టీడీపీ కంచుకోటకు బీటలు | TDP Over Losses In East Godavari District In AP Elections | Sakshi
Sakshi News home page

అవినీతి మేటలు.. కంచుకోటకు బీటలు

Published Sun, May 26 2019 9:27 AM | Last Updated on Sun, May 26 2019 2:03 PM

TDP Over Losses In East Godavari District In AP Elections - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉంటూ వస్తున్న జిల్లాలో పార్టీ ఈ స్థాయిలో పతనం చెందడానికి కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు తెలుగుదేశం నాయకులు. గత ఎన్నికల్లో మొత్తం స్థానాలను కట్టబెట్టిన జిల్లా ఈసారి రెండు స్థానాలకు పరిమితం చేసింది. 2014 ఎన్నికల్లో వచ్చిన ఘన విజయాన్ని సద్వినియోగం చేసుకోకుండా గెలిపించిన ప్రజలపైనే పెత్తనం చేశారు టీడీపీ నాయకులు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో వారు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ప్రజాప్రతినిధులైతే ఇసుక, మట్టి, నీరు ఏదీ వదలలేదు. వందల కోట్లు దోచేశారు. ఉచిత ఇసుక పాలసీని అడ్డం పెట్టుకుని జి ల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు శతకోటీశ్వరులుగా మారారు. వీరందరికీ ప్రజలు గుణపాఠం చెప్పారు. భారీ మెజారి టీలతో ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారు. 

పితాని.. ఇసుక దందా
ఇసుక దందాకు ఆధ్యుడిగా ఉన్న పితాని సత్యనారాయణ ఆచంట నుంచి 2009, 2014లో గెలిచిన తర్వాత కూడా ఇసుక దందాను కొనసాగించారు. మంత్రిగా ఉంటూనే ఇసుక మాఫియాలో ప్రముఖపాత్ర పోషించారు. ఆయన కనుసన్నల్లోనే నియోజకవర్గంలో ఇసుక దోపిడీ జరిగింది. కులబలంతో రాజకీయం చేస్తూ వచ్చిన పితానికి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెక్‌ పెట్టారు. ఆయన కుల ఓట్లను గండికొట్టారు. 15 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. 

నిడదవోలుపై ‘శేష’ పడగ
నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషరావు ఇసుకను అడ్డం పెట్టుకుని వందల కోట్లు సంపాదించారు. 2009లో తనకు అప్పులు ఉన్నాయని చూపించిన శేషారావు పదేళ్లు గడిచేటప్పటికి వెయ్యికోట్లకు పైగా సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీలో కూడా ఈ సీటు కోసం పోటీ పెరిగిపోయింది. అన్నింటిని తట్టుకుని సీటు సంపాదించుకున్నా 20 వేల పైచిలుకు తేడాతో జనం ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారు.

కొవ్వూరు.. అవినీతి ఏరు
కొవ్వూరు విషయానికి వస్తే మంత్రి కేఎస్‌ జవహర్‌ సాధారణ టీచర్‌ నుంచి వందల కోట్లకు ఎదిగారు. ఆయన ఇసుక నుంచి పేకాట క్లబ్‌ల వరకూ దేనిని వదలలేదు. వందల కోట్లు సంపాదించడంతో సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆఖరికి ఆయనను జిల్లా నుంచి తప్పించి సొంత జిల్లాలోని తిరువూరు సీటును కేటాయించారు. అక్కడ కూడా భారీ తేడాతో జవహర్‌ ఓటమి చవిచూశారు. కొవ్వూరుకు విశాఖ జిల్లా నుంచి స్థానికేతరురాలు పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను తీసుకువచ్చి నిలబెట్టినా 25 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
 
పోలవరం.. సిండికేట్లపరం
రిజర్వుడు నియోజకవర్గం అయిన పోలవరం నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మొడియం శ్రీనివాస్‌ కూడా ఇసుక సిండికేట్లపై కోట్ల రూపాయలు ఆర్జించారు. పోలవరం భూసేకరణ, అర్‌ అండ్‌ ఆర్‌ను అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తారు. ఇక్కడ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా పక్కన పెట్టినా అదే ఇసుక సిండికేట్లకు చెందిన బొరగం శ్రీని వాస్‌ను నిలబెట్టడంతో ప్రజలు 42 వేల ఓట్ల తేడాతో అతడిని చిత్తుగా ఓడించారు.
 
దెందులూరులో రౌడీరాజ్యం
తమ్మిలేరు ఇసుకతో పాటు పోలవరం కుడికాల్వ గట్టును అమ్మేసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కూడా ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇసుక అక్రమాలను అడ్డుకున్న తహసీల్దార్‌ వనజాక్షిపై దాడికి దిగిన ప్రభాకర్‌ను చంద్రబాబునాయుడు వెనకేసుకురావడంతో అతని దోపిడీకి అంతులేకుండా పోయింది. పోలవరం కుడికాల్వ గట్టును పూర్తిగా కొల్లగొట్టారు. మరోవైపు కొల్లేరులో అక్రమ చెరువులు తవ్వించి వాటిని కూడా ఆక్రమించారు. దీంతో అతడిని ప్రజలు 17 వేలకు పైగా ఓట్ల తేడాతో ఇంటిబాట పట్టించారు.

ఉంగుటూరు.. గన్నిని ఓడించారు
తన నియోజకవర్గ పరిధిలో ఉన్న 21 కిలోమీటర్ల మేర ఉన్న పోలవరం కుడికాల్వ గట్టును తవ్వేసి, నీరు– చెట్టు పేరుతో చెరువుల్లో మట్టిని అమ్మేసుకుని, పే కాట దందాలకు కేరాఫ్‌గా నిలిచిన ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును కూడా 32 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించి నియోజకవర్గ ప్రజలు ఇం టికి పంపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అనడానికి ఈ  ప్రజాప్రతినిధులే నిదర్శనంగా మారారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement