సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి రానురాను ప్రయాణికుల తాకిడి అధికమవుతోంది. అందుకనుగుణంగా ఇప్పటికే ఈ ఎయిర్‌పోర్టు అవసరమైన అన్ని హంగులను సమకూర్చుకుంటోంది. వీటితో పాటు కార్ పార్కింగ్‌ను కూడా విస్తరించుకుంది. ఈ విమానాశ్రయంలో ప్రస్తుత పార్కింగ్‌లో 500 కార్లను నిలిపే సామర్థ్యం ఉంది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన పార్కింగ్‌లో అదనంగా మరో 200 కార్లను ఉంచేందుకు అవకాశం కలిగింది.
రోజురోజుకూ ప్రయాణికుల రాకపోకలు పెరుగుతుండడంతో వాహనాల రద్దీ కూడా తీవ్రమవుతోంది. దీంతో ఎయిర్‌పోర్టుకు వచ్చే కార్లు, ఇతర వాహనాలను నిలపడానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు అదనపు పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి రావడంతో ఆ ఇబ్బంది నుంచి వాహనదార్లకు ఉపశమనం లభించిందని విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు.
తగ్గిన సర్వీసులు.. పెరిగిన ప్రయాణికులు
మరోవైపు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ (డొమెస్టిక్) ప్రయాణికుల రాకపోకల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ఇతర ఎయిర్‌పోర్టులకంటే ఈ విమానాశ్రయం నుంచే ఎక్కువ మంది వెళ్లి వస్తున్నారు. 2022–23లో విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కడప, తిరుపతి, కర్నూలు విమానాశ్రయాల నుంచి 48,25,904 మంది డొమెస్టిక్ పాసింజర్లు రాకపోకలు సాగించగా, వీరిలో ఒక్క విశాఖ ఎయిర్‌పోర్టు నుంచే 24,35,320 మంది ఉన్నారు. ఇక గత ఏడాది ఆగస్టుతో పోల్చితే ఈ ఆగస్టులో విమాన సర్వీసులు తగ్గినప్పటికీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఆగస్టులో ఈ ఎయిర్‌పోర్టు నుంచి 1,770 విమానాల ద్వారా 2,03,795 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఈ ఆగస్టులో 1,722 విమాన సర్వీసుల ద్వారా 2,41,917 మంది ప్రయాణించారు. అంటే 48 విమాన సర్వీసులు తగ్గినా, 38,122 మంది ప్రయాణికులు పెరిగారన్న మాట!
ఆక్యుపెన్సీలో హైదరాబాద్ టాప్
ఈ ఏడాది ఆగస్టులో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ప్రయాణికుల ఆక్యుపెన్సీ హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా సెక్టార్ల విమాన సర్వీసులకు ఎక్కువగా ఉంది. విశాఖపట్నం–హైదరాబాద్‌ల మధ్య తిరిగే విమానాల్లో సీటింగ్ కెపాసిటీ 44,752కి గాను 42,038 మంది (93.94 శాతం) ప్రయాణించారు. విశాఖ–ఢిల్లీల మధ్య సర్వీసులకు 21,642 మంది సీటింగ్ సామర్థ్యం ఉండగా 19,542 మంది (90.30 శాతం) రాకపోకలు సాగించారు.
ఆగస్టులో ఈ ఎయిర్‌పోర్టు నుంచి సెక్టార్ల వారీ ప్రయాణికుల ఆక్యుపెన్సీ
ఎక్కడకు? సామర్థ్యం ప్రయాణికులు ఆక్యుపెన్సీ
(శాతం)
హైదరాబాద్ 44,752 42,038 93.94
ఢిల్లీ 21,642 19,542 90.30
బెంగళూరు 26,274 23,028 87.65
ముంబై 12,462 10,800 86.66
చైన్నె 14,400 11,587 80.47
కోల్‌కతా 3,600 3,268 90.78
Comments
Please login to add a commentAdd a comment