అనకాపల్లిలో కరోనా కలకలం!
అనకాపల్లి/అనకాపల్లి టౌన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అనకాపల్లిలో కలకలం రేపింది. ఈ వ్యాధి లక్షణాలున్నట్టు భావిస్తున్న ఇద్దరు అనుమానితులను విశాఖ పట్నంలోని చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. ఇటలీ, సింగపూర్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ లక్షణాలున్నాయన్న అనుమానం స్థానికులకు భయాందోళనలకు గురిచేసింది. శారదా కాలనీకి చెందిన కృష్ణ భరద్వాజ్ అనే యువకుడు ఇటలీలో చదువుకుంటూ అనకాపల్లి వచ్చాడు. అతనికి ఎయిర్పోర్టులో స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. ఎటువంటి వ్యాధి లక్షణాలు బయటపడకపోయినా దగ్గుతో బాధపడుతుండడంతో విశాఖ చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న జీవీఎంసీ సీఎంహెచ్వో శాస్త్రి శారదా కాలనీకి వచ్చి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఆ యువకుడితో మాట్లాడినట్టు సమాచారం. కాలనీలో అన్ని ఇళ్లను సందర్శించిన పబ్లిక్ హెల్త్ విభాగం సిబ్బంది వీధుల్లో బ్లీచింగ్ ఫౌడర్ చల్లించారు. అతనికి కరోనా నిర్థారణ కాలేదని, కేవలం అనుమానం మాత్రమేనని వైద్యులు తెలిపారు. ఇటలీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పరిస్థితిని తెలుసుకున్న ఆ యువకుడు భయాందోళనలకు గురై ఉంటాడని పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు చెబుతున్నారు.
కరోనా భయంతో ఆస్పత్రిలో చేరిక..
రావికమతం మండలానికి చెందిన ఎం. కుమార్ అనే యువకుడు సింగపూర్ నుంచి కొద్ది రోజుల కిందట విశాఖ వచ్చాడు. విశాఖ ఎయిర్పోర్టులో జరిపిన స్క్రీనింగ్టెస్ట్లో ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో కుమార్ ముందుగా పరవాడలోని తన మావయ్య ఇంటికి వెళ్లాడు. అక్కడ నాలుగు రోజులు గడిపిన కుమార్ రావికమతంలోని సొంతూరుకు వెళ్లాడు. తర్వాత వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లిన కుమార్కు దగ్గు రావడంతో ఆందోళనకు గురైన అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. దగ్గు తీవ్రంగా రావడంతో అనకాపల్లి ఆస్పత్రిలో కరోనా వార్డులో చికిత్స అందించారు. కుమార్కు కరోనా లేదని కేవలం భయంతోనే ఆస్పత్రిలో చేరాడని వైద్యులు తెలిపారు. కుమార్కు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షలు చేసే నిమిత్తం విశాఖ చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ నాయక్ కుమార్ ఎయిర్పోర్టు నుంచి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్లాడో తెలుసుకొని అతనితో దగ్గరగా మెలిగిన వ్యక్తుల వివరాలను తెలుసుకొనే పనిలో పడ్డారు. కాగా అనకాపల్లిలో ఇద్దరు వ్యక్తులకు కరోనా అనుమానిత లక్షణాలున్నట్టు ప్రచారం జరగడంతో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ అంశంపై వైద్య శాఖ అధికారులు ఆచితూచి మాట్లాడుతున్నారు.