visakhapatnam international airport
-
ఎయిర్‌పోర్టులో ఎక్స్ట్రా పార్కింగ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి రానురాను ప్రయాణికుల తాకిడి అధికమవుతోంది. అందుకనుగుణంగా ఇప్పటికే ఈ ఎయిర్‌పోర్టు అవసరమైన అన్ని హంగులను సమకూర్చుకుంటోంది. వీటితో పాటు కార్ పార్కింగ్‌ను కూడా విస్తరించుకుంది. ఈ విమానాశ్రయంలో ప్రస్తుత పార్కింగ్‌లో 500 కార్లను నిలిపే సామర్థ్యం ఉంది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన పార్కింగ్‌లో అదనంగా మరో 200 కార్లను ఉంచేందుకు అవకాశం కలిగింది. రోజురోజుకూ ప్రయాణికుల రాకపోకలు పెరుగుతుండడంతో వాహనాల రద్దీ కూడా తీవ్రమవుతోంది. దీంతో ఎయిర్‌పోర్టుకు వచ్చే కార్లు, ఇతర వాహనాలను నిలపడానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు అదనపు పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి రావడంతో ఆ ఇబ్బంది నుంచి వాహనదార్లకు ఉపశమనం లభించిందని విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. తగ్గిన సర్వీసులు.. పెరిగిన ప్రయాణికులు మరోవైపు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ (డొమెస్టిక్) ప్రయాణికుల రాకపోకల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ఇతర ఎయిర్‌పోర్టులకంటే ఈ విమానాశ్రయం నుంచే ఎక్కువ మంది వెళ్లి వస్తున్నారు. 2022–23లో విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కడప, తిరుపతి, కర్నూలు విమానాశ్రయాల నుంచి 48,25,904 మంది డొమెస్టిక్ పాసింజర్లు రాకపోకలు సాగించగా, వీరిలో ఒక్క విశాఖ ఎయిర్‌పోర్టు నుంచే 24,35,320 మంది ఉన్నారు. ఇక గత ఏడాది ఆగస్టుతో పోల్చితే ఈ ఆగస్టులో విమాన సర్వీసులు తగ్గినప్పటికీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఆగస్టులో ఈ ఎయిర్‌పోర్టు నుంచి 1,770 విమానాల ద్వారా 2,03,795 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఈ ఆగస్టులో 1,722 విమాన సర్వీసుల ద్వారా 2,41,917 మంది ప్రయాణించారు. అంటే 48 విమాన సర్వీసులు తగ్గినా, 38,122 మంది ప్రయాణికులు పెరిగారన్న మాట! ఆక్యుపెన్సీలో హైదరాబాద్ టాప్ ఈ ఏడాది ఆగస్టులో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ప్రయాణికుల ఆక్యుపెన్సీ హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా సెక్టార్ల విమాన సర్వీసులకు ఎక్కువగా ఉంది. విశాఖపట్నం–హైదరాబాద్‌ల మధ్య తిరిగే విమానాల్లో సీటింగ్ కెపాసిటీ 44,752కి గాను 42,038 మంది (93.94 శాతం) ప్రయాణించారు. విశాఖ–ఢిల్లీల మధ్య సర్వీసులకు 21,642 మంది సీటింగ్ సామర్థ్యం ఉండగా 19,542 మంది (90.30 శాతం) రాకపోకలు సాగించారు. ఆగస్టులో ఈ ఎయిర్‌పోర్టు నుంచి సెక్టార్ల వారీ ప్రయాణికుల ఆక్యుపెన్సీ ఎక్కడకు? సామర్థ్యం ప్రయాణికులు ఆక్యుపెన్సీ (శాతం) హైదరాబాద్ 44,752 42,038 93.94 ఢిల్లీ 21,642 19,542 90.30 బెంగళూరు 26,274 23,028 87.65 ముంబై 12,462 10,800 86.66 చైన్నె 14,400 11,587 80.47 కోల్‌కతా 3,600 3,268 90.78 -
విశాఖ విమానాశ్రయానికి పెరుగుతున్న రద్దీ
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి పెరుగుతోంది. ప్రయాణికుల రద్దీతో కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితికి చేరుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభమైన ఏప్రిల్ నుంచి జూలై వరకు ఈ ఎయిర్‌పోర్టు నుంచి మొత్తం 10,37,710 మంది ప్రయాణికులు (దేశీయ, అంతర్జాతీయ) రాకపోకలు సాగించారు. గత సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య నాలుగు నెలల్లో 7,75,100 మంది ప్రయాణించారు. వీరిలో దేశీయ ప్రయాణికులు 7,54,966 మంది, విదేశీ ప్రయాణికులు 20,084 మంది ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు చూస్తే దేశీయ విమానాల్లో ప్రయాణించిన వారు 10,13,518కి, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికులు 24,192కి పెరిగారు. అలాగే దేశీయ (డొమెస్టిక్) విమానాల రాకపోకలు కూడా 7,045 నుంచి 7,184కి పెరిగాయి. అయితే రాకపోకలు సాగించిన అంతర్జాతీయ విమాన సర్వీసులు 170 నుంచి 164కి స్వల్పంగా తగ్గాయి. కానీ ఈ నాలుగు నెలల్లో అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్యలో మాత్రం పెరుగుదల కనిపించింది. కోవిడ్‌కు ముందు ఈ విమానాశ్రయం నుంచి నెలకు సగటున 2.8 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. కోవిడ్ తర్వాత రెండేళ్ల పాటు విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. నెలకు 1.5 లక్షల మంది ప్రయాణించడం గగనమయ్యేది. మళ్లీ కొన్ని నెలల నుంచి ఈ ప్రయాణికుల సంఖ్య పుంజుకుంటోంది. ఇప్పుడది నెలకు 2.6 లక్షలకు పెరిగింది. మరికొద్ది నెలల్లో ఈ సంఖ్య కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితికి చేరుకుంటుందని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ ఎయిర్‌పోర్టు ఏడాదికి 3.5 మిలియన్ల ప్రయాణికులు రాకపోకల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం 2.5 మిలియన్ల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మున్ముందు ఈ ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సౌకర్యాలను పెంచుతున్నామని తెలిపారు. కార్గో రవాణాలోనూ.. మరోవైపు కార్గో రవాణాలోనూ ఈ విమానాశ్రయం ఊపందుకుంటోంది. కోవిడ్ ప్రభావంతో రెండేళ్లకు పైగా కార్గో రవాణా సన్నగిల్లింది. కానీ కొన్నాళ్లుగా ఇది మళ్లీ పుంజుకుంటోంది. కోవిడ్ సమయంలో రోజుకు ఏడెనిమిది టన్నుల సరకు రవాణా కష్టతరమయ్యేది. ఇప్పుడు రోజుకు 12 నుంచి 15 టన్నుల వరకు కార్గో రవాణా జరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో ఈ ఎయిర్‌పోర్టు నుంచి 1,432 టన్నుల సరకు రవాణా జరిగింది. ఈ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రొయ్యలు, రొయ్య పిల్లలతో పాటు ఫార్మా ఉత్పత్తులు, అత్యవసర మందులు, దుస్తులు, ఆటోమొబైల్స్, నావికాదళానికి సంబంధించిన వస్తువులు, సరకులు, పరికరాలతో పాటు సాధారణ సరకు రవాణా కూడా జరుగుతోంది. వీటిలో రొయ్యలు, ఫార్మా ఉత్పత్తులు, దుస్తులు ఎక్కువగా రవాణా అవుతుంటాయి. -
విశాఖపట్నం ఎయిర్‌పోర్టు.. ప్రయాణికుల రద్దీతో కళకళ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి అధికమవుతోంది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య ఊపందుకుంటోంది. కోవిడ్ ప్రభావం నుంచి కోలుకుని మళ్లీ పూర్వపు స్థితికి చేరుకుంటోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈనెల 17న ఈ విమానాశ్రయం తొమ్మిది వేల మంది ప్రయాణికుల మైలు రాయిని అధిగమించింది. 2020 మార్చి నుంచి కోవిడ్ తొలి, మలి విడతలో తీవ్ర ప్రతాపం చూపింది. దీంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కోవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత కూడా మునుపటి స్థాయిలో ప్రయాణికులు రాకపోకలు చేయడం లేదు. అందుకనుగుణంగా విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసులను కుదించుకున్నాయి. కొన్ని నెలల నుంచి కోవిడ్ ప్రభావం తగ్గి, సాధారణ స్థాయికి వచ్చింది. దీంతో దాదాపు రెండున్నరేళ్ల అనంతరం ఈ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీతో కళకళలాడుతోంది. నవంబర్ వరకు వీరి సంఖ్య రోజుకు 6,000–7,000 వరకు ఉండగా డిసెంబరు నుంచి అది మరింత పెరుగుతూ వస్తోంది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే చాలా విమానాలు కొన్నాళ్ల నుంచి నూరు శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇలా ఈనెల ఆరంభం నుంచి రోజుకు 7000–9000 మంది ప్రయాణికుల సంఖ్య నమోదవుతోంది. శనివారం 9,183 మంది ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించారు. వీరిలో దేశీయ ప్రయాణికులు 8,838 మంది, అంతర్జాతీయ ప్రయాణికులు 345 మంది ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఇదే సమయానికి ఒకే రోజు గరిష్టంగా ఎనిమిది వేల మంది ప్రయాణించారు. ఈ విమానాశ్రయం నుంచి సగటున రోజుకు 56 విమాన సర్వీసులు (రానుపోను) రాకపోకలు సాగిస్తున్నాయి. కోవిడ్ రెండో దశ తర్వాత ఈ విమానాశ్రయం నుంచి గత డిసెంబర్ నెల మొత్తమ్మీద 2.5 లక్షల మంది వెళ్లి వచ్చారు. అయితే 2022 జనవరి నుంచి ఒమిక్రాన్ బెడదతో మార్చి వరకు విమాన ప్రయాణాలు నెలకు సగటున ఆరేడు వేలతో రెండు లక్షలలోపే నమోదయ్యాయి. కోవిడ్‌కు ముందు ఇలా.. కోవిడ్‌కు ముందు 2018–19లో ఈ విమానాశ్రయం నుంచి 28 లక్షల మంది, 2019–20లో 27 లక్షల మంది, 2020–21లో 16 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు జరిపారు. ఈ ఏడాది వీరి సంఖ్య 23 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల తాకిడి కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితికి వస్తుందని భావిస్తున్నట్టు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ కె.శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. దేశ, విదేశాల నుంచి విశాఖకు ఈ శీతాకాలం సీజనులో పర్యాటకులు అధికంగా వస్తుండడం, కోవిడ్ తీవ్రత తగ్గడం విమాన ప్రయాణికుల తాకిడి పెరగడానికి దోహదపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డీఎస్ వర్మ ‘సాక్షి’కి తెలిపారు. (క్లిక్ చేయండి: సాధారణ చార్జీలతోనే సంక్రాంతి బస్సులు) -
Vizag Airport: రెక్కలు విచ్చుకున్న విశాఖ విహంగం
ఏపీలో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన విశాఖ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు అంతర్జాతీయ విమానాశ్రయంగా పౌర విమానాలు రాకపోకలు సాగిస్తుండగా.. మరోవైపు నేవల్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగానూ ఎయిర్‌పోర్టు సేవలందిస్తోంది. సేవలు విస్తరించేందుకు సరికొత్త ఆలోచనలు అమలు చేస్తున్న ఎయిర్‌పోర్టు.. మరో ఆరు పార్కింగ్ బేస్‌ల నిర్మాణం పూర్తి చేసింది. త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇండియన్ నేవీ విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగాలో పౌర విమానయాన సేవలందిస్తోంది. మొత్తం 349.39 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం విస్తరించి ఉంది. దేశంలో ఎక్కడా లేని ఒక ప్రత్యేకమైన గుర్తింపు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉంది. సాధారణంగా దాదాపు ప్రతి విమానాశ్రయంలోనూ రన్‌వేకు రెండు వైపుల నుంచి టేకాఫ్, ల్యాండింగ్స్ జరుగుతుంటాయి. కానీ విశాఖలో మాత్రం విమానాశ్రయానికి ఓవైపు పెద్ద కొండ ఉండటం వల్ల ఒకవైపు నుంచి మాత్రమే రాకపోకలు సాగుతున్నాయి. 1981లో రోజుకు ఒక విమానం ద్వారా ప్రారంభమైన పౌర సేవలు ప్రస్తుతం సుమారు 70 వరకు చేరుకున్నాయి. అయితే కోవిడ్ కారణంగా కేవలం 14 సర్వీసులు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. భవిష్యత్తులో రాకపోకలు పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టారు. ఏక కాలంలో 16 విమానాల రాకపోకలు బ్రిటిష్ కాలంలో 4 పార్కింగ్ బేస్ ఉండేవి. తరువాత మరో 6 పార్కింగ్ బేస్‌లు నిర్మించారు. గతంలో ఉండే రన్‌వే వినియోగించే అవకాశం లేదు. ఇప్పుడు ఒకే రన్‌వే ఉంది. దాన్ని నేవీతో సంయుక్తంగా వినియోగిస్తున్నారు. రన్‌వేపై వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదు. నేవీ టవర్ కంట్రోల్ రూమ్‌తో రన్‌వేను అనుసంధానం చేశారు. ఎవరైనా రన్‌వే పైకి వెళ్లాలంటే రక్షణ దళ అనుమతి తప్పనిసరి. యాప్రాన్, హ్యాంగర్స్, టెర్మినల్‌కు రన్‌వేలో ఉన్న విమానంతో అనుసంధానమయ్యేలా ఉండే ట్యాక్సీ వేలు కూడా నేవీ భాగంలోనే ఉన్నాయి. అందుకే ప్రత్యేకంగా మరో కొత్త ట్యాక్సీ ట్రాక్ నిర్మించారు. దీనికితోడు తాజాగా మరో ఆరు పార్కింగ్ బేస్‌ల నిర్మాణం కూడా పూర్తయింది. ఇవి త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇవి కూడా అందుబాటులోకి వస్తే మొత్తం 16 విమానాలు ఏక కాలంలో రాకపోకలు సాగించే అవకాశాలున్నాయి. పరిమితి పెంచేందుకు ప్రయత్నాలు అంతర్జాతీయ స్థాయి సదస్సులకు వేదికగా విశాఖ నిలుస్తోంది. దీనికితోడు రాష్ట్ర కార్యనిర్వాహక రాజ«ధానిగా కొత్త రూపుదాల్చనుంది. దీనికితోడు కొత్త రైల్వే జోన్, పోర్టులు, జలరవాణా, జాతీయ రహదారులు ఇలా విశిష్ట సామర్థ్యమున్న విశాఖకు కాలానుగుణంగా కనెక్టివిటీ పెరగాల్సి ఉంది. అయితే నేవీ ఇచ్చిన స్లాట్స్ ప్రకారం 85 విమానాల కంటే ఎక్కువ నడపలేని పరిస్థితి ఉంది. ఈ స్లాట్ పెరగాలంటే.. లిమిటేషన్ పెంచాలి. అది పెరగాలంటే రన్‌వే హ్యాండ్లింగ్ కెపాసిటీ పెంచాలి, ఆక్యుపేషన్ టైమ్ తగ్గించాలి. రన్‌వే ఎఫిషియన్సీ పెంచాలి. ఇది పెరిగితే ప్రస్తుతం ఉన్న గంటకు 10 రాకపోకల స్లాట్‌లో పాసింజర్ విమానాల సామర్థ్యం 16కి పెరుగుతుంది. రన్‌వే హ్యాండ్లింగ్ పెరిగి, ఆక్యుపేషన్సీ తగ్గి 50 శాతం పెరిగితే ప్రస్తుతం ఉన్న 85 విమానాల రాకపోకల కెపాసిటీ 123కు చేరుకుంటుంది. దీనివల్ల ఇతర ప్రాంతాలకూ కనెక్టివిటీ ఫ్లైట్స్ పెరుగుతుంది. అప్పుడు ఇతర నగరాలకు రాకపోకలు విస్తరించవచ్చు. డిమాండ్ ఉన్న సమయాల్లో మరిన్ని ఫ్లైట్స్‌కు స్లాట్స్ కేటాయించవచ్చు. ట్యాక్సీ ట్రాక్‌ల పెంచినప్పుడు ల్యాండింగ్ అయ్యే విమానాలు.. వెంట వెంటనే వచ్చి వెళ్లిపోయే అవకాశముంది. దీని వల్ల రన్‌వేపై ఆక్యుపెన్సీ టైమ్ తగ్గుతుంది. దీనివల్ల స్లాట్ సామర్థ్యం మరింత పెరిగి పాసింజర్ ఫ్లైట్స్ పెరగవచ్చు. కొత్త ట్యాక్సీట్రాక్ నిర్మాణం పూర్తి కావడంతో దీనికి మార్గం సుగమమైంది. సమగ్రాభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాం.. విశాఖ విమానాశ్రయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. దీనికి సంబంధించిన ప్లాన్స్ సిద్ధమయ్యాయి. కీలక అడుగులకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. వాణిజ్య కేంద్రంగా విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో టైర్–2, టైర్–3 టైర్–4 దేశీయ ఎయిర్‌పోర్టులకు కనెక్టివిటీ కోసం ఫ్లైట్స్ నడిపేలా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కోవిడ్ భయం పూర్తిగా తొలగిపోయాక.. అత్యధిక ఫ్లైట్స్ నడిపేందుకు సన్నద్ధమవుతాం. దీనికి తోడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్తో పాటు కార్గో సేవలు విస్తరించేందుకు చెయ్యాల్సిన అభివృద్ధిపై ప్రస్తుతం దృష్టి సారించాం. కొత్తగా నిర్మించిన పార్కింగ్ బేస్‌లు, ట్యాక్సీ ట్రాక్లని త్వరలోనే ప్రారంభిస్తాం. ఎయిర్లెన్స్తో పాటు నేవీ నుంచ తేదీ ఖరారు చేసిన తర్వాత వీటిని అందుబాటులోకి తీసుకొస్తాం. – రాజాకిశోర్, విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ -
ఎయిర్పోర్ట్ 24/7కు లైన్‌క్లియర్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆంక్షల బెడద తొలగిపోయింది. ఈ ఎయిర్‌పోర్టు ఇక 24 గంటలూ పౌర విమాన సర్వీసులు నడపడానికి రక్షణ మంత్రిత్వశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రక్షణశాఖ అధీనంలో ఉన్న ఈ ఎయిర్‌పోర్టులోకి పౌర విమానాల రాకపోకలపై కొన్నాళ్ల క్రితం నేవీ ఆంక్షలు విధించింది. నేవీ యుద్ధ విమానాల రాకపోకలు, విన్యాసాలు, సిబ్బందికి శిక్షణ వంటి మిలట్రీ ఆపరేషన్ల కోసం నవంబర్ ఒకటో తేదీ నుంచి రోజూ ఉదయం 9.30 నుంచి 12.30, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ఐదు గంటల పాటు పౌర విమానాలపై నిషేధం విధించింది. మంగళ, గురువారాల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కూడా పౌర విమానాలు రాకపోకలు సాగించరాదని ఆంక్షలు పెట్టింది. దీంతో ఈ ఆంక్షల వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని కొన్ని పౌర విమానయాన సంస్థలు విశాఖకు తమ విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్టు, మరికొన్ని సంస్థలు రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాయి. రక్షణ శాఖ ఆంక్షల నిర్ణయంపై ప్రయాణికుల నుంచే కాక వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, ఐటీ వర్గాలు, ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్(ఏపీఏటీఏ) నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. అంతేకాదు.. ఆంక్షలను సడలించకపోతే ఆందోళనకు సైతం సమాయత్తమయ్యారు. పరిస్థితిని గమనించిన రక్షణశాఖ అధికారులు తొలుత ఐదు గంటల నిషేధాన్ని మూడు గంటలకు కుదిస్తామని దిగివచ్చినా అంగీకరించలేదు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపై నేవీ ఆంక్షల ప్రభావం ఎలా చూపుతుందో ఏపీఏటీఏ నేతృత్వంలో రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రాలు అందజేశారు. రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఎయిర్‌పోర్టుపై నేవీ ఆంక్షల ఎత్తివేయాలని రక్షణమంత్రిని కోరారు. అనంతరం జులై 14న రక్షణశాఖ పౌర విమానాల సమయాలపై విధించిన ఆంక్షల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖ విమానాశ్రయంలో ఎలాంటి అంతరాయాలు లేకుండా 24 గంటలూ పౌర విమానాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ట్విటర్లో వెల్లడించారు. దీంతో విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంపై పౌర విమానాల రాకపోకలపై నిషేధం అధికారికంగా తొలగినట్టయింది. కొత్త సర్వీసులకు అవకాశం విశాఖ విమానాశ్రయం పౌర విమానాల వేళలపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్టు గతంలో నేవీ ప్రకటన నేపథ్యంలో ఈ ఎయిర్‌పోర్టుకు కొత్తగా ఒక అంతర్జాతీయ (థాయ్‌లాండ్‌కు), 8 డొమెస్టిక్ విమాన సర్వీసులు నడపడానికి ముందుకొచ్చాయి. వీటి షెడ్యూళ్లు వచ్చే నెలలో వెలువడనున్నాయి. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నుంచి రోజూ 70 పౌర విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ విమానాశ్రయం నుంచి విమానాలు దేశ, విదేశాలకు రాకపోకలు జరుగుతున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు రక్షణ మంత్రి సాక్షాత్తూ ప్రకటించడంతో విమానయాన సంస్థల్లో నమ్మకాన్ని పెంచినట్టు అయిందని ఏపీఏటీఏ ఉపాధ్యక్షుడు డీఎస్ వర్మ, విశాఖ డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఓ.నరేష్‌కుమార్‌లు ‘సాక్షి’తో చెప్పారు. ఈ విమానాశ్రయానికి మరిన్ని కొత్త సర్వీసుల రాకతో దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు కనెక్టివిటీ మరింత పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
విశాఖ విమానాశ్రయం.. ఇక 24 గంటల సేవలు
గోపాలపట్నం (విశాఖపశ్చిమ): విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ గ్రేడ్ హోదా సాధించటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరగనున్నాయి. ఇంతవరకు రాత్రి 11 గంటలతో సర్వీసులు నిలిపివేసే పరిస్థితి ఉండగా... ఇకపై 24 గంటలూ సర్వీసులు నడపినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడి విమానాశ్రయానికి ఇప్పటికే దుబాయ్, సింగపూర్ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా కొలంబోకు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ సంస్ధ జులై 8 నుంచి సర్వీసులు అందుబాటులోకి తేబోతోంది. థాయ్ ఎయిర్‌లైన్స్ సర్వీసు వచ్చే అక్టోబరు 29 నుంచి బాంకాక్కు ప్రారంభం కాబోతోంది. ఈ విమానం రాత్రి 12.30కి బాంకాక్ నుంచి విశాఖకు వచ్చి తిరిగి 1.30కి బ్యాంకాక్‌కు బయలుదేరుతుంది. ఇలా రాత్రి 12 తర్వాత సర్వీసులకు ఇప్పటివరకు అత్యవసరమయితే గాని అనుమతించడంలేదు. రాత్రి వేళ సర్వీసులకు చర్యలు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో థాయ్ ఎయిర్‌లైన్స్ విమానం అర్ధరాత్రి వేళల్లో వచ్చి వెళ్లడానికి ఎయిర్‌పోర్టు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం ఎయిర్‌పోర్టు డైరెక్టరు ప్రకాష్ రెడ్డి సమీక్షించారు. సీఐఎస్ఎఫ్ భద్రతా బలగాల సంఖ్య పెంచడానికి తాను ఇప్పటికే కేంద్రానికి నివేదించానని, దీనికి ఆమోదం వచ్చిందని ప్రకాష్‌రెడ్డి తెలిపారు. -
'విశాఖను ఆర్థిక రాజధాని చేస్తాం'
విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం గంటా శ్రీనివాసరావు హైదరాబాద్‌లో మాట్లాడుతూ... విశాఖపట్నంలో కొత్తగా ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. అందుకోసం స్థలసేకరణ చేపట్టాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. విశాఖపట్నంలో మెట్రో రైలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకు టెండర్లు కూడా పిలిచామని చెప్పారు. అలాగే విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని.... సినీ నిర్మాతలతో సంప్రదిస్తున్నామని చెప్పారు. అలాగే జిల్లాలోని అరకు, భీమిలీ ప్రాంతాలలో షూటింగ్ స్పాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు వివరించారు. గంగవరం పోర్టును నిర్మిస్తామని...దుగ్గరాజుపట్నంలో పోర్టు ప్రతిపాదనపై పునరాలోచిస్తామని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.