లో దాచిన నల్లడబ్బు తీసుకొచ్చి జన్‌ధన్ యోజన ఖాతాల్లో 15 లక్షల రూపాయల చొప్పున జమచేస్తానన్న ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దుపై ఏమంటారో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment