వీఐపీ అల్లుళ్లు
ఇందూరు : ప్రొఫెసర్ కోదండరాం,రాజనర్సింహా
మోర్తాడ్ : మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
జంగంపల్లి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
రెంజల్ : ఏపీ వైఎస్సార్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌రెడ్డి
దోమకొండ : సినీ నటుడు రామ్‌చరణ్
నవీపేట : కోడళ్ల జాబితాలో ఎంపీ కవిత
కామారెడ్డి : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే . అలాగే ఏ తల్లి కొడుకైనా ఓ ఇంటికి అల్లుడు కావాల్సిందే. ఏ బిడ్డ అయినా ఓ ఇంటికి కోడలుగా వెళ్లాల్సిందే. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారందరూ అందరిలాగే ఓ ఇంటికి అల్లుళ్లు, కోడళ్లవుతారు. అలా మన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెళ్లి చేసుకున్న ‘వీఐపీ అల్లుళ్లు’ ఎందరో ఉన్నారు. అలాంటి అల్లుళ్లపై ‘సాక్షి’ సండే స్పెషల్.
తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకుని రాష్ట్ర ఏర్పాటు దాకా ముందుండి నడిచిన ప్రొఫెసర్ కోదండరాం,సినిమా హీరో రాంచరణ్‌తేజ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, నెల్లూరు జిల్లాకు చెందిన ఏపీ వైఎస్సార్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి... ఇలా ఎందరో ఈ జిల్లాకు అల్లుళ్లయ్యారు. అలాగే నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జిల్లాకు కోడలయ్యారు.
వీరినే చేసుకున్నారు..
తెలంగాణ జాయింట్ యూక్షన్ కమిటీ కన్వీనర్‌గా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ప్రొఫెసర్ కోదండరాం ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన సుశీలను వివాహమాడారు. సినీనటుడు రాంచరణ్‌తేజ దోమకొండ సంస్థాన వారసుడు అనిల్ కామినేని కూతురు ఉపాసనను వివాహ మాడారు. వీరి వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. పెళ్లికి ముందు, పెళ్లి తరువాత రాంచరన్ దోమకొండ కోటకు పలుమార్లు వచ్చి వెళ్లారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా నిజామాబాద్ నగరానికి చెందిన పద్మినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన కావ్యను వివాహమాడారు. కావ్య వాళ్ల కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటోంది. బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వచ్చివెళ్తుంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి రెంజల్‌కు చెందిన గీతను వివాహమాడారు. రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మాత్యులు అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి మన జిల్లా అల్లుడే. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన విజయను వివాహం చేసుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి సదాశివనగర్ సంస్థానానికి చెందిన సీతను వివాహమాడారు. సీత కూడా మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉస్మానియూ ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు నిజామాబాద్ నగరానికి చెందిన అఖిలేశ్వరిని వివాహమాడారు. వక్తగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి జిల్లాకు వచ్చినపుడు ఆయన అత్తారింట వచ్చివెళతారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంత్‌రావు నవీపేట మండలం జన్నెపల్లికి చెందిన వాణిని వివాహమాడారు. సీఎం కేసీఆర్ తనయ, ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నవీపేటకు చెందిన అనిల్‌కుమార్‌ను వివాహమాడారు. దీంతో ఆమె ఈ జిల్లాకు కోడలిగా వచ్చి ఇక్కడే ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అత్తారింట జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరవుతారు.