సాక్షి, విశాఖపట్నం: సవాళ్ల పర్వం ముగిసిపోయిందని తాము చేసిన ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యిందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. వెలగపూడికి ఇచ్చిన గడువు ముగియడంతో వెళ్లిపోయిన ఆయన ఆదివారం సాయిబాబా ఆలయం నుంచి వెళ్లిపోయారు. సాయిబాబా గుడిలో ప్రమాణానికి రావాలని అమర్నాథ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆధారాలతో సత్య ప్రమాణానికి అమర్నాథ్ సిద్ధమయ్యారు. కానీ ఆలయానికి టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ రాలేదు. వెలగపూడి కోసం గంట పాటు అమర్నాథ్, పార్టీ నేతలు వేచి చూశారు. వెలగపూడి రాకపోవడంతో ఎమ్మెల్యే అమర్నాథ్ వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరోపణలు వాస్తవం కాబట్టే వెలగపూడి మొహం చాటేశారని మండిపడ్డారు. సత్య ప్రమాణానికి గైర్హాజరైన వెలగపూడి తన తప్పులను ఒప్పుకున్నట్టే అన్నారు.
రిషికొండలో వెలగపూడి రామకృష్ణ భూమి ఆక్రమించారని దుయ్యబట్టారు. ఇప్పటికే వెలగపూడి అక్రమాలపై సాక్ష్యాలు బయట పెట్టామని అన్నారు. భూ ఆక్రమణలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇకపై టీడీపీ నాయకులకు సవాలు విసిరే అర్హత లేదని తాము సవాళ్లకు రావాలంటే చంద్రబాబు, లోకేష్ రావాలని అమర్నాథ్ అన్నారు. ఇప్పటికైనా ఆక్రమణదారులు తమ భూములు వెనక్కి ఇస్తే మంచిదని, త్వరలో సిట్ నివేదికలో టీడీపీ బండారం బయటపడుతుందన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ బిచ్చగాడని, ఇతరులకు ఆయన రాజకీయ భిక్ష పెట్టింది ఏంటనీ సూటిగా ప్రశ్నించారు. తన పేరిట అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తిస్తే స్టాంప్ పేపర్‌పై అనాధ శరణాలయానికి రాసిస్తానని అన్నారు.
ఆచూకీ లేని ఎమ్మెల్యే వెలగపూడి
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సవాల్‌కి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆచూకీ లేకుండా పోయారు. ఈస్ట్‌పాయింట్‌కాలనీలో గల ఈస్ట్ శిరిడీ సాయిబాబా ఆలయం వద్దకు శనివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, వెంకటరావు తదితరులు బాబా చిత్రపటంతో ర్యాలీగా చేరుకున్నారు.
అక్కడ వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అప్పటికే త్రీటౌన్ సీఐ కోరాడరామారావు పర్యవేక్షణలో ఎస్‌ఐ జె.ధర్మేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు గంటకు పైగా నిరీక్షించారు. ఈ సందర్భంగా విజయనిర్మల మీడియాతో మాట్లాడు తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కోసం ఆలయం వద్ద ఎదురుచూసినా రాలేదన్నారు. ఎమ్మెల్యేకు సంబంధించిన ఆక్రమణలు తొలగించడం హర్షణీయమన్నారు. వెలగపూడి ముమ్మాటికీ వంగవీటి రంగా హత్యకేసులో నిందితుడేనని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని విమర్శించే స్థాయి వెలగపూడికి లేదని పేర్కొన్నారు.
అక్కరమాని ప్రతి సవాల్‌తో పోలీసుల హై అలర్ట్
వెలగపూడి రామకృష్ణబాబుకు వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల ప్రతి సవాల్ విసరడంపై ద్వారకా జోన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డిని వెలగపూడి విమర్శిస్తూ గురువారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను భూ కబ్జాలు చేయలేదంటూ, దానికి నిదర్శనంగా ఈస్ట్‌పాయింట్ కాలనీ సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమంటూ వెలగపూడి పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను శుక్రవారం ఖండిస్తూ అక్కరమాని విజయనిర్మల ప్రతి సవాల్ విసిరారు.
దీంతో శనివారం ఈస్ట్‌పాయింట్ కాలనీ సాయిబాబా గుడి వద్ద, ఎంవీపీ సెక్టార్–4లోని వెలగపూడి కార్యాలయం వద్ద నాటకీయ పరిణా మాలు చోటు చేసుకున్నాయి. బాబా ఆలయం వద్దకు వెలగపూడి రాకపోవడంతో ఎంవీపీ కాలనీలోని ఆయన కార్యాలయానికి వెళ్లేందుకు అక్కరమానితోపాటు పార్టీ నాయకులు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎంవీపీ కాలనీలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేయడంతోపాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ద్వారకా ఏసీపీ ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి పర్యవేక్షణలో పోలీసులు సాయంత్రం వరకు వెలగపూడి కార్యాలయానికి, ఇల్లుకు భద్రత కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment