కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్ జైట్లీ (పైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: పెద్దనోట్ల ( 500, 1000 రూపాయల) రద్దు ప్రకటించి రెండు సంవత్సరాలు పూర్తయింది. నల్లధాన్ని రూపుమాపేందుకు, అవినీతిపై అరికట్టేందుకు అంటూ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్ల చట్టబద్ధమైన మారక విలువను రద్దు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ డిమానిటైజేషన్‌ను సమర్ధించుకుంటూ ట్విటర్‌లో ట్వీట్ల పరంపర సాగించారు. అక్రమంగా నిలవ చేసిన డబ్బును నోట్ల రద్దుతో బ్యాంకులకు వచ్చే విధంగా చేశామని, పన్ను వసూళ్లు బాగా పెరిగాయంటూ తమని తాము ప్రశంసించుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల పరపంపరలో నోట్ల రద్దు కీలకమైందని, ఈ చర్య ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడంలో పెద్ద ప్రభావాన్ని చూపిందని జైట్లీ పేర్కొన్నారు.
మే, 2014 లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినపుడు ఆదాయపన్ను రాబడి మొత్తం 3.8 కోట్ల రూపాయలుంటే.. తమ ప్రభుత్వం ఆధీనంలో మొదటి నాలుగేళ్లలో 6.86 కోట్ల రూపాయలకు పెరిగిందని ట్వీట్ చేశారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారాన్నీ తగ్గించాం..కానీ పన్ను వసూళ్లు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. దేశ పౌరులకు మంచి జీవనవిధానాన్ని అందించాం. మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు, ఆదాయాన్ని సమకూర్చామంటూ చెప్పుకొచ్చారు. దీంతోపాటు ఒక వివరణాత్మక వ్యాసాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం విశేషం.
మరోవైపు పెద్దనోట్ల రద్దు కష్టాలు ఇంకా తమను పీడిస్తున్నాయని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెటిజనులు కూడా డీమానిటైజేషన్‌పై వ్యంగాస్త్రాలతో విరుచుకు పడుతున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నోట్లరద్దు చేపట్టి రెండేళ్లు గడిచిన సందర్భంగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. డిమానిటైజేషన్ చర్యను 'ఆర్థిక దుష్ప్రభావం' గా పేర్కొంది. ఎన్‌డీఐ ప్రభుత్వం అనాలోచిత చర్య కారణంగా, చిన్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, 120 మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడింది. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీని దేశం ఎప్పటికీ క్షమించదని దుయ్యబట్టింది.
ఆర్థిక రంగంలో అనాలోచిత చర్యలు ఎకానమీపై ఎంతటి దుష్ర్పభావాన్ని పడవేస్తాయో, జాతికి దీర్ఘకాలికంగా ఎంతటి నష్టమో ఈ రోజు (నోట్ల రద్దు రెండేళ్లయిన సందర్భంగా) స్పష్టమవుతోందని మాజీ ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి కూడా అయిన మన్‌మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఆలోచించి, అతి జాగ్రత్తగా ఆర్థిక విధానానాలను చేపట్టాల్సి అవసరం వుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సంప్రదాయక స్వల్పకాలిక విధాన నిర్ణయాలకు స్వస్తి పలికి దేశ ఆర్థికస్థిరత్వానికి మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరాన్నినొక్కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment