అక్కరమాని విజయనిర్మల, వెలగపూడి రామకృష్ణబాబు
విశాఖపట్నం... ప్రకృతి గీసిన అందమైన నగరం. అయితే కొన్నేళ్లుగా విశాఖలో నేరసంస్కృతి విజృంభిస్తోంది.. గొడవలు, ఘర్షణలు నిత్యకృత్యమైపోయాయి. పాతికేళ్ల క్రితమే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈ సంస్కృతికి బీజం వేశారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేయకపోగా అవినీతి, అక్రమాలను ప్రోత్సహించారు. దీంతో ఆయనకు ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. మరోవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల నిత్యం ప్రజలమధ్య ఉంటూ వారికి అండగా నిలుస్తున్నారు.
ఇదీ వెలగపూడి చరిత్ర
విజయవాడలోని ఏలూరు రోడ్డులో మూడు దశాబ్దాల క్రితం రాగమాలిక ఆడియో షాపులో క్యాసెట్లు అద్దెకిచ్చే పని వెలగపూడిది. రాత్రిపూట అదే షాపును అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చేసుకున్నారు. దేవినేని నెహ్రూ అనుచరగణంలో ఉంటూ 1986 డిసెంబర్ 26న ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా హత్య కేసులో నిందితుడయ్యారు. రంగా హత్య దరిమిలా కోస్తా జిల్లాల్లో చెలరేగిన ‘వర్గ’ కక్షల నేపథ్యంలో పారిపోయి విశాఖకు వలసొచ్చారు. తొలుత ఎంవీపీ కాలనీ సెక్టార్–6లోని బిల్డింగ్‌లో టెలెక్స్ పేపర్లు తయారుచేసే ఓ వ్యాపారి వద్ద తలదాచుకుని, అనంతరం కిరణ్ యాడ్స్‌లో చిన్న గుమాస్తాగా చేశారు. షిర్డీ సాయి స్కీం ఫైనాన్స్ కంపెనీ పెట్టి జనాలను నిలువునా ముంచారు. ఈ క్రమంలోనే మద్యం సిండికేట్ వైపు దృష్టిసారించి..జనప్రియ సిండికేట్ వ్యాపారులను టెండర్లు వేయొద్దని బెదిరించారు. దీంతో అప్పట్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ తెరవాలని చూడగా అప్పటి పోలీసు ఉన్నతాధికారిని బతిమాలుకోవడంతో రౌడీషీట్ తెరవలేదని చెపుతారు. రౌడీ రాజకీయం తెలియని విశాఖ నగరానికి రౌడీలు, గూండాల్ని అతిథులుగా తీసుకొచ్చి కబడ్డీ పోటీలు, కోడిపందేలు నిర్వహించేవారు.
ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని ఆక్రమణలు
2009లో విశాఖ తూర్పు నుంచి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు సీనియర్ నేతలెవరూ ముందుకు రాకపోవడంతో వెలగపూడికి ఆ అవకాశం వచ్చింది. పీఆర్పీతో ముక్కోణపు పోటీ వల్ల అతి తక్కువ ఓట్లతో బయటపడ్డారు. అక్కడినుంచి అతని అరాచకాలకు అడ్డూ..అదుపు లేకుండా పోయింది. టీడీపీలోనే ఉంటూ అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఉడా భూములు కాజేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సెక్టార్–2లో ఓ బహుళ అంతస్తుల భవనం కోసం రజకుల్ని ఖాళీ చేయించడం, ఆ భవన యజమాని అడిగినంత డబ్బు ఇవ్వలేదని తిరిగి వారిపైనే దౌర్జన్యం చేయడం.. రుషికొండలో భూ ఆక్రమణ, రోడ్డు విస్తరణలో స్థలం పోయిందని ఉడా అధికారులను బెదిరించి రుషికొండ లేఔట్‌లో రెండు ప్లాట్లను అప్పనంగా కొట్టేయడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఆంధ్రవిశ్వవిద్యాలయ భూముల ఆక్రమణ, వర్సిటీలో వర్గ రాజకీయాలు జొప్పించి కలుషితం చేయడం, ఆరిలోవ ప్రాంతంలో వెలగపూడి యువసేన పేరిట దందాలు ఇలా చెప్పుకుంటూ పోతే వెలగపూడి నేరచరిత్ర చాంతాడంత ఉంది.
లిక్కర్ మాఫియాతో చెలరేగిన వెలగపూడి
ఎడ్యుకేషన్ సిటీగా వెలిగిన విశాఖ నగరాన్ని అడిక్షన్ సిటీగా మార్చేశారు. లిక్కర్ మాఫియాతో విశాఖలో మద్యం సిండికేట్‌ను శాసించే స్థాయికి చేరుకున్నారు. నగరంలో 50 నుంచి 60 షాపుల్లో ఆయన భాగస్వామ్యం ఉంది. బినామీల పేరిట సొంతంగా 6 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. పేదలను కేవలం ఓటర్లుగానే చూస్తూ పండుగలకు, పబ్బాలకు చిల్లర విరాళాలిచ్చి చీప్ లిక్కర్ మత్తులో వారి రక్తాన్ని పీల్చుతున్నారు. ఇదిలా ఉండగా తూర్పు నుంచి ఈమధ్యకాలంలో ఏకంగా 40వేల దొంగఓట్లను ఎన్నికల సంఘం గుర్తించి తొలగించిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రజలకు అందుబాటులో విజయనిర్మల
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న అక్కరమాని విజయనిర్మల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. భీమిలి మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైస్ చైర్మన్, చైర్ పర్సన్ హోదాల్లో పనిచేసి ప్రజామన్నన పొందారు. మహిళలకు ఏ ఇబ్బందులొచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తారు. ఎన్నికల ప్రచారంలో జనం ఇబ్బందులు తెలుసుకుంటూ వారి మద్దతు కోరుతూ ముందుకుసాగుతున్నారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో వెలగపూడిపై విజయనిర్మల గెలుపు తథ్యమని పరిశీలకులు భావిస్తున్నారు.
నియోజకవర్గం : విశాఖపట్టణం తూర్పు
మొత్తం ఓట్లు : 2,31,915
పురుషులు : 1,15,295
మహిళలు : 1,16,605
ఇతరులు : 15
- సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment