నేర శిఖామణా.. నారీమణా..మీకు ఎవరు కావాలి..? | Difference Between Akkaramani Vijaya Nirmala And Velagapudi Rama Krishna | Sakshi
Sakshi News home page

నేర శిఖామణా.. నారీమణా..మీకు ఎవరు కావాలి..?

Published Fri, Apr 5 2019 1:00 PM | Last Updated on Mon, Apr 8 2019 1:06 PM

Difference Between Akkaramani Vijaya Nirmala And Velagapudi Rama Krishna - Sakshi

ప్రశాంత విశాఖలో మూడు దశాబ్దాల క్రితం నేర చరిత్రను పరిచయం చేసిన వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తుండగా.. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలోనూ కోట్ల రూపాయలతో భీమిలి అభివృద్ధికి బాటలు వేసిన అక్కరమాని విజయనిర్మల వైఎస్సార్‌సీపీ తూర్పు అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. గుమస్తా పనితో ప్రారంభించి.. గూండాగిరీ వరకూ ఎదిగి.. ఫైనాన్స్‌ కంపెనీ పేరుతో జనాల్ని ముంచేసి.. ఆపై మద్యం మాఫియాగా అవతరించిన వెలగపూడి కావాలా.. తూర్పు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందించిన విజయనిర్మల కావాలా? ఈ నిర్ణయానికి ముందు వారికి సంబంధించిన కొన్ని అంశాల్ని పరిశీలిద్దాం..  – విశాఖ సిటీ

వెలగపూడి రామకృష్ణ – టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి
30 సంవత్సరాల క్రితం విజయవాడలోని ఏలూరు రోడ్డులో రాగమాలిక ఆడియో షాపులో పగలంతా క్యాసెట్‌లు అద్దెకిచ్చే పని.. రాత్రయితే అదే షాపును అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా వెలగపూడి తయారు చేసుకున్నారు.
దేవినేని నెహ్రూ అనుచరగణంలో ఉంటూ 1986 డిసెంబర్‌ 26న ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా హత్య కేసులో మూడో నిందితుడయ్యాడు. ఆ తరువాత బెజవాడ నుంచి పారిపోయి విశాఖకు వలసొచ్చి.. తొలుత ఎంవీపీ కాలనీ సెక్టార్‌–6లోని బిల్డింగ్‌లో టెలెక్స్‌ పేపర్లు తయారు చేసే ఓ వ్యాపారి వద్ద పని చేశారు. ఆ తర్వాత ఓ దినపత్రిక అడ్వర్టైజ్‌మెంట్‌ సంస్థలో గుమస్తాగా పని చేశాడు.
షిర్డీ సాయి స్కీం ఫైనాన్స్‌ కంపెనీ పెట్టి జనాలను నిలువునా ముంచాడు. మద్యం సిండికేట్‌ వైపు దృష్టిసారించి.. జనప్రియ సిండికేట్‌ వ్యాపారులను టెండర్లు వేయొద్దంటూ బెదిరించి దౌర్జన్యం చేయించారు. అప్పట్లో త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ తెరిచేందుకు అంతా సిద్ధం చేశారు. అప్పటి ఏసీపీ రంగరాజు కాళ్లావేళ్లా పడటంతో రౌడీషీట్‌ తెరవలేదన్న ఆరోపణలున్నాయి.
విశాఖ నగరానికి విజయవాడ రౌడీలు, గూండాలను అతిథులుగా తీసుకొచ్చి కబడ్డీ పోటీలు, విశాఖ సంస్కృతికి సంబంధం లేని కోడిపందేలు నిర్వహించారు. దేవినేని నెహ్రూ సోదరుడైన దేవినేని మురళి పేరుతో కబడ్డీ పోటీలంటూ హల్‌చల్‌ చేసేవాడు.
2009లో విశాఖ తూర్పు నుంచి టీడీపీ తరఫున అనూహ్యంగా వెలగపూడి ఎమ్మెల్యే గెలిచారు. అక్కడి నుంచి అతని అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. టీడీపీలోనే ఉంటూ అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలోని మున్సిపల్‌ శాఖ మంత్రి మహిధర్‌రెడ్డి అండతో వుడా భూములను కాజేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
సెక్టార్‌–2లో ఓ బహుళ అంతస్తుల భవనం కోసం అమాయక రజకుల్ని ఖాళీ చేయించడం, ఆ భవన యజమాని అడిగినంత డబ్బులు ఇవ్వలేదని తిరిగి వారిపైనే దౌర్జన్యం చేయడం.. రుషికొండ సర్వే నం.21/ఏ,బీల్లో 650 గజాల గెడ్డ పోరంబోకు దురాక్రమణ, రోడ్డు విస్తరణలో స్థలం పోయిందని వుడా అధికారులను బెదిరించి రుషికొండ లేఔట్‌లో రెండు ప్లాట్లను అప్పనంగా కొట్టేయడం.. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ భూముల ఆక్రమణ, వర్సిటీలో వర్గ రాజకీయాలకు తెరతీశారు.
విశాఖలో మద్యం సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎదిగిపోయారు వెలగపూడి. మొత్తం నగరంలో 150 వైన్‌ షాపులు ఉండగా, 50 నుంచి 60 షాపుల్లో భాగస్వామ్యం, బినామీల పేరిట సొంతంగా 6 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి.
పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా తూర్పు నియోజకవర్గంలో తాను ఈ ఒక్క మంచి పని చేశాను... అని చెప్పుకునే పరిస్థితి వెలగపూడికి లేదు. రాష్ట్రం మొత్తం మీద తూర్పు నియోజకవర్గంలోనే ఇటీవల ఏకంగా 40 వేల దొంగఓట్లను ఎన్నికల సంఘం గుర్తించి తొలగించిందంటే వెలగపూడి ట్రాక్‌ రికార్డ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అక్కరమాని విజయనిర్మల – వైఎస్సార్‌సీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి
భీమిలి మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా, ఆ తర్వాత ఛైర్‌పర్సన్‌గా సేవలందిస్తూ.. అక్కడ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అక్కరమాని విజయనిర్మల అనతి కాలంలోనే ఆ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
2005లో భీమిలి మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకున్న సమయంలో రిజర్వేషన్ల పరంగా మహిళలకు కేటాయించడంతో అనుకోకుండా విజయనిర్మలకు అవకాశం వచ్చింది. అప్పటికే సామాజిక సేవలో ప్రజలకు సుపరిచితురాలై ఉండడంతో టీడీపీ అభ్యర్థిగా గెలుపు అవకాశం తలుపుతట్టింది.
ఆ తర్వాత భీమిలి మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌గా, చైర్‌పర్సన్‌గా సేవలందించారు. రాజకీయాల్లోకి వస్తే.. ప్రజాసేవ చేసేందుకు మరింత అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో ఆ బాటలోనే ప్రయాణం సాగించారు.
భీమిలి మున్సిపాలిటీ 2005–2010 మధ్య కాలంలో ఏడాదిన్నర కాలం పాటు చైర్‌పర్సన్‌గా, మిగిలిన సమయం వైస్‌చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రతిపక్ష పార్టీకి చెందిన చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు కూడా భీమిలి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపారు.
భీమిలి మున్సిపాలిటీ ప్రజల్ని దశాబ్దాల కాలంగా మంచినీటి సమస్య వేధించింది. గోస్తనీ నది పూర్తిగా ఎండిపోవడంతో తాగునీరు దొరకడం కష్టమైంది. ఈ సమయంలో విజయనిర్మల తన సొంత డబ్బులతో ప్రజలకు తాగునీటిని అందించి అందరి మన్ననలూ పొందారు.
తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.17.50 కోట్ల వ్యయంతో 2005 ఆగస్ట్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించి.. పనుల్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజల మంచినీటి కష్టాలు తీర్చారు.
రూ.50 లక్షల నిధులతో మున్సిపాలిటీ పరిపాలన భవనాన్ని నిర్మించారు.
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో సంప్రదింపులు చేస్తూ.. రూ.3.35 కోట్ల నిధులను దగ్గరుండి విడుదల చేయించి.. భీమిలి మున్సిపాలిటీలోని మురికివాడల్లో మంచినీరు, రోడ్లు, పాఠశాలల అభివృద్ధి, తదితర సదుపాయాలు కల్పించారు.
విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణమే నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల చిట్టాను తయారు చేసుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు రూపొందించాల్సిన ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశారు.    
తన ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేంత వరకూ విశ్రాంతి లేకుండా కృషి చేసే అక్కరమాని విజయనిర్మల వంటి విజ్ఞురాలు కావాలా..? వంచనలతో విశాఖలో విషపు సంస్కృతికి తెరతీస్తూ.. లిక్కర్‌ మాఫియాతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వెలగపూడి కావాలా..? ఓటర్లూ ఆలోచించుకోండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement