సాక్షి, హైదరాబాద్ : ఐదేళ్లు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా స్వార్థ ప్రయోజనాల కోసం వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వెన్నుపోటు రాజకీయాలతో పాటు పొత్తులు పెట్టుకోకుండా గెలిచిన చరిత్ర ఆయనకు లేదనే విషయం బహిరంగ రహస్యమే. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఏ పార్టీతో కలిసి పోటీ చేస్తే ఫలితం ఉంటుంది అనే విషయంపై ఆయనకు ఒక లెక్క ఉంటుంది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కొన్ని ‘భేదాభిప్రాయాలు’ రావడంతో.. ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేనట్లు పైకి నటిస్తున్నా.. వివిధ పార్టీలతో ఉన్న లోపాయికారి ఒప్పందాలు పలు సందర్భాల్లో బయటపడుతూనే ఉన్నాయి. (చదవండి : ‘తమ్ముడూ..’ పవన్ మనోడే..!)
ముఖ్యంగా గత ఎన్నికల్లో చంద్రబాబు తరఫున ప్రచారం నిర్వహించిన సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్- టీడీపీల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాలనలో వైఫల్యం చెందిన ప్రభుత్వాన్ని విమర్శించకుండా.. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని విమర్శించడానికే పవన్ ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఏదో నామమాత్రంగా నాలుగు మాటలు మాట్లాడేసి వైఎస్సార్ సీపీని ఆడిపోసుకోవడానికే ఆయన ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాదు టీడీపీకి లాభం చేకూర్చే విధంగా ఒక అండర్‌స్టాండింగ్ ప్రకారం అభ్యర్థులను నిలబెడతారు. ఇదంతా ఒక ఎత్తైతే వైఎస్ జగన్‌ను ఎదుర్కొనేందుకు తాను వేసే నిందలు, పవన్ ప్రచారం సరిపోదని భావించిన చంద్రబాబు.. కేఏ పాల్ అనే మరో వ్యక్తిని రంగంలోకి దింపారు. ప్రజాశాంతి పేరిట ఓ పార్టీని సృష్టించి... వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ గుర్తును పోలిన హెలికాప్టర్ గుర్తును ఆయనకు వచ్చేలా చేయడం, అలాగే ప్రతిపక్షం ఓట్లను చీల్చే ఉద్దేశంతో ఓటర్లను అయోమయానికి గురిచేసేలా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లను పోలిన వ్యక్తులతో నామినేషన్ వేయించడం వంటి గిమ్మిక్కులకు పాల్పడ్డారు. (చదవండి : చంద్రబాబు జిమ్మిక్కులకు ఈసీ ఝలక్ )
ఈ విషయాన్ని గమనించిన వైఎస్సార్ సీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ గుర్తును పోలి ఉన్న ప్రజాశాంతి పార్టీ గుర్తును మార్చాలని విఙ్ఞప్తి చేశారు. దీంతో రంగంలోకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనుచరులు సోషల్ మీడియా వేదికగా నీచ రాజకీయాలకు తెరతీశారు. వైఎస్ జగన్ పేరిట ఫేక్ ట్విటర్ అకౌంట్లు సృష్టించడంతో పాటు, ప్రజాశాంతి పార్టీ, వైఎస్సార్‌సీపీ పరస్పరం గుర్తులు మార్చుకున్నాయంటూ ఏకంగా వైఎస్ జగన్ పేరిట లెటర్‌హెడ్‌తో దుష్ప్రచారం చేస్తూ చెత్త డ్రామాలాడుతున్నారు. అయినా అధికారంలో ఉండి అదే విధంగా దొంగచాటు పొత్తులు పెట్టుకున్నా, ప్రచార సభల్లో వైఎస్ జగన్ మీద నిందలు మోపడమే పనిగా పెట్టుకున్నా చంద్రబాబుకు ప్రజాస్పందన కరువవుతుంది. ఇందుకు తోడు తన కుమారుడు లోకేష్, బావమరిది బాలకృష్ణలు తమ వింత చేష్టలతో నిరంతరం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడం ఆయనకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ ప్రచార సభలకు భారీగా జనం తరలివస్తుండటంతో.. టీడీపీతో కలిసి జనసేన, దాని మిత్రపక్షాలతో పాటు ప్రజాశాంతి పార్టీ అంటూ ఎన్ని పార్టీలు ముసుగు రాజకీయాలకు పాల్పడినా.. ‘నిండు చందురుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు’ అన్న చందంగా తమ పార్టీయే విజయం సాధిస్తుందని వైఎస్సార్‌సీపీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.(చదవండి : డెలిట్ చెయ్.. ప్రాణాలు తీస్తా; బాలకృష్ణ చిందులు)
సోషల్ మీడియాలో పెట్టిన నకిలీ లెటర్‌హెడ్
Comments
Please login to add a commentAdd a comment