
సాక్షి, విశాఖపట్నం : వంగవీటి మోహనరంగ హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ అక్రమాలేమిటో విశాఖ ప్రజలకు తెలుసని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ నువ్వేంటి.. నీ స్థాయేంటి?.. నీ స్థాయికి విజయసాయిరెడ్డి ప్రమాణానికి రావాలా?’ అంటూ మండిపడ్డారు. రేపు(ఆదివారం) ఉదయం 11 గంటలకు సాయిబాబా ఆలయానికి వస్తానని, వెలగపూడికి దమ్ముంటే సాయిబాబా ఆలయానికి రావాలని సవాల్ విసిరారు. వెలగపూడి అక్రమాలపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ విజయసాయిరెడ్డిపై మీరు అక్రమ కేసులు పెట్టారని ఏనాడో నిరూపితమైంది. వెలగపూడి అక్రమాలు ప్రజలందరికీ తెలుసు. విశాఖ పారిపోయి వచ్చినప్పుడు నీ ఆస్తి ఎంత?. నీ ఆస్తుల వివరాలు చెప్పగలవా?. హత్య కేసులో ఉన్న వ్యక్తులు విశాఖలో రాజకీయాలు చేస్తున్నారు. ( ‘ఆయన.. నీటి విలువ తెలిసిన వ్యక్తి’ )
వాగు పోరంబోకు భూమిని అక్రమంగా రెగ్యులరైజ్ చేసేందుకు ప్రయత్నించలేదా?. 225 గజాల వాగు పోరంబోకు భూమిని వెలగపూడి ఆక్రమించాడు. టీడీపీ నేతల చెరలో ఉన్న 171 ఎకరాల ప్రభుత్వ భూమిని విడిపించగలిగాం. భూ కబ్జాదారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు కోర్టుకెళ్లారు.. పట్టణాల్లో ఉన్న పేదలకు కూడా సెంటు స్థలం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. విశాఖలో కూడా పేదలకు ఇళ్లు రాకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ జరుగుతోంద’’ని అన్నారు.