వీరూలో ఆ తపన చచ్చిపోయింది!
న్యూఢిల్లీ: దాదాపు ఏడేళ్ల క్రితం వీరేంద్ర సెహ్వాగ్ భారత జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే అతను దాంతో నిరుత్సాహ పడలేదు. వెంటనే తన కోచ్ ఏఎన్ శర్మ వద్దకు వెళ్లి లోపాలు సరిదిద్దుకున్నాడు. రోజుకు 5-6 గంటలు తీవ్రంగా సాధన చేసి మళ్లీ జట్టులోకి వచ్చాడు. కొద్ది రోజులకే డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీలతో చెలరేగాడు. కానీ ఇప్పుడు అలాంటి వీరూ కనిపించడం లేదు.
సెహ్వాగ్ అసలు ఏ మాత్రం కష్ట పడటం లేదు. ఈ మాట సాక్షాత్తూ అతని కోచ్ శర్మ చెప్పడం విశేషం! తన శిష్యుడి ఇటీవలి వ్యవహార శైలిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సెహ్వాగ్ విషయంలో ప్రతీది ప్రతికూలంగానే కనిపిస్తోంది. అతని టైమింగ్, ఫుట్‌వర్క్, షాట్ సెలక్షన్ ఏదీ బాగా లేదు. అసలు ఆటపై దృష్టి, అంకితభావం లేదు. ఇంకా చెప్పాలంటే అతను ఏ మాత్రం కష్టపడనట్లు కనిపిస్తోంది’ అని శర్మ వ్యాఖ్యానించారు. సెహ్వాగ్‌లో పరుగుల దాహం తగ్గిపోయిం దని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రాక్టీస్ చేసేందుకు అతను మరీ బిజీగా ఉన్నట్లున్నాడు. అతను వీలైనంత తొందరగా ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నా. అతను ఎక్కువ పరుగులు సాధించి పాత వీరూను మళ్లీ చూపించాలి’ అని శర్మ అన్నారు.