మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
గోపాలపట్నం : మనస్తాపంతో యువకుడు మృతి చెందిన ఘటన గోపాలపట్నం ఇందిరానగర్‌లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు..జీవీఎంసీ 92వ వార్డు ఇందిరానగర్‌కు చెందిన సోమేష్, నాగరాజు స్నేహితులు. సోమేష్‌కు సొంత ఆటో ఉంది. అప్పుడప్పుడు నాగరాజు ఆప్టింగ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. గత ఏడాది సంక్రాంతి సమయంలో సోమేష్‌కు చెందిన పర్సు ఆటోలో పడిపోయింది. సోమేష్‌ను ఇంటి వద్ద దించి వేరే బేరం ఉండడంతో నాగరాజు ఆటో తీసుకుని వెళ్లాడు. పర్సు పోయిన విషయాన్ని నాగరాజుకు చెప్పగా..తనకు తెలియదని బదులిచ్చాడు. సోమేష్ కూడా పోలీసులు ఫిర్యాదు చేయలేదు. ఇదిలావుండగా వీరిద్దరి స్నేహితుడు రౌతు ఆనంద్‌కు మూడు రోజుల క్రితం సోమేష్ పర్సు దొరికింది. అందులో గుర్తింపు కార్డులుండడంతో నాగరాజు ద్వారా సోమేష్‌కు అందజేశాడు. అయితే పర్సులో రూ.25వేలు ఉండాలని, ఆ డబ్బులివ్వాలంటూ నాగరాజు, ఆనంద్‌తో గొడవకు దిగాడు. డబ్బులు విషయం మాకు తెలియదని చెప్పినా వినకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ పేరుతో నాగరాజును, ఆనంద్‌ను స్టేషన్‌కు పిలిపించారు. ఇద్దరూ చెరో రూ.10 వేలు చొప్పున ఇచ్చి కేసు రాజీ చేసుకోవాలని పోలీసులు సూచించారని బంధువులు ఆరోపించారు. ఆదివారం ఉదయం స్టేషన్‌కు పిలిచి మధ్యాహ్నం వరకు ఆనంద్‌ను, నాగరాజును ఉంచేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆనంద్ ఆదివారం మధ్యాహ్నం ఇంటికి చేరుకుని ఊరేసుకుని మృతి చెందాడు. చేయని తప్పునకు బాధ్యుడ్ని చేయడంతో తన కుమారుడ్ని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సంఘటన స్థలానికి గోపాలపట్నం సీఐ గొలగాని అప్పారావు, ఎస్‌ఐ అప్పలనాయుడు చేరుకుని బాధితుల నుంచి సమాచారాన్ని సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ అప్పారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment