ఆషామాషీ కాదు
సాక్షి, విశాఖపట్నం : వడ్డించేవాడు మనోడైతే మర్యాదలకు లోటుండదు. అధికారంలో మనోడుంటే అధికారులనుంచి గొడవుండదు. నిబంధనలు అతిక్రమించవచ్చు.. అక్రమ కట్టడాలు కట్టేయవచ్చు.. గాజువాకలో ఓ మాజీ కౌన్సిలర్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరి చేపట్టిన ఒక వాణిజ్య సముదాయ నిర్మాణం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. నిబంధనలు అతిక్రమించినా, సెట్ బ్యాక్‌లు లేకపోయినా.. నిర్మాణానికి అసలు అనుమతే లేకపోయినా ఐదంతస్తుల భవన నిర్మాణం ఆగమేఘాల మీద పూర్తయిపోతోంది.
ఐదో అంతస్తు నిర్మాణానికి ఏర్పాట్లు
పాతగాజువాకలోని పంతులుగారి మేడ సమీపంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరి తన కుమారుల పేరుతో 250 చదరపు గజాల స్థలంలో ఐదేళ్ల క్రితం నిర్మాణం చేపట్టగా.. స్థల వివాదంతో మధ్యలో నిలిచిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఆమె తన అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. తన సోదరుడు ఎమ్మెల్యే కావడంతో అటు జీవీఎంసీ అధికారులను, ఇటు టౌన్‌ప్లానింగ్ అధికారులను తన భవనం వైపు రాకుండా అడ్డుకుంటున్నారు. అనుమతులు లేకుండానే ఇప్పటివరకు నాలుగు అంతస్తుల నిర్మాణాన్ని పూర్తి చేసి ఐదో అంతస్తు నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు.
నిబంధనల ఉల్లంఘన ఇలా..
ఈ స్థలం జాతీయ రహదారిపై ఉండటంతో నిబంధనల ప్రకారం ఐదు అంతస్తుల నిర్మాణం సాధ్యం కాదని టౌన్‌ప్లానింగ్ సిబ్బంది చెబుతున్నారు. హైవే నుంచి 90 అడుగుల వరకు రోడ్డును చూపించి మిగిలిన స్థలంలో నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన 250 చదరపు గజాల స్థలంలో సెట్‌బ్యాక్‌లను వదిలిపెడితే 130 చదరపు గజాల స్థలంలోనే నిర్మాణం చేపట్టాలి. హైవే పక్కన ఈ కొద్దిపాటి స్థలంలో ఐదంతస్తుల నిర్మాణం సాధ్యం కాని నేపథ్యంలో నిర్మాణదారు అధికారులను ఏమరుపర్చింది. మొత్తం 700 గజాల స్థలం ఉన్నట్టుగా మూడు అంతస్తుల నిర్మాణానికి నామమాత్రపు రుసుం చెల్లించి దరఖాస్తు చేసింది. స్థలాన్ని పరిశీలించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆ దరఖాస్తును తిరస్కరించారు. అయినప్పటికీ ఆమె ఆ దరఖాస్తు నంబరును చూపించి 250 చదరపు గజాల స్థలంలో ఇప్పటివరకు నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించింది. తాజాగా ఐదో అంతస్తు నిర్మాణం కోసం డెకింగ్ వేశారు. నాలుగు అంతస్తుల నిర్మాణం వరకు పట్టించుకోని జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఐదో అంతస్తు నిర్మాణాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నించారు. ఐదో అంతస్తు డెకింగ్‌ను ఇప్పటివరకు మూడుసార్లు కూలదోశారు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. తన సోదరుడి పలుకుబడిని టౌన్‌ప్లానింగ్ అధికారుల వద్ద వాడుకొని వారిని రాకుండా అడ్డుకుంటోందని చెబుతున్నారు. వాస్తవానికి జాతీయ రహదారి పక్కన ఎటువంటి అనుమతులు లేకుండా ఇంత పెద్ద భవనం నిర్మించడం సాధ్యం కాదు. ఒకవేళ ప్లాన్ అనుమతులు ఉన్నా వారు దరఖాస్తు చేసినదాని ప్రకారం మూడు అంతస్తులను మాత్రమే నిర్మించాల్సి ఉంది. ఇందులో ఒక్క నిబంధనను కూడా వారు పాటించలేదు. ఈ విషయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలు మీరితే చర్యలు తప్పవు
ఆ భవనం విషయం నాకు తెలియదు. ఏం జరుగుతుందో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌ను, వార్డు టౌన్‌ప్లానింగ్ సెక్రటరీని కనుక్కుంటాను. నిబంధనలను అతిక్రమిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అనధికార నిర్మాణాన్ని అనుమతించే ప్రసక్తే లేదు.
– వెంకటరావు, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ, గాజువాక
ఆమె ఎమ్మెల్యే సోదరి
అనుమతులు లేకుండా దర్జాగా
కమర్షియల్ భవన నిర్మాణం
నిబంధనలకు పాతరేసి చకచకా పనులు
ఐదేళ్ల క్రితం ఆగిపోయిన నిర్మాణాన్ని
పూర్తి చేస్తున్న మాజీ కౌన్సిలర్
ఎమ్మెల్యే పల్లా సోదరి కావడంతో
చేతులెత్తేసిన టౌన్‌ప్లానింగ్ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment