VELAGAPUDI Rama Krishna
-
బొక్కడం తప్ప.. 'వెలగ'బెట్టిందేంటి?
విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఈ పేరంటే హడల్. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాలే గుర్తొసాయి. నియోజకవర్గంలో ‘వెలగ’బెట్టింది మాత్రం శూన్యం. 2009, 2014, 2019 జరిగిన సాధారణ ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైనా సొంత వ్యాపారాలు, దందాలుపైనే దృష్టి పెట్టారు. అనుచరులతో భూ కబ్జాలకు పాల్పడటం, మద్యం వ్యాపారం, కోడి పందాలు నిర్వహించి సొమ్ము చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. – ఆరిలోవ నగర వాసులకు విష సంస్కృతి పరిచయం చేసిన ఘనుడు కోడిపందేలు, జూదాలతో రూ. కోట్లు వెనకేసుకున్న వైనం ఎంవీపీ కాలనీలో రూ.కోట్ల విలువైన భూముల ఆక్రమణ కన్ను పడితే కబ్జా చేయాల్సిందే మద్యం దుకాణాల ఏర్పాటుతో మహిళల ఆక్రందన కోడి పందేలు, మద్యం షాపులు విశాఖ ప్రజలకు తెలియన కోడి పందేలు సంస్కృతిని ఎమ్మెల్యే వెలగపూడి రుచి చూపించారు. ఇది విష సంస్కృతి అని తెలియక ఇక్కడ ప్రజలు సుమారు నాలుగేళ్లు పాటు వరుసగా సంక్రాంతి సమయంలో జేబులు గుల్ల చేసుకొన్నారు. ఈ పందేలను స్వయంగా ఎమ్మెల్యే వెలగపూడే ముడసర్లోవ రిజర్యాయరు వెనుక జీవీఎంసీకి చెందిన 10 ఎకరాల ఖాళీ స్థలంలో 2016, నుంచి 2020 వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించి రూ. కోట్లలో సొమ్ముచేసుకున్నారు. దీంతో పాటు ఆరిలోవ, జోడుగుళ్లుపాలెం, అప్పూఘర్, జాలరిపేట ప్రాంతాలలో మద్యం దుకాణాలను 2015 నుంచి ప్రారంభించారు. 2015లో ఆరిలోవలో నిర్వహించిన మద్యం దుకాణం తొలగించాలని స్థానికులు, డ్వాక్రా సంఘాల మహిళలు, ఐద్వా మహిళలు ధర్నాలు చేపట్టినా ఆయన పట్టించుకోలేదు. ► టీడీపీ నుంచి 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు రుషికొండ ప్రాంతంపై కన్నుపడింది. అక్కడ రెవెన్యూకి చెందిన భూమిలో గెడ్డ భాగాన్ని ఆక్రమించి ఆ స్థలం రోడ్డు నిర్మాణంలో తొలగించినట్లు చూపించారు. అతని స్థలం పోయినందుకు వేరేచోట ప్రత్యామ్నాయంగా స్థలం పొందారు. ► 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన దందాలపై మరింత దృష్టి సారించారు. జోడుగుళ్లుపాలెం వద్ద సుమారు ఎకరం స్థలాన్ని తన బంధువుల పేరుతో ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రయత్నానికి బ్రేక్ పడింది. ► నియోజకవర్గానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన ఎంవీపీ కాలనీలో సెక్టార్–2లో గెడ్డ స్థలాన్ని ఆక్రమించి ఓ బిల్డర్‌కు అపార్టుమెంట్ నిర్మాణం కోసం కట్టబెట్టారు. ఆ అపార్టుమెంట్లో కొన్ని ప్లాట్లు తనకు ఇవ్వడానికి బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అప్పట్లో నియోజకవర్గంలో సంచలనమైంది. దీంతో జీవీఎంసీ అధికారులు ఆ అపార్టుమెంట్ నిర్మాణాన్ని నిలిపేశారు. దీనిపై అప్పట్లో వైఎస్సార్సీపీ నాయకుడు(ప్రస్తుతం జనసేన కార్పొరేటర్) పీతల మూర్తియాదవ్ ఈ ఆక్రమణపై కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు వ్యవహారం కోర్టులో ఉంది. రామకృష్ణాపురాన్ని ఆనుకొని ముడసర్లోవ రిజర్యాయరు వెనుక 2017లో పెగదిలికి చెందిన వెలగపూడి రామకృష్ణబాబు ఆనుచరులు కొందరు సర్వే నంబర్లు 26, 27ల్లో సుమారు ఎకరం ప్రభుత్వ స్థలం ఆక్రమించి 18 కమ్మల పాకలు వేశారు. దీనిపై వెలగపూడికి వ్యతిరేకంగా అప్పట్లో ఫిర్యాదులు వెళ్లడంతో జీవీఎంసీ అధికారులు వాటిని తొలగించారు. ఇలా మూడుసార్లు అధికారులు తొలగించాల్సి వచ్చింది. దీంతో వెలగపూడి అనుచరులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. -
చిల్లర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి వంశీ: ఎంపీ ఎంవీవీ ఫైర్
సాక్షి, విశాఖపట్నం: రంగాను చంపిన వ్యక్తి వెలగపూడి అని వైఎస్సార్సీపీ ఎంవీవీ సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. అలాగే, ఎమ్మెల్సీ వంశీ ఒక అవివేకి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఎంపీ ఎంవీవీ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘రంగాను చంపి పారిపోయి వైజాగ్ వచ్చిన వ్యక్తి వెలగపూడి. కాపుల ఓట్ల కోసం పవన్ ఫొటో పెట్టుకుని తిరుగుతున్నారు. రంగాను వెలగపూడి ఎలా చంపారో ఆధారాలు బయలపెడతాను. ఎమ్మెల్సీ వంశీ ఒక అవివేకి. వంశీ చెబితే ఓడించేస్తారు అనుకుంటే ఆయన ఎందుకు గెలవలేకపోయారు. వంశీ మీద చెక్ బౌన్స్ కేసులు ఎన్నో ఉన్నాయి. వంశీ ఎంతో మంది డబ్బులు ఎగ్గొట్టారు. సీటు లేక వంశీ ఫస్ట్రేషన్‌కు గురవుతున్నారు. మేయర్ పదవి స్థానికంగా ఉన్న యాదవులకు ఇస్తే తప్పేంది. వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచిన వంశీ. పవన్ కల్యాణ్‌ను వంశీ ఎన్నో సార్లు తిట్టారు. వంశీ చిత్త కార్తి కుక్కతో సమానం. బాబు మోహన్, బ్రహ్మానందంలా కామెడీ యాక్టర్ వంశీ. అతడిలాగా నేను చిల్లర వ్యక్తిని కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
హత్యా రాజకీయాల్లో వెలగపూడి సిద్ధహస్తుడు..
సాక్షి, విశాఖ: హత్యా రాజకీయాలు చేయడంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సిద్ధహస్తుడని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫైరయ్యారు. వంగవీటి రంగా హత్య కేసుతో సంబంధాలు ఉన్నవెలగపూడి.. అవినీతి తిమింగళమని ఆరోపించారు. ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ అభ్యర్ది అమరేంద్ర ఇద్దరూ పూజకు పనికిరాని పువ్వులని ఎద్దేవా చేశారు. స్వతంత్ర అభ్యర్థి గౌస్ పవిత్రమైన మసీదును రాజకీయాలకు వాడుతున్నారని విమర్శించారు. గౌస్ తన అల్లుడు సహకారంతో బీహార్ ముఠాలను రంగంలోని దింపి హత్యా రాజకీయాలు నడుపుతున్నాడని ఆరోపించారు. గ్రేటర్ విశాఖకు ఖండాంతర ఖ్యాతి దక్కాలంటే వైఎస్సార్సీపీ అభ్యర్ది వంశీకృష్ణ శ్రీనివాస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ పరిధిలోని పలు సమస్యలపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. సమస్యలు పరిష్కరించేందుకు అన్ని విధాల కృషి చేస్తానని హామినిచ్చారు. ఏయూలో పని చేస్తున్న టైమ్ స్కేల్ ఉద్యోగుల సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, చిన వాల్తేరులో చేపల మార్కెట్ ఆధునీకరణ, ఒరిస్సా బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం, వాల్తేరులో తాగునీటి సమస్యకు పరిష్కారం, గౌడ వీధిలో సామాజిక భవనం నిర్మాణం, ధోభీ ఘాట్ నిర్మాణం, పాండురంగాపురం ప్రజలకు ఇళ్ల స్థలాలు, గోశాల నిర్మాణం వంటి పలు హామీలను గుప్పించారు. -
విశాఖకు ఎందుకు వలసొచ్చావ్..?
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతిగీసిన ఛాయాచిత్రంలా ఉండే అందమైన ప్రశాంత విశాఖపట్నంపై కొన్నేళ్లుగా విషం చిమ్ముతూ వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తాజాగా ’ప్రమాణాల’ వ్యవహారంలోనూ తనదైన అతి తెలివి మార్కునే ప్రయోగిస్తున్నారు. విశాఖ నగరంలోనూ నేరసంస్కృతి పెచ్చుమీరేందుకు, రౌడీయిజం వేళ్లూనుకునేందుకు బీజం వేసిన వెలగపూడి ఇప్పుడు శుద్దపూసలా మాట్లాడటం చూసి రాజకీయ విశ్లేషకులు విస్తుపోతున్నారు. ఒక్కసారి అతని వివాదాస్పద నేరమయ రాజకీయం పరిశీలిస్తే.. విజయవాడలోని ఏలూరు రోడ్డులో 30 ఏళ్ల కిందట బతుకునీడ్చేందుకు రాగమాలిక ఆడియో షాపులో క్యాసెట్లు అద్దెకిచ్చే పని వెలగపూడిది. ఇదంతా పగలు.. రాత్రిళ్లు అదే షాపును అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా చేసేవాడు. దేవినేని మురళి అనుచరగణంలో ఉంటూ 1986 డిసెంబర్ 26న ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా హత్య కేసులో నిందితుడయ్యాడు. జైలు పాలయ్యాడు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత.. క్యాసెట్ దుకాణమే కాదు.. బెజవాడ కూడా వదిలేసి.. సరిగ్గా చెప్పాలంటే పారిపోయి విశాఖకు వలసొచ్చాడు. తొలుత ఎంవీపీకాలనీ సెక్టార్–6లోని బిల్డింగ్‌లో టెలెక్స్ పేపర్లు తయారుచేసే ఓ వ్యాపారి వద్ద తలదాచుకున్నాడు. ఆ తర్వాత ఓ దినపత్రిక అడ్వర్టైజ్మెంట్ సంస్థలో చిన్న గుమాస్తా ఉద్యోగం చేశారు. అటు తర్వాత షిర్డీ సాయి స్కీం ఫైనాన్స్ కంపెనీ పెట్టి ఇట్టే బోర్డు తిప్పేశాడు. మీసాలోడు అలియాస్ మద్యం రామకృష్ణ అటు తర్వాత మద్యం సిండికేట్ వైపు దృష్టిసారించి.. అప్పటివరకు ఉన్న ఓ సిండికేట్ వ్యాపారులను టెండర్లు వేయొద్దంటూ బెదిరించి దౌర్జన్యం చేయించారు. దీంతో అప్పట్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరిచేందుకు అంతా సిద్ధం చేశారు. ఇక రౌడీరాజకీయం తెలియని విశాఖ నగరానికి విజయవాడ రౌడీలు, గూండాలను అతిథులుగా తీసుకొచ్చి కబడ్డీ పోటీలు, విశాఖ సంస్కృతికి సంబంధం లేని కోడిపందేల పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే గిరితో అరాచక ప్రస్థానం ఇక సరిగ్గా 2009లో విశాఖ తూర్పు నుంచి టీడీపీ తరఫున అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యాడు. అక్కడి నుంచి మొదలు అతని అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. టీడీపీలోనే ఉంటూ అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లోని ఓ మంత్రి అండతో వుడా భూములను అప్పనంగా కొట్టేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రుషికొండలో పోరంబోకు భూముల దురాక్రమణ, రోడ్డు విస్తరణలో స్థలం పోయిందని వుడా అధికారులను బెదిరించి రుషికొండ లేఔట్లో రెండు ప్లాట్లను అప్పనంగా కొట్టేయడం.. ప్రతిష్టాత్మక ఏయూలో వర్గ రాజకీయాలు జొప్పించికలుషితం చేయడం, ఆరిలోవ ప్రాంతంలో వెలగపూడి యువసేన పేరిట దందాలు, దౌర్జన్యాలు.. హంతకులు, నేరస్తులకు అండగా ఉండటం.. ఇలా చెప్పుకుంటూ వెలగపూడి నేరచరితకు కొదవేలేదు. ఇక ఎడ్యుకేషన్ సిటీగా వెలిగిన విశాఖ నగరాన్ని ఎడిక్షన్ సిటీగా మార్చేసింది ఎవరంటే.. టీడీపీ నేతలు కూడా వెలగపూడి రామకృష్ణ పేరే చెబుతారు. రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడే.. రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడే.. ఇందులో అనుమానం లేదు.. వాస్తవాలు ఎవరు తొక్కిపెట్టగలరు.. అని దివంగత వంగవీటి మోహన రంగాకు అత్యంత సన్నిహితుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. ఇరవై నెలలుగా.. కలుగులోనే వెలగపూడి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన దరిమిలా వెలగపూడి అక్రమాలకు చెక్‌పడింది. తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి బ్యాచ్ దందాలు, దౌర్జన్యాలు ఆగిపోయాయి. కోడి పందేల ఊసే లేకుండా పోయింది. బినామీ ముసుగులో లిక్కర్ మాఫియా ఆగడాలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా తెర వెనక్కి వెళ్లిన వెలగపూడి తన భూదందాలపై ఉక్కుపాదం పడటంతో ఉక్కిరి బిక్కిరై బయటకు వచ్చి ప్రమాణాల రాజకీయానికి తెరలేపారు.తానేమీ తప్పు చేయలేదని, రంగా హత్య కేసుకు తనకు సంబంధం లేదని, ఈ విషయమై రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి సమక్షంలో సాయిబాబా సన్నిధిలో తాను ప్రమాణం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. నీకు సాయిరెడ్డి స్థాయి లేదు: వంశీకృష్ణ శ్రీనివాస్ తమ నాయకుడు విజయసాయిరెడ్డి గురించి మాట్లాడే స్థాయి వెలగపూడికి లేదని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ’’ అసలు నువ్వు విశాఖ ఎందుకు వలసొచ్చావ్..? రంగా హత్య కేసుతో సంబంధం ఉందా లేదా... ?. కోర్టు కొట్టేసిన ఆ కేసులో నిందితుడిగా పేరుందా లేదా? .. ఆ హత్య కేసులో నిందితుడిగా జైలు జీవితం గడిపావా లేదా.? ..విశాఖలో కూడా గతంలో కేసులు ఉన్నాయా లేవా..? ’’ ముందు వెలగపూడి వీటికి సమాధానం చెప్పాలని వంశీకృష్ణ యాదవ్ సవాల్ విసిరారు. -
సవాళ్ల పర్వం: ముఖం చాటేసిన వెలగపూడి
సాక్షి, విశాఖపట్నం: సవాళ్ల పర్వం ముగిసిపోయిందని తాము చేసిన ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యిందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. వెలగపూడికి ఇచ్చిన గడువు ముగియడంతో వెళ్లిపోయిన ఆయన ఆదివారం సాయిబాబా ఆలయం నుంచి వెళ్లిపోయారు. సాయిబాబా గుడిలో ప్రమాణానికి రావాలని అమర్నాథ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆధారాలతో సత్య ప్రమాణానికి అమర్నాథ్ సిద్ధమయ్యారు. కానీ ఆలయానికి టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ రాలేదు. వెలగపూడి కోసం గంట పాటు అమర్నాథ్, పార్టీ నేతలు వేచి చూశారు. వెలగపూడి రాకపోవడంతో ఎమ్మెల్యే అమర్నాథ్ వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరోపణలు వాస్తవం కాబట్టే వెలగపూడి మొహం చాటేశారని మండిపడ్డారు. సత్య ప్రమాణానికి గైర్హాజరైన వెలగపూడి తన తప్పులను ఒప్పుకున్నట్టే అన్నారు. రిషికొండలో వెలగపూడి రామకృష్ణ భూమి ఆక్రమించారని దుయ్యబట్టారు. ఇప్పటికే వెలగపూడి అక్రమాలపై సాక్ష్యాలు బయట పెట్టామని అన్నారు. భూ ఆక్రమణలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇకపై టీడీపీ నాయకులకు సవాలు విసిరే అర్హత లేదని తాము సవాళ్లకు రావాలంటే చంద్రబాబు, లోకేష్ రావాలని అమర్నాథ్ అన్నారు. ఇప్పటికైనా ఆక్రమణదారులు తమ భూములు వెనక్కి ఇస్తే మంచిదని, త్వరలో సిట్ నివేదికలో టీడీపీ బండారం బయటపడుతుందన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ బిచ్చగాడని, ఇతరులకు ఆయన రాజకీయ భిక్ష పెట్టింది ఏంటనీ సూటిగా ప్రశ్నించారు. తన పేరిట అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తిస్తే స్టాంప్ పేపర్‌పై అనాధ శరణాలయానికి రాసిస్తానని అన్నారు. ఆచూకీ లేని ఎమ్మెల్యే వెలగపూడి పెదవాల్తేరు(విశాఖ తూర్పు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సవాల్‌కి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆచూకీ లేకుండా పోయారు. ఈస్ట్పాయింట్కాలనీలో గల ఈస్ట్ శిరిడీ సాయిబాబా ఆలయం వద్దకు శనివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, వెంకటరావు తదితరులు బాబా చిత్రపటంతో ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అప్పటికే త్రీటౌన్ సీఐ కోరాడరామారావు పర్యవేక్షణలో ఎస్ఐ జె.ధర్మేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు గంటకు పైగా నిరీక్షించారు. ఈ సందర్భంగా విజయనిర్మల మీడియాతో మాట్లాడు తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కోసం ఆలయం వద్ద ఎదురుచూసినా రాలేదన్నారు. ఎమ్మెల్యేకు సంబంధించిన ఆక్రమణలు తొలగించడం హర్షణీయమన్నారు. వెలగపూడి ముమ్మాటికీ వంగవీటి రంగా హత్యకేసులో నిందితుడేనని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని విమర్శించే స్థాయి వెలగపూడికి లేదని పేర్కొన్నారు. అక్కరమాని ప్రతి సవాల్‌తో పోలీసుల హై అలర్ట్ వెలగపూడి రామకృష్ణబాబుకు వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల ప్రతి సవాల్ విసరడంపై ద్వారకా జోన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డిని వెలగపూడి విమర్శిస్తూ గురువారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను భూ కబ్జాలు చేయలేదంటూ, దానికి నిదర్శనంగా ఈస్ట్‌పాయింట్ కాలనీ సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమంటూ వెలగపూడి పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను శుక్రవారం ఖండిస్తూ అక్కరమాని విజయనిర్మల ప్రతి సవాల్ విసిరారు. దీంతో శనివారం ఈస్ట్‌పాయింట్ కాలనీ సాయిబాబా గుడి వద్ద, ఎంవీపీ సెక్టార్–4లోని వెలగపూడి కార్యాలయం వద్ద నాటకీయ పరిణా మాలు చోటు చేసుకున్నాయి. బాబా ఆలయం వద్దకు వెలగపూడి రాకపోవడంతో ఎంవీపీ కాలనీలోని ఆయన కార్యాలయానికి వెళ్లేందుకు అక్కరమానితోపాటు పార్టీ నాయకులు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎంవీపీ కాలనీలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేయడంతోపాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ద్వారకా ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి పర్యవేక్షణలో పోలీసులు సాయంత్రం వరకు వెలగపూడి కార్యాలయానికి, ఇల్లుకు భద్రత కల్పించారు. -
నువ్వేంటి.. నీ స్థాయేంటి: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం : వంగవీటి మోహనరంగ హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ అక్రమాలేమిటో విశాఖ ప్రజలకు తెలుసని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ నువ్వేంటి.. నీ స్థాయేంటి?.. నీ స్థాయికి విజయసాయిరెడ్డి ప్రమాణానికి రావాలా?’ అంటూ మండిపడ్డారు. రేపు(ఆదివారం) ఉదయం 11 గంటలకు సాయిబాబా ఆలయానికి వస్తానని, వెలగపూడికి దమ్ముంటే సాయిబాబా ఆలయానికి రావాలని సవాల్ విసిరారు. వెలగపూడి అక్రమాలపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ విజయసాయిరెడ్డిపై మీరు అక్రమ కేసులు పెట్టారని ఏనాడో నిరూపితమైంది. వెలగపూడి అక్రమాలు ప్రజలందరికీ తెలుసు. విశాఖ పారిపోయి వచ్చినప్పుడు నీ ఆస్తి ఎంత?. నీ ఆస్తుల వివరాలు చెప్పగలవా?. హత్య కేసులో ఉన్న వ్యక్తులు విశాఖలో రాజకీయాలు చేస్తున్నారు. ( ‘ఆయన.. నీటి విలువ తెలిసిన వ్యక్తి’ ) వాగు పోరంబోకు భూమిని అక్రమంగా రెగ్యులరైజ్ చేసేందుకు ప్రయత్నించలేదా?. 225 గజాల వాగు పోరంబోకు భూమిని వెలగపూడి ఆక్రమించాడు. టీడీపీ నేతల చెరలో ఉన్న 171 ఎకరాల ప్రభుత్వ భూమిని విడిపించగలిగాం. భూ కబ్జాదారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు కోర్టుకెళ్లారు.. పట్టణాల్లో ఉన్న పేదలకు కూడా సెంటు స్థలం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. విశాఖలో కూడా పేదలకు ఇళ్లు రాకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ జరుగుతోంద’’ని అన్నారు. -
బాబు 420 అయితే.. వెలగపూడి 840..
సాక్షి, విశాఖ : అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అలాగే 17వేల కొత్త కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే అమర్నాథ్ శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చేతులెత్తి దండం పెడుతున్నా. సెంటు స్థలం లేని పేదవారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న సీఎం జగన్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాం. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు నాయుడుకు బుద్ధి రాలేదు. ప్రజల ఇళ్ల పట్టాలను అడ్డుకునే కుట్రలు చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి అందరూ అవినీతికి పాల్పడినట్లు భావించి ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారు. బాబు తన పాలనలో ఒక మంచిపని చేయకపోగా ముఖ్యమంత్రి చేస్తున్న మంచి పనులను అడ్డుకుంటున్నారు. ఇళ్ల పట్టాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తుంటే దాని జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు లేనిపోని విమర్శలు చేస్తున్నారు. బాబు చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు అందరు గమనిస్తున్నారు. ఇక రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీద వెలగపూడి రామకృష్ణ ఛాలెంజ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. వెలగపూడి తీరు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడు. ఆయన అక్రమాలు ప్రజలందరికీ తెలుసు. ఆయనను బెజవాడలో బహిష్కరిస్తే వైజాగ్ వచ్చాడు. చంద్రబాబు 420 అయితే.. వెలగపూడి 840. తూర్పు నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదు చేయించి గెలిచాడు. విశాఖ ప్రజలు రాజకీయంగా ఆదరిస్తే విశాఖ పరిపాలన రాజధాని కాకుండా కుట్రలు చేస్తున్నారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరో వారం రోజుల్లో సిట్ నివేదిక వస్తుంది. ఆ నివేదిక ఆధారంగా నిందితులను కఠినంగా శిక్షిస్తాం. సిట్ నివేదికలో ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు’ అని స్పష్టం చేశారు. (పేదలకు పట్టాభిషేకం ) విశాఖ జిల్లాలో పట్టాల పండగ విశాఖ జిల్లాలో పేదల ఇళ్ల పంపిణీకి పెందుర్తి మండలం వాలిమెరక నుంచి శ్రీకారం జరగనుంది. విశాఖ జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ 73,660 మందికి ఇళ్ల పట్టాలు అందనున్నాయి. అలాగే 16,954 మందికి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు. 25 వేల 743 మంది టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్నారు. వీటిలో విశాఖ సిటీ లో 23,576 టిడ్కో ఇల్లు పంపిణీ జరగనుంది. ఆ క్రమంలో ఈ పట్టాల పంపిణీ ద్వారా ద్వారా ఒక లక్ష 63 వేల 50 7 మందికి లబ్ధి పొందనున్నారు. -
దేవుడంటే నమ్మకం లేదు.. పాప భీతి లేదు..
సాక్షి, విశాఖపట్నం : వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో.. ‘‘ విజయవాడలో వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ దేవుడి మీద ప్రమాణం చేస్తానని సవాల్ విసిరినట్టుగా మీడియాలో చూశాను. రామకృష్ణ తామంతా కలిసి చంపేసిన వంగవీటి మీద అయినా ప్రమాణం చేయగలడు, చంద్రబాబు వల్ల మరణించిన ఎన్టీఆర్ మీద అయినా ప్రమాణం చేయగలడు, తన భార్య మీద అయినా ప్రమాణం చేయగలడు, తన పిల్లల మీద అయినా ప్రమాణం చేయగలడు. ఎందుకంటే, దేవుడు అంటే నమ్మకం లేదు, పాప భీతి లేదు కాబట్టే, వంగవీటి హత్య తర్వాత విశాఖకు పారిపోయి వచ్చాడు. విశాఖ వచ్చిన వెలగపూడి ఏం చేశాడంటే.. భూములు మేశాడు, పీకలు కోశాడు అని అనేక మంది చెబుతున్నారు. ఈయనకు బినామీ భూములు లేవని ప్రమాణం చేస్తాడా?, బినామీ భూములు లేకపోతే ఎందుకు ఉలికిపాటుకు గురి అవుతున్నాడు, ఎందుకు తన ఆస్తులన్నీ పోయినట్టు బాధపడుతున్నాడు?. తనకు ఒక్క అంగుళం భూమి కూడా లేకపోతే బదులు తీర్చుకుంటానని ఎందుకు ప్రగల్భాలు పలుకుతున్నాడు?. ఈ విషయాలన్నింటికీ అతనే సమాధానం చెప్పాలి. విశాఖపట్నంలో వెలగపూడి రామకృష్ణను ఎవరైనా ధర్మాత్ముడు అనుకుంటారా లేక ఒక గూండా, రౌడీ ఎలిమెంటుగా భావిస్తున్నారా.. ?. రాక్షసత్వం నిండిన వ్యక్తి దేవుడి మీద ప్రమాణం చేయటం ఏమిటి? వినటానికి కూడా వెగటుగా ఉంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీ నేతల ఓవరాక్షన్.. పోలీసులపై దౌర్జన్యం
సాక్షి, విశాఖపట్నం: పట్టణంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, వాసుపల్లి గణేష్ కుమార్‌లు గురువారం ఉదయం ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించవ్దదంటూ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పోలీసులతో గొడవకు దిగారు. ర్యాలీకి అనుమతులేందుకంటూ పోలీసులపై దాడి చేశారు. జంక్షన్ వద్ద ఉన్న బారికేడ్స్‌ను తోసేసి ర్యాలీగా వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పర్యటన సందర్భంగా విశాఖ నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. టీడీపీ నాయకులు, కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించడంతో నగర పౌరులు ఇక్కట్లు ఎదుర్కొవాల్సి వచ్చింది. పోలీసులతో వాగ్వివాదాలకు దిగుతూ తెలుగు తమ్ముళ్లు ఓవరాక్షన్ చేయడంతో రద్దీ రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. అత్యుత్సాహం ప్రదర్శించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలను చంద్రబాబు వారించకపోవడం గమనార్హం. -
నేర శిఖామణా.. నారీమణా..మీకు ఎవరు కావాలి..?
ప్రశాంత విశాఖలో మూడు దశాబ్దాల క్రితం నేర చరిత్రను పరిచయం చేసిన వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తుండగా.. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలోనూ కోట్ల రూపాయలతో భీమిలి అభివృద్ధికి బాటలు వేసిన అక్కరమాని విజయనిర్మల వైఎస్సార్సీపీ తూర్పు అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. గుమస్తా పనితో ప్రారంభించి.. గూండాగిరీ వరకూ ఎదిగి.. ఫైనాన్స్ కంపెనీ పేరుతో జనాల్ని ముంచేసి.. ఆపై మద్యం మాఫియాగా అవతరించిన వెలగపూడి కావాలా.. తూర్పు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందించిన విజయనిర్మల కావాలా? ఈ నిర్ణయానికి ముందు వారికి సంబంధించిన కొన్ని అంశాల్ని పరిశీలిద్దాం.. – విశాఖ సిటీ వెలగపూడి రామకృష్ణ – టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ♦ 30 సంవత్సరాల క్రితం విజయవాడలోని ఏలూరు రోడ్డులో రాగమాలిక ఆడియో షాపులో పగలంతా క్యాసెట్లు అద్దెకిచ్చే పని.. రాత్రయితే అదే షాపును అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా వెలగపూడి తయారు చేసుకున్నారు. ♦ దేవినేని నెహ్రూ అనుచరగణంలో ఉంటూ 1986 డిసెంబర్ 26న ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా హత్య కేసులో మూడో నిందితుడయ్యాడు. ఆ తరువాత బెజవాడ నుంచి పారిపోయి విశాఖకు వలసొచ్చి.. తొలుత ఎంవీపీ కాలనీ సెక్టార్–6లోని బిల్డింగ్‌లో టెలెక్స్ పేపర్లు తయారు చేసే ఓ వ్యాపారి వద్ద పని చేశారు. ఆ తర్వాత ఓ దినపత్రిక అడ్వర్టైజ్మెంట్ సంస్థలో గుమస్తాగా పని చేశాడు. ♦ షిర్డీ సాయి స్కీం ఫైనాన్స్ కంపెనీ పెట్టి జనాలను నిలువునా ముంచాడు. మద్యం సిండికేట్ వైపు దృష్టిసారించి.. జనప్రియ సిండికేట్ వ్యాపారులను టెండర్లు వేయొద్దంటూ బెదిరించి దౌర్జన్యం చేయించారు. అప్పట్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరిచేందుకు అంతా సిద్ధం చేశారు. అప్పటి ఏసీపీ రంగరాజు కాళ్లావేళ్లా పడటంతో రౌడీషీట్ తెరవలేదన్న ఆరోపణలున్నాయి. ♦ విశాఖ నగరానికి విజయవాడ రౌడీలు, గూండాలను అతిథులుగా తీసుకొచ్చి కబడ్డీ పోటీలు, విశాఖ సంస్కృతికి సంబంధం లేని కోడిపందేలు నిర్వహించారు. దేవినేని నెహ్రూ సోదరుడైన దేవినేని మురళి పేరుతో కబడ్డీ పోటీలంటూ హల్చల్ చేసేవాడు. ♦ 2009లో విశాఖ తూర్పు నుంచి టీడీపీ తరఫున అనూహ్యంగా వెలగపూడి ఎమ్మెల్యే గెలిచారు. అక్కడి నుంచి అతని అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. టీడీపీలోనే ఉంటూ అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలోని మున్సిపల్ శాఖ మంత్రి మహిధర్‌రెడ్డి అండతో వుడా భూములను కాజేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ♦ సెక్టార్–2లో ఓ బహుళ అంతస్తుల భవనం కోసం అమాయక రజకుల్ని ఖాళీ చేయించడం, ఆ భవన యజమాని అడిగినంత డబ్బులు ఇవ్వలేదని తిరిగి వారిపైనే దౌర్జన్యం చేయడం.. రుషికొండ సర్వే నం.21/ఏ,బీల్లో 650 గజాల గెడ్డ పోరంబోకు దురాక్రమణ, రోడ్డు విస్తరణలో స్థలం పోయిందని వుడా అధికారులను బెదిరించి రుషికొండ లేఔట్లో రెండు ప్లాట్లను అప్పనంగా కొట్టేయడం.. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ భూముల ఆక్రమణ, వర్సిటీలో వర్గ రాజకీయాలకు తెరతీశారు. ♦ విశాఖలో మద్యం సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎదిగిపోయారు వెలగపూడి. మొత్తం నగరంలో 150 వైన్ షాపులు ఉండగా, 50 నుంచి 60 షాపుల్లో భాగస్వామ్యం, బినామీల పేరిట సొంతంగా 6 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ♦ పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా తూర్పు నియోజకవర్గంలో తాను ఈ ఒక్క మంచి పని చేశాను... అని చెప్పుకునే పరిస్థితి వెలగపూడికి లేదు. రాష్ట్రం మొత్తం మీద తూర్పు నియోజకవర్గంలోనే ఇటీవల ఏకంగా 40 వేల దొంగఓట్లను ఎన్నికల సంఘం గుర్తించి తొలగించిందంటే వెలగపూడి ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అక్కరమాని విజయనిర్మల – వైఎస్సార్సీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ♦ భీమిలి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా, ఆ తర్వాత ఛైర్‌పర్సన్‌గా సేవలందిస్తూ.. అక్కడ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అక్కరమాని విజయనిర్మల అనతి కాలంలోనే ఆ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ♦ 2005లో భీమిలి మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకున్న సమయంలో రిజర్వేషన్ల పరంగా మహిళలకు కేటాయించడంతో అనుకోకుండా విజయనిర్మలకు అవకాశం వచ్చింది. అప్పటికే సామాజిక సేవలో ప్రజలకు సుపరిచితురాలై ఉండడంతో టీడీపీ అభ్యర్థిగా గెలుపు అవకాశం తలుపుతట్టింది. ♦ ఆ తర్వాత భీమిలి మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌గా, చైర్‌పర్సన్‌గా సేవలందించారు. రాజకీయాల్లోకి వస్తే.. ప్రజాసేవ చేసేందుకు మరింత అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో ఆ బాటలోనే ప్రయాణం సాగించారు. ♦ భీమిలి మున్సిపాలిటీ 2005–2010 మధ్య కాలంలో ఏడాదిన్నర కాలం పాటు చైర్‌పర్సన్‌గా, మిగిలిన సమయం వైస్‌చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ♦ ప్రతిపక్ష పార్టీకి చెందిన చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు కూడా భీమిలి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపారు. ♦ భీమిలి మున్సిపాలిటీ ప్రజల్ని దశాబ్దాల కాలంగా మంచినీటి సమస్య వేధించింది. గోస్తనీ నది పూర్తిగా ఎండిపోవడంతో తాగునీరు దొరకడం కష్టమైంది. ఈ సమయంలో విజయనిర్మల తన సొంత డబ్బులతో ప్రజలకు తాగునీటిని అందించి అందరి మన్ననలూ పొందారు. ♦ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.17.50 కోట్ల వ్యయంతో 2005 ఆగస్ట్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించి.. పనుల్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజల మంచినీటి కష్టాలు తీర్చారు. ♦ రూ.50 లక్షల నిధులతో మున్సిపాలిటీ పరిపాలన భవనాన్ని నిర్మించారు. ♦ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సంప్రదింపులు చేస్తూ.. రూ.3.35 కోట్ల నిధులను దగ్గరుండి విడుదల చేయించి.. భీమిలి మున్సిపాలిటీలోని మురికివాడల్లో మంచినీరు, రోడ్లు, పాఠశాలల అభివృద్ధి, తదితర సదుపాయాలు కల్పించారు. ♦ విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణమే నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల చిట్టాను తయారు చేసుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు రూపొందించాల్సిన ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశారు. ♦ తన ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేంత వరకూ విశ్రాంతి లేకుండా కృషి చేసే అక్కరమాని విజయనిర్మల వంటి విజ్ఞురాలు కావాలా..? వంచనలతో విశాఖలో విషపు సంస్కృతికి తెరతీస్తూ.. లిక్కర్ మాఫియాతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వెలగపూడి కావాలా..? ఓటర్లూ ఆలోచించుకోండి. -
టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి వీరంగం
సచివాలయంలో ముఖ్య కార్యదర్శిపై చిందులు సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యే వీరంగం సృష్టించారు. ఉన్నతాధికారిపై చిందులు వేశారు. నాకే అపాయింట్మెంట్ ఇవ్వరా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. అధికారి చాంబర్ వద్ద గ్లాసు పగులగొట్టారు. ఫైళ్లను విసిరికొట్టారు. సచివాలయంలోని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పేషీలో జరిగిన ఈ ఘటన ఆ పేషీ అధికారులనే కాదు ఇతర ఉద్యోగులు, సిబ్బందినీ, సచివాలయానికి పనిపై వచ్చినవారినీ విస్మయపరిచింది. వివరాల్లోకి వెళితే... తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సోమవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్‌ను కలిసేందుకు సచివాలయానికి వచ్చారు. అయితే వలవన్ అప్పుడు అధికారులతో సమావేశంలో ఉన్నారు. ఇళ్ల నిర్మాణానికి గాను 10 ఎకరాల స్థలం కేటాయింపు విషయమై చర్చించడానికి పేషీకి వచ్చిన వెలగపూడి సుమారు గంటసేపు అక్కడ వేచిచూశారు. ఎంతకీ అధికారి నుంచి పిలుపురాకపోవడంతో ఎమ్మెల్యే ఆవేశం కట్టలు తెంచుకుంది. ఎమ్మెల్యే ఆవేశం చూసి పేషీ సిబ్బంది భయకంపితులయ్యారు. తర్వాత ఎమ్మెల్యే తలుపులు తోసుకుని ఉన్నతాధికారి సమావేశం గదిలోకి వెళ్లి ఆయన్నుద్దేశించి ఆవేశంగా మాట్లాడారు. సంయమనంతో వ్యవహరించిన వలవన్.. ఎమ్మెల్యే వెలగపూడికి నచ్చజెప్పి, ఫైలుకు సంబంధించిన సమాధానం చెప్పి పంపించినట్టు తెలిసింది. -
గంటాతో రహస్య భేటీ
=అరగంటకు పైగా వెలగపూడి చర్చలు =మంతనాలపై సర్వత్రా ఆసక్తి విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి: మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో గురువారం ఉదయం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆయనను కలిశారు. సర్క్యూట్ హౌస్‌లో వీరిద్దరూ అరగంటకు పైగా మంతనాలు జరపడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తించింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేయకూడదని గంటా, ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. గత నెల 25న విశాఖలో జరిగిన గంటా కుమారై వివాహానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ ముఖ్య నేతలంతా హాజరు కావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. కానీ టీడీపీలో చేరిక విషయమై గంటా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు మాత్రం కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీలో అయ్యన్న పాత్రుడును వ్యతిరేకిస్తున్న వర్గం గంటాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిణామాల పరంపరలోనే టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు గురువారం మంత్రిని కలిశారు. తాజా రాజకీయ పరిణామాలు, తెలుగుదేశంలో ప్రవేశానికి సంబంధించిన అంశాలపైనే వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు అనధికారిక సమాచారం. ఈ భేటీ గురించి సాక్షి ప్రతినిధి ఎమ్మెల్యే వెలగపూడిని అడగ్గా తాను వేరే పని మీద సర్క్యూట్ హౌస్‌కు వెళ్లానని, అక్కడ మంత్రి ఉండడంతో మర్యాదపూర్వకంగా మాట్లాడానే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెప్పారు. ఈ భేటీ గురించి గంటా ముఖ్య మద్దతుదారులు మాట్లాడుతూ టీడీపీలో చేరే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, మీడియానే ముహూర్తాలు నిర్ణయించేస్తోందని వివరణ ఇచ్చారు.