వైఎస్సార్సీపీ అసాధారణ విజయం | AP Election Results 2019 Record Victory For YSR Congress Party | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ రికార్డు విజయం

Published Fri, May 24 2019 7:30 PM | Last Updated on Fri, May 24 2019 8:44 PM

AP Election Results 2019 Record Victory For YSR Congress Party - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసాధారణమైన విజయం సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. 2014 ఎన్నికల్లో కేవలం రెండు శాతం కన్నా తక్కువ ఓట్ల వ్యత్యాసంతో ఓటమి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఫలితాల్లో మాత్రం చరిత్ర రికార్డును బ్రేక్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 50 (49.95) శాతం ఓట్లను సాధించుకుంది. టీడీపీకి 39.18 శాతం ఓట్లు నమోదయ్యాయి. రెండు పార్టీల మధ్య 10.7 శాతం (దాదాపు 11 శాతం) ఓట్ల వ్యత్యాసం ఉంది.

మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో  50 శాతం (1,56,86,511 ఓట్లు) ఓట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 నియోజకవర్గాల్లో రికార్డు విజయం సాధించింది. 39 శాతం (1,23,03,620) ఓట్లతో టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం రెండు శాతం లోపే ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీలకు కలిపి 46.6 శాతం ఓట్లు రాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 45 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ 102 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించింది. 

తాజా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ రికార్డు సంఖ్యలో 151 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. గతంలో 102 స్థానాలు గెలిచిన టీడీపీ ఈసారి 79 స్థానాలు కోల్పోయి 23 సీట్లు గెలుచుకోగలిగింది. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయగా, జనసేన మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. ఈసారి సీపీఐ, సీపీఎం, బీఎస్పీ లాంటి పార్టీలతో కలిసి జనసేన ఎన్నికల్లో పోటీ చేసింది. జనసేనకు 6 శాతం లోపు ఓట్లు పోలయ్యాయి. జనసేన మిత్రపక్షాలైన సీపీఐ (0.11 శాతం), సీపీఎం (0.32  శాతం), బీఎస్పీ (0.28 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఈ పార్టీలన్నింటకీ కలిపి నోటాకు పోలైనన్ని ఓట్లు కూడా రాలేదు. ఈ ఎన్నికల్లో నోటాకు 1.28 శాతం (4,01,968 ఓట్లు) పోలయ్యాయి. 

లోక్‌సభ ఫలితాల్లోనూ
రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లోనూ పోలింగ్ లో ఇదే సరళి కొనసాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49.15 శాతం ఓట్లు నమోదు కాగా టీడీపీకి 39.6 శాతం ఓట్లు వచ్చాయి. అటు అసెంబ్లీ ఇటు లోక్‌సభ రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మధ్య పది శాతం ఓట్ల తేడా ఉంది. ఇంతటి భారీ తేడాతో ఓట్లు సాధించి అధికారం చేపట్టడం చరిత్రలో జరగలేదు. జాతీయ పార్టీలు కాంగ్రెస్ (1.29 శాతం) బీజేపీ (0.96 శాతం) ఓట్లు రాగా నోటాకు 1.49 శాతం ఓట్లు పడ్డాయి. జనసేన, సీపీఐ, సీపీఎంలతో పాటు మిగిలిన స్వతంత్రులందరికీ కలిపి 7.3 శాతం మేరకు ఓట్లు లభించాయి.

జాతీయ పార్టీలకు డిపాజిట్లు గల్లంతు
ఇకపోతే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ 1.17 శాతం, బీజేపీ 0.84 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. ఈ పార్టీలు పోటీ చేసిన దాదాపు అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయాయి. జనసేన దాని మిత్రపక్షాల అభ్యర్థులు సైతం అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. 

2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పడిన అసెంబ్లీలో అధికార తెలుగుదేశం మిత్రపక్ష బీజేపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సభలో ఉండగా, అప్పట్లో నవోదయ పార్టీ తరఫున గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా సభలో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లోనూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ తప్ప మరోపార్టీ ప్రాతినిథ్యం లేదు. జనసేన తరఫున గెలిచిన ఒక సభ్యుడు (స్వతంత్ర) సభలో ఉండనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement