గంటాతో రహస్య భేటీ
=అరగంటకు పైగా వెలగపూడి చర్చలు
=మంతనాలపై సర్వత్రా ఆసక్తి
విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి: మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో గురువారం ఉదయం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆయనను కలిశారు. సర్క్యూట్ హౌస్‌లో వీరిద్దరూ అరగంటకు పైగా మంతనాలు జరపడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తించింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేయకూడదని గంటా, ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
గత నెల 25న విశాఖలో జరిగిన గంటా కుమారై వివాహానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ ముఖ్య నేతలంతా హాజరు కావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. కానీ టీడీపీలో చేరిక విషయమై గంటా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు మాత్రం కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీలో అయ్యన్న పాత్రుడును వ్యతిరేకిస్తున్న వర్గం గంటాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిణామాల పరంపరలోనే టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు గురువారం మంత్రిని కలిశారు.
తాజా రాజకీయ పరిణామాలు, తెలుగుదేశంలో ప్రవేశానికి సంబంధించిన అంశాలపైనే వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు అనధికారిక సమాచారం. ఈ భేటీ గురించి సాక్షి ప్రతినిధి ఎమ్మెల్యే వెలగపూడిని అడగ్గా తాను వేరే పని మీద సర్క్యూట్ హౌస్‌కు వెళ్లానని, అక్కడ మంత్రి ఉండడంతో మర్యాదపూర్వకంగా మాట్లాడానే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెప్పారు. ఈ భేటీ గురించి గంటా ముఖ్య మద్దతుదారులు మాట్లాడుతూ టీడీపీలో చేరే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, మీడియానే ముహూర్తాలు నిర్ణయించేస్తోందని వివరణ ఇచ్చారు.