‘మా అభ్యర్థిని సీఎంగా పెడదాం.. కుదరదు’
న్యూఢిల్లీ: తమ పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా పెడితే జమ్ముకశ్మీర్‌లోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయంట. ఈ మేరకు ఈ విషయాన్ని ఇప్పటికే హైకమాండ్ స్థాయిలో చర్చ కూడా చేసినట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే, ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరిస్థితులకు తగినట్లుగా ముఖ్యమంత్రిని మార్చే విధానం తీసుకొస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ఇటీవల సీఎం మెహబూబా మఫ్తీతో ఢిల్లీ బీజేపీ పెద్దలు చర్చించారట. అయితే, ఆమె మాత్రం నో అని చెప్పేసినట్లు తెలుస్తోంది.
కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మారాలంటే, కల్లోలిత పరిస్థితులు అదుపులోకి రావాలంటే కచ్చితంగా ముఖ్యమంత్రిగా తమ పార్టీ వ్యక్తిని పెడితేనే బాగుంటుందని బీజేపీ ఉన్నత శ్రేణి నేతలు ముఫ్తీతో చర్చించగా ఆమె అందుకు ఒప్పుకోలేదని సమాచారం. ఈ విషయంపై ఉదంపూర్ ఎంపీగా పనిచేస్తున్న బీజేపీ నేత జితేందర్ సింగ్‌ను ప్రశ్నించగా ‘దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ అనేది అందరితో కూడుకున్న ఆర్గనైజేషనల్ పార్టీ. సమయానికి తగినట్లుగా హైకమాండ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది’ అని ఆయన చెప్పారు.
బుర్హాన్ వనీ సంఘటన జరిగినప్పటి నుంచి ముఫ్తీ కశ్మీర్‌లో పరిస్థితులు నియంత్రించలేకపోతున్నారు. బీజేపీతో కలిసి తమ విశ్వాసాన్ని దెబ్బకొట్టారంటూ కూడా ఆమెపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిపై జితేందర్ సింగ్ స్పందిస్తూ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కావాలని ఈ విధంగా విమర్శిస్తున్నారని, వారికి అధికారం వచ్చే అవకాశం రావొచ్చని ఆశపడే ఇలాంటి చర్యలకు దిగుతున్నారంటూ కొట్టి పారేశారు. అయితే, బీజేపీ సీఎం వస్తే ఈ పరిస్ధితులు సర్దుమణుగుతాయా అని మీడియా ప్రశ్నించగా తన నియోజకవర్గంలోని ప్రజలు మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అసలు ఏ మాత్రం ఇష్టపడటం లేదని చెప్పారు.