Visakhapatnam East MLA
-
ఓటేసిన జనమే టీడీపీ ఎమ్మెల్యేని ఛీ కొట్టారు..
సాక్షి, విశాఖపట్నం: ఓటేసిన జనమే మాటమార్చిన నాయకుడిని ఛీ కొట్టిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. మూడుసార్లు గెలిపించినా ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా వ్యవహరించిన విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలోని రామకృష్ణపురంలో మంగళవారం రోజున అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి రామకృష్ణ బాబు వెళ్లారు. గతంలో మాదిరిగానే స్థానికులు వచ్చి పలకరిస్తారని ఎమ్మెల్యే భావించాడు. కానీ ఊహించని విధంగా స్థానికులతో పాటు సమీప కాలనీల ప్రజలు కూడా అక్కడకు చేరుకొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే అధికారం మీకు లేదంటూ నినాదాలు చేశారు. వారికి రామకృష్ణబాబు నచ్చచెప్పే ప్రయత్నం చేయగా జనం గొడవకు దిగారు. (ఉత్తరాంధ్ర ద్రోహులు చంద్రబాబు, రామోజీ) దీంతో మీరు కూడా నాతో పాటు వచ్చి కొబ్బరికాయ కొట్టండి అని చెప్పడానికి మరో మారు ఎమ్మెల్యే ప్రయత్నించగా ఆ పప్పులు ఉడకవంటూ జనం తిరగబడ్డారు. అతని వెంట ఉన్న అనుచరులపై కూడా ఎప్పుడూ లేని విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహంపై ఆరా తీస్తే ఉత్తరాంధ్రలో విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలనే సీఎం నిర్ణయాన్ని వెలగపూడి వ్యతిరేకించడమే కారణమని తెలిసింది. కాగా ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదన చేయడంతో ఉత్తరాంధ్రకు చెందిన అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కానీ విశాఖ కేంద్రంగా గెలుపొందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమ అధినేత చంద్రబాబు నాయుడు బాటలో నడిచి విశాఖ జనం విశ్వాసం కోల్పోయారు. స్థానికేతరుడు అయినప్పటికీ విశాఖ ఈస్ట్ నియోజకవర్గం నుంచి వెలగపూడిని మూడుసార్లు ఎమ్మెల్యేగా అక్కడి ప్రజలు గెలిపించారు. అయితే ఆయన మాత్రం విశాఖ ప్రజలు ప్రజానిర్ణయాన్ని కాదని అధినేత బాటలో నడవడంతో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. (పచ్చ తమ్ముళ్లూ.. గూగుల్‌లో వెతకండి) -
వెలగపూడికి ఎదురుగాలి!
విశాఖపట్నం... ప్రకృతి గీసిన అందమైన నగరం. అయితే కొన్నేళ్లుగా విశాఖలో నేరసంస్కృతి విజృంభిస్తోంది.. గొడవలు, ఘర్షణలు నిత్యకృత్యమైపోయాయి. పాతికేళ్ల క్రితమే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈ సంస్కృతికి బీజం వేశారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేయకపోగా అవినీతి, అక్రమాలను ప్రోత్సహించారు. దీంతో ఆయనకు ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల నిత్యం ప్రజలమధ్య ఉంటూ వారికి అండగా నిలుస్తున్నారు. ఇదీ వెలగపూడి చరిత్ర విజయవాడలోని ఏలూరు రోడ్డులో మూడు దశాబ్దాల క్రితం రాగమాలిక ఆడియో షాపులో క్యాసెట్లు అద్దెకిచ్చే పని వెలగపూడిది. రాత్రిపూట అదే షాపును అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చేసుకున్నారు. దేవినేని నెహ్రూ అనుచరగణంలో ఉంటూ 1986 డిసెంబర్ 26న ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా హత్య కేసులో నిందితుడయ్యారు. రంగా హత్య దరిమిలా కోస్తా జిల్లాల్లో చెలరేగిన ‘వర్గ’ కక్షల నేపథ్యంలో పారిపోయి విశాఖకు వలసొచ్చారు. తొలుత ఎంవీపీ కాలనీ సెక్టార్–6లోని బిల్డింగ్‌లో టెలెక్స్ పేపర్లు తయారుచేసే ఓ వ్యాపారి వద్ద తలదాచుకుని, అనంతరం కిరణ్ యాడ్స్‌లో చిన్న గుమాస్తాగా చేశారు. షిర్డీ సాయి స్కీం ఫైనాన్స్ కంపెనీ పెట్టి జనాలను నిలువునా ముంచారు. ఈ క్రమంలోనే మద్యం సిండికేట్ వైపు దృష్టిసారించి..జనప్రియ సిండికేట్ వ్యాపారులను టెండర్లు వేయొద్దని బెదిరించారు. దీంతో అప్పట్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరవాలని చూడగా అప్పటి పోలీసు ఉన్నతాధికారిని బతిమాలుకోవడంతో రౌడీషీట్ తెరవలేదని చెపుతారు. రౌడీ రాజకీయం తెలియని విశాఖ నగరానికి రౌడీలు, గూండాల్ని అతిథులుగా తీసుకొచ్చి కబడ్డీ పోటీలు, కోడిపందేలు నిర్వహించేవారు. ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని ఆక్రమణలు 2009లో విశాఖ తూర్పు నుంచి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు సీనియర్ నేతలెవరూ ముందుకు రాకపోవడంతో వెలగపూడికి ఆ అవకాశం వచ్చింది. పీఆర్పీతో ముక్కోణపు పోటీ వల్ల అతి తక్కువ ఓట్లతో బయటపడ్డారు. అక్కడినుంచి అతని అరాచకాలకు అడ్డూ..అదుపు లేకుండా పోయింది. టీడీపీలోనే ఉంటూ అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఉడా భూములు కాజేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సెక్టార్–2లో ఓ బహుళ అంతస్తుల భవనం కోసం రజకుల్ని ఖాళీ చేయించడం, ఆ భవన యజమాని అడిగినంత డబ్బు ఇవ్వలేదని తిరిగి వారిపైనే దౌర్జన్యం చేయడం.. రుషికొండలో భూ ఆక్రమణ, రోడ్డు విస్తరణలో స్థలం పోయిందని ఉడా అధికారులను బెదిరించి రుషికొండ లేఔట్లో రెండు ప్లాట్లను అప్పనంగా కొట్టేయడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఆంధ్రవిశ్వవిద్యాలయ భూముల ఆక్రమణ, వర్సిటీలో వర్గ రాజకీయాలు జొప్పించి కలుషితం చేయడం, ఆరిలోవ ప్రాంతంలో వెలగపూడి యువసేన పేరిట దందాలు ఇలా చెప్పుకుంటూ పోతే వెలగపూడి నేరచరిత్ర చాంతాడంత ఉంది. లిక్కర్ మాఫియాతో చెలరేగిన వెలగపూడి ఎడ్యుకేషన్ సిటీగా వెలిగిన విశాఖ నగరాన్ని అడిక్షన్ సిటీగా మార్చేశారు. లిక్కర్ మాఫియాతో విశాఖలో మద్యం సిండికేట్‌ను శాసించే స్థాయికి చేరుకున్నారు. నగరంలో 50 నుంచి 60 షాపుల్లో ఆయన భాగస్వామ్యం ఉంది. బినామీల పేరిట సొంతంగా 6 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. పేదలను కేవలం ఓటర్లుగానే చూస్తూ పండుగలకు, పబ్బాలకు చిల్లర విరాళాలిచ్చి చీప్ లిక్కర్ మత్తులో వారి రక్తాన్ని పీల్చుతున్నారు. ఇదిలా ఉండగా తూర్పు నుంచి ఈమధ్యకాలంలో ఏకంగా 40వేల దొంగఓట్లను ఎన్నికల సంఘం గుర్తించి తొలగించిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు అందుబాటులో విజయనిర్మల వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న అక్కరమాని విజయనిర్మల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. భీమిలి మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైస్ చైర్మన్, చైర్ పర్సన్ హోదాల్లో పనిచేసి ప్రజామన్నన పొందారు. మహిళలకు ఏ ఇబ్బందులొచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తారు. ఎన్నికల ప్రచారంలో జనం ఇబ్బందులు తెలుసుకుంటూ వారి మద్దతు కోరుతూ ముందుకుసాగుతున్నారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో వెలగపూడిపై విజయనిర్మల గెలుపు తథ్యమని పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గం : విశాఖపట్టణం తూర్పు మొత్తం ఓట్లు : 2,31,915 పురుషులు : 1,15,295 మహిళలు : 1,16,605 ఇతరులు : 15 - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
మహిళపై మైకు విసిరిన టీడీపీ ఎమ్మెల్యే
జనావాసాల మధ్య సెల్‌టవర్ వద్దనడమే ఆమె చేసిన పాపం ఇక్కడ్నుంచి పోతావా? పోవా? అంటూ ఎమ్మెల్యే వెలగపూడి ఆగ్రహం విశాఖ నగరంలో నిర్వహించిన జనచైతన్య యాత్రలో నిర్వాకం ఆరిలోవ(విశాఖ): జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన సెల్‌టవర్ వల్ల తమకు సమస్యలు ఎదురవుతున్నాయని తమ వద్దకు వచ్చిన అధికారపార్టీ ప్రజాప్రతినిధికి విన్నవించడమే ఆమె చేసిన పాపం. దీంతో నన్నే నిలదీస్తావా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ప్రజాప్రతినిధి చేతిలో ఉన్న మైకును ఆమెపైకి విసిరేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామంటూ టీడీపీ నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలో భాగంగా విశాఖ నగరంలోని మూడో వార్డులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రవీంద్రనగర్ ఆఖరి బస్‌స్టాప్ వద్ద అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజల సమస్యలు పరిష్కరించటానికే వచ్చానని, టీడీపీ పాలనలో ప్రజాసమస్యలు తీరుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇంతలో అదే ప్రాంతానికి చెందిన మాకిన వరలక్ష్మి అనే మహిళతోపాటు స్థానికులు కొందరు ఇటీవల ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెల్‌టవర్ గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సెల్‌టవర్ వల్ల సమస్యలెదురవుతాయని గతంలో ఇక్కడి మహిళలంతా ఉద్యమాలు చేసి ఎత్తివేయించామని, అయితే ఇక్కడ ఇటీవల కొత్తగా మరో సెల్ టవర్‌ను మీ అండతో ఏర్పాటు చేశారని చెప్పడంతో ఆ మహిళపై ఎమ్మెల్యే ఊగిపోయారు. ఆ సెల్‌టవర్ పెట్టింది వేరే పార్టీ కార్యకర్త.. నేనెందుకు మద్దతు పలుకుతాను.. నీవు ఇక్కడ నుంచి పోతావా పోవా.. అంటూ చేతిలో ఉన్న మైక్‌ను విసిరేశారు. అయినప్పటికీ ఆ మహిళ వెనుదిరగకుండా.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మీరు ఇక్కడికొచ్చారు.. అందుకే సమస్యలు చెప్పుకొంటున్నాం. నేను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే పొమ్మని చెప్పండి.. మా వద్దకు వచ్చి మమ్మల్ని పొమ్మంటారా.. అంటూ ఎదురుతిరిగింది. దీంతో ఎమ్మెల్యే మరింత ఊగిపోయారు. ఆమెను తీసుకుపోండంటూ కార్యకర్తలను గద్దించారు. మధ్యలోనే యాత్రను ముగించేసి రుసరుసలాడుతూ వెళ్లిపోయారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కొందరు ఎమ్మెల్యేనే నిలదీస్తావా? అంటూ వరలక్ష్మితో వాగ్వాదానికి దిగారు.