భయం..భయం
బంజారాహిల్స్: కేబీఆర్ పార్క్ వద్ద బుధవారం పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై కాల్పుల ఘటనపై వాకర్లను భయాందోళనకు గురిచేసింది. పార్కులో సుమారు రెండువేల మంది వాకింగ్ చేస్తున్న సమయంలో ఇది జరగడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. పార్కు బయట పోలీసు బందోబస్తు లేకపోవడం వల్లనే వాకర్లకు భద్రత కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వీవీఐపీలు ఈ పార్కులో వాకింగ్ చేస్తుంటారు. కాల్పులు జరిగిన సమయంలో పలువురు ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, ఆభరణాల వ్యాపారులు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పార్కు లోపల ఉన్నారు. దీనికి తోడు పలువురు సినీ ప్రముఖులు కూడా వాకింగ్ చేస్తున్న సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఏ మాత్రం భద్రత లేదని...కనీసం మెటల్ డిటెక్టర్లు కూడా ఏర్పాటు చేసిన పాపానపోలేదని పార్కు నిర్వాహకులపై వాకర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంఘటన జరిగినప్పుడే పోలీసులు, అధికారులు హడావుడి చేస్తారు తప్పితే భద్రతను గాలికి వదిలేస్తున్నారని దుయ్యబట్టారు. కేబీఆర్ పార్కు చుట్టూ పలు ప్రాం తాలను ఎంచుకొని నిఘా ఉంచాల్సిన అధికారులు ఆ దిశలో చర్యలు తీసుకోలేదు. అంతేకాదు పార్కును అటవీ శాఖ నిర్వహిస్తుండగా పార్కు బయట ప్రాం తాన్ని హెచ్ఎండీఏ ఆధీనంలో ఉంచుకుంది. పార్కు బయట రోడ్డును పోలీసులు నియంత్రిస్తున్నారు. ఈ మూడు శాఖల మధ్య ఏ మాత్రం సమన్వయం లేదు. పార్కులోపల పోలీసులను నిఘాలో ఉంచుతామని పలుమార్లు బంజారాహిల్స్ పోలీసులు సూచించినా నిర్వాహకులు మాత్రం అందుకు అనుమతించలేదు. మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగవని గ్యారెం టీ లేదంటూ వాకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిఘూ పెంచాలి..
కేబీఆర్ పార్కు వద్ద భద్రత పెంచాలి. ఈ వ్యవహారంపై తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. వేలాది మంది వాకర్లు నడిచే పార్కు వద్ద ఏకే 47 గన్‌తో ఒక ఆగంతకుడు కాల్పులు జరిపాడంటే భద్రత ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. - కారుమూరి వెంకట నాగేశ్వర్రావు,
మాజీ ఎమ్మెల్యే
భద్రత లేకుండా పోయింది..
పార్కు బయట అవుట్‌పోస్టు ఉండేది. ఇటీవల దాన్ని తొల గిం చారు. దీంతో ఇక్కడ పోలీసులు లేకుండా పోయారు. ఇటీవల ఇక్కడ కార్లలో దొంగతనాలు కూడా పెరిగిపోయాయి. పర్సులు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు తస్కరించిన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మొబైల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. అవుట్ పోస్టును పునరుద్దరించాలి.
- జయవీర్‌రెడ్డి, కేబీఆర్ పార్కు సెక్రటరీ
భయమేస్తోంది..
నిత్యానందరెడ్డిపై కాల్పుల వ్యవహారం మాలో తీవ్ర భయాన్ని రేకెత్తించింది. ఇక్కడ పోలీసు నిఘా ఉండి ఉంటే ఆగంతకుడు దొరికేవాడు. ఉదయం పూట ఈ సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. అందులోనూ ఏకే 47తో ఆగంతకుడు కేబీఆర్ పార్కు వద్ద సంచరించిన విషయం తలుచుకుంటేనే భయమేస్తుంది. - సీఎస్‌రెడ్డి, వాకర్