Visakhapatnam boy
-
ఆస్ట్రేలియా పీక్స్‌పై తెలుగోడి సత్తా
ఎస్.రాయవరం (పాయకరావుపేట): బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన యువకుడు కారే సత్యారావు ఆస్ట్రేలియా దేశంలో ప్రతిభ చాటాడు. 10 పీక్స్ (పర్వతాలు) అధిరోహించి సత్తా చాటాడు. ఇప్పటికే దేశ విదేశాల్లో సాహసాలు చేసి భారత్‌లో ఎత్తయిన పర్వతం ఎవరెస్టు, సౌతాఫ్రికాలో కిలిమంజారో పర్వతాలను ఎక్కి భారత దేశ ప్రతిభను చాటాడు. తాజాగా ఆస్ట్రేలియా దేశం వెళ్లి 10 పీక్స్, కోసియాజోకో, టౌన్సెండ్, టౌయినేమ్, రామ్స్హెడ్, ఎధిరిడ్జి రైడ్, రామ్స్హెడ్ నార్త్, అలీస్రౌసన్, బైట్స్ కమ్ సౌత్, అబ్బోట్ పీక్, కర్త్రర్ పీక్స్ అనే పర్వతాలను అధిరోహించి భారత్ జెండాను ఎగురవేశాడు. ప్రస్తుతం ఈ సాహసాల సత్యారావు ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. తాను సాధించిన ఘనతను ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చేరవేశాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంగారమ్మపాలెం గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
ప్రపంచ చాంపియన్‌గా విశాఖ బాలుడు
సీతంపేట (విశాఖ ఉత్తరం): పిట్ట కొంచెం కూత ఘనమని నిరూపించాడు విశాఖకు చెందిన మూడేళ్ల బాలుడు. మాటలు కూడా సరిగా రాని వయసులో అనర్గళంగా రెండు వందలకు పైగా ఇంగ్లిష్ రైమ్స్‌ను అలవోకగా చెప్పేస్తున్నాడు అభిజిత్ దేవాన్ష్. లయబద్ధంగా పాడుతూ దానికి తగినట్టు హావభావాలు ప్రదర్శిస్తూ రైమ్స్ చెప్పడం అభిజిత్ ప్రత్యేకత. ఈ టాలెంటే ఆ బుడతడిని ప్రపంచ చాంపియన్‌ను చేసింది. రైమ్స్ వరల్డ్ కప్ సంస్థ ఇటీవల మలేసియాలో నిర్వహించిన వరల్డ్‌కప్ పోటీల్లో అభిజిత్ మొదటి స్థానంలో నిలిచి విశాఖ కీర్తి పతాకం ఎగురవేశాడు. 20 దేశాల నుంచి 180 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా ఈ చిన్నారి జూనియర్ విభాగంలో మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఈ నెల 11న మలేసియాలో జరిగిన రైమ్స్ వరల్డ్ కప్ పోటీలో జూనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి వరల్డ్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అభిజిత్ విశాఖ టింపనీ స్కూల్లో ఎల్కేజీలో చేరాడు. తండ్రి పి.శివకుమార్ ఏసీబీలో పనిచేస్తుండగా.. తల్లి జయలక్ష్మి ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.