చంద్రబాబు తప్పుదారి పట్టించారు: ఆర్కే
సాక్షి, హైదరాబాద్ : ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ స్వీకరించడాన్ని స్వాగతిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం చంద్రబాబు ఎగతాళి చేశారని, ఏపీ డీజీపీకి కనీస పరిజ్ఞానం లేదని మండిపడ్డారు. చంద్రబాబు ఒత్తిడి చేసి ఈ కేసును తప్పుదారి పట్టించాలని చూశారన్నారు.
సీఎం, డీజీపీ కలిసి కేసును నీరుకార్చే ప్రయత్నం చేశారని ఆర్కే తెలిపారు. 12.30 గంటలకు హత్యాయత్నం జరిగితే సాయంత్రం వరకు కేసు నమోదు చేయలేదన్నారు. డీజీపీ చేసిన తప్పులు ఎన్ఐఏ ముందు ఉంచుతామని ఆర్కే చెప్పారు. విచారణ చేయకముందే, కథను అల్లి డీజీపీ చెప్పడం వెనక చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. హత్యాయత్నం వెనక ఉన్నవాళ్లను ఎన్ఐఏ ముందు నిలబెడతామని తెలిపారు. నిందితులకు శిక్షలు పడితీరుతాయని, ఎన్ఐఏ సుమోటోగా తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.