విషమ పరిస్థితిలో ఉన్న కోటిరెడ్డి, తలకు గాయమైన శ్రీనివాసరెడ్డి, గాయపడిన పవన్‌రెడ్డి
అనంతపురం సెంట్రల్/పిడుగురాళ్ల/బొల్లాపల్లి (గుంటూరు) : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. వైఎస్సార్‌సీపీ విజయ పరంపర కొనసాగడంతో టీడీపీ శ్రేణుల్లో అసహనం పెల్లుబికింది. ఫలితాలు వెలువడుతున్న సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై వేటకొడవలితో దాడిచేయగా.. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న వారిపై మహిళలు కారం చల్లగా.. టీడీపీ నేతలు మారణాయుధాలతో దాడిచేశారు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, ఇదే జిల్లా బొల్లాపల్లి మండలంలోనూ టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త గొల్ల వెంకటేశ్ యాదవ్ తమ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ఉత్సాహంతో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టీడీపీ నాయకుడు, మార్కెట్ యార్డు చైర్మన్ దొడగట్ట నారాయణ తన కుటుంబ సభ్యులు మధు, అశోక్‌లను ఉసిగొల్పి వెంకటేశ్‌పై దాడికి తెగబడ్డాడు. మధు, అశోక్‌లు వేట కొడవలితో దాడిచేయగా వెంకటేశ్ ఎడమ చేతికి గాయమైంది. వెంటనే బాధితుడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు పట్టణ పోలీసుస్టేషన్ వద్ద ధర్నాకు దిగారు.
- ఇదే జిల్లా పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చంద్రశేఖర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డిలపై టీడీపీ నేత.. ఎంపీపీ భర్త కేశవయ్య, వడ్డే శ్రీనివాసులు ఆధ్వర్యంలో పుష్పనాథ్, శ్రీనాథ్, శంకరయ్య, రాజప్ప, శ్రీనివాసులు, లక్ష్మయ్య, గజేంద్రలు రాళ్లతో దాడిచేశారు. దాడిలో చంద్రశేఖర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు వేరే వాహనాలలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికీ గాయాలయ్యాయి. బాధితులను పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
- ఇక పెనుకొండలో వైఎస్సార్‌సీపీ గెలవడంతో గోరంట్లలోని బీసీ కాలనీకి చెందిన పార్టీ కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకుంటుండగా.. టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను స్టేషన్ పిలిపించి మందలించారు. అనంతరం పోలీసుస్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిన టీడీపీ కార్యకర్తలు నాగరాజు, శివప్ప, రవి తదితరులు.. ఇంటివద్ద ఉన్న అక్కమ్మ, రగప్ప దంపతులతో పాటు ప్రసాద్ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై విచక్షణరహితంగా దాడిచేశారు. దాడిలో అక్కమ్మ తీవ్రంగా గాయపడింది.
- ఇక అనంతపురంలో ఓ వైఎస్సార్‌సీపీ కార్యకర్త ద్విచక్రవాహనంపై తన అభిమానాన్ని తెలియజేసేందుకు జెండా కట్టుకుని మంత్రి పరిటాల సునీత నివాసం ముందు నుంచి వస్తుండగా.. అక్కడే ఉన్న టీడీపీ రాప్తాడు అభ్యర్థి పరిటాల శ్రీరామ్ అనుచరులు అతడిని పట్టుకుని కొట్టారు. ఒంటరిగా వస్తున్న యువకుణ్ణి పదుల సంఖ్యలో టీడీపీ అనుచరులు కలిసి చితకబాదారు.
- అనంతపురం రూరల్ మండలం పిల్లిగుండ్ల కాలనీలో రౌడీషీటర్ మనోహర్‌నాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. స్థానికంగా నివాసముంటున్న చంద్రశేఖర్‌రెడ్డి అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై కట్టెలతో దాడిచేశారు. రౌడీషీటర్‌తో పాటు మరో పదిమంది ఈ దాడిలో పాల్గొన్నారు.
పిడుగురాళ్లలో మాటువేసి దాడి
ఇదిలా ఉంటే.. వైఎస్సార్‌సీపీ విజయోత్సవ ర్యాలీపై గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో టీడీపీ నేతలు ఊహించని విధంగా దాడిచేశారు. వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం కావడంతో గ్రామంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో ముదిరాజ్ బజార్‌కు ర్యాలీ ప్రవేశిస్తుండగా అప్పటికే పక్కా ప్రణాళికతో కాపు కాసిన మహిళలు డాబాల మీద నుంచి ర్యాలీపై కారంపొడి చల్లారు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే టీడీపీ నాయకులు.. చల్లా కోటిరెడ్డి, సుంకు పవన్‌రెడ్డి, ఎంపీటీసీ భర్త గున్నంరెడ్డి శెవిరిరెడ్డిలపై వేటకొడవళ్లు, గొడ్డళ్లతో దాడిచేశారు. దీంతో చల్లా కోటిరెడ్డి తల వెనుక భాగంపై, మెడపై నరం తెగడంతో తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమంగా మారింది. చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ నుంచి నరసరావుపేటకు తరలించారు. సుంకు పవన్‌రెడ్డికి తలపై, ఎడమ కన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఎంపీటీసీ భర్త శెవిరిరెడ్డికి నుదురు భాగంలో గాయమైంది. కాగా, ఇదే సమయంలో పొలం నుంచి ద్విచక్ర వాహనంపై గ్రామంలోకి వస్తున్న ముడేల శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నేతలు గొడ్డలితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసి అక్కడినుంచి పరారయ్యారు. అనంతరం.. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనతో ఎలాంటి సంబంధంలేని గున్నంరెడ్డి రంగారెడ్డిని పోలీసులు చితకబాదడంతో అతని కంటి భాగంలో తీవ్రగాయమైంది. గ్రామంలో పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు.
రాళ్లు, కర్రలతో దాడి
కాగా, ఇదే జిల్లా బొల్లాపల్లి మండలం గండిగనుమల పంచాయతీ శివారు షోలాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా టీడీపీ వర్గీయులు రాళ్లు, కర్రలతో మహిళలని కూడా చూడకుండా దాడికి తెగబడ్డారు. దీంతో జవిశెట్టి రాములమ్మ, బత్తి ముసలయ్యలకు గాయాలయ్యాయి. వీరితో పాటు చిన్నారులు లక్ష్మీ, గురవయ్య కూడా గాయపడినట్లు బాధితులు తెలిపారు. తనను కాళ్లతో ఛాతీపై తన్నినట్లు రాములమ్మ ఆవేదన వ్యక్తంచేసింది. బాధితులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment