తిరుపతికి ఫాస్ట్ ప్యాసింజర్
► విశాఖ నుంచి ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో..
► ప్యాసింజరే కానీ ఎక్స్ప్రెస్ హాల్ట్లు
► తొలిరోజే విశేష స్పందన
విశాఖపట్నం సిటీ: విశాఖ నుంచి తిరుపతికి వారంలో మూడు రోజులపాటు ఎక్స్ప్రెస్ హాల్ట్లతో ఓ ప్యాసింజర్ బయల్దేరుతోంది. విశాఖ-రేణిగుంట మధ్య జనసాధారణ్ రైలు పేరు తో ఈ ప్యాసింజర్ మంగళవారం సాయంత్రం విశాఖ నుంచి బయల్దేరింది. తొలిరోజే వందలాది ప్రయాణికులతో కదిలింది. ఉత్తరాంధ్ర ప్రయాణికులు విజయవాడ మీదుగా రేణిగుంట వెళ్లేందుకు ఈ ప్యాసింజర్ను తూర్పు కోస్తా రైల్వే పట్టాలెక్కించింది. విశాఖ, తూర్పు, పశ్చిమ ోదావరి, కృష్ణ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రయాణించే ఈ రైలు సాధారణ ప్రయాణికులందరికీ ఉపయోగపడేలా హాల్టులను ఏర్పాటు చేశారు. మొత్తం 16 బోగీలతో నడిచే ఈ రైలు అన్ని బోగీలూ కొత్తవే కావడంతో అందరినీ ఆకర్షిస్తోంది. మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు విశాఖ నుంచి బయల్దేరిన ఈ ప్యాసింజర్లో ప్రయాణికులు ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఉన్నారు. తిరుమలఎక్స్ప్రెస్లో బెర్తులు లభించని వారు, జనరల్ బోగీల్లో సీట్లు లభ్యం కాని వారంతా ఈ రైలునే నమ్ముకున్నారు. దీంతో అప్పటి వరకూ ఖాళీగానే దర్శనమిచ్చిన జనసాధారణ రైలు బయల్దేరే వేళకు అసాధార ణంగా నిండిపోయింది.
దీంతో ఈ రైలుకు రానున్న రోజుల్లో భారీ డిమాండ్ ఉండొచ్చన్న అంచనాతో రైల్వే వర్గాలున్నాయి. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, ద్వారపూడి, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ప్యాసింజరు రైలే గానీ ఎక్స్ప్రెస్ రైలులా కొద్ది స్టేషన్లలోనే ఆగుతుంది. కాకినాడ నుంచి తిరుపతికి ప్యాసింజర్ రైలున్నా విశాఖ నుంచి మాత్రం ఇప్పటి వరకూ అలాంటి ప్రయత్నం చేయలేదు. తిరుపతి వెళ్లేందుకు తిరుమల ఎక్స్ప్రెస్(17488) ఎప్పుడూ రద్దీగా ఉంటుండడంతో పాటు ప్రత్యేక రైళ్లు నడిపినా ప్రయాణికులకు బెర్తులు లభ్యం కావడం లేదు. అందుకే ఈ రైలును ప్రత్యేకంగా నడుపుతున్నారు. దీని డిమాండ్ను బట్టి రానున్న రోజుల్లో రెగ్యులర్ చేసే అవకాశాన్ని రైల్వే వర్గాలు పరిశీలిస్తున్నాయి.
వారంలో మూడు రోజులు
విశాఖ-రేణిగుంట(08507) వీక్లీ జనసాధారణ ప్రత్యేక రైలు ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు చేరుతుంది.
రేణిగుంట-విశాఖ(08508) వీక్లీ జనసాధారణ ప్రత్యేక రైలు ప్రతి సోమ, బుధ, శనివారాల్లో సాయంత్రం 4 గంటలకు బయల్దేరి ఆ మరుసటి ఉదయం 5.15 గంటలకు విశాఖకు చేరుతుంది.