పరీక్ష
కఠిన
గ్రూప్–2 అభ్యర్థులతో ఆటలాడుకున్న కూటమి ప్రభుత్వం పరీక్ష వాయిదా వేస్తామంటూ ఆఖర్లో చేతులెత్తేసిన వైనం చంద్రబాబు సర్కారుకి బలైన నిరుద్యోగ అభ్యర్థులు మొదటి పేపర్‌కు 85.14 శాతం, రెండో పేపర్‌కు 84.95 శాతం హాజరు
సాక్షి, విశాఖపట్నం : ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని గందరగోళం. చంద్రబాబు సర్కారు బాధ్యతారాహిత్యంతో చివరి వరకు అభ్యర్థుల్లో ఆందోళన. చివరికి పరీక్ష కేంద్రంలోనూ తీవ్ర ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. రోస్టర్ విధానంపై గత కొంతకాలంగా గ్రూప్–2 అభ్యర్థులు పోరాటాలు చేస్తున్నారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గ్రూప్–2 అభ్యర్థులకు న్యాయం చేస్తానంటూ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు పరీక్ష వాయిదా వెయ్యాలంటూ ఏపీపీఎస్సీకి లేఖ రాశారు. దీంతో పరీక్ష ఆగిపోతుందని అభ్యర్థులు భావించారు. పరీక్ష వాయిదా వెయ్యలేమంటూ ఏపీపీఎస్సీ చెప్పడంతో అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యారు. పరీక్షకు 8 గంటల ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్పి నిరుద్యోగులతో ఆటలాడుకుంది. చివరికి పరీక్షకు వెళ్లాలంటూ చెప్పేసింది.
పరీక్ష రాసినా ఏం ఉపయోగం.?
గ్రూప్–2 అభ్యర్థులు ప్రిపరేషన్‌ని పక్కనపెట్టి ప్రభుత్వంతో పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో చాలా మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనా ఫలితం లేదని భావించారు. మరికొందరు చిన్నపాటి ఆశతో పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 16 కేంద్రాల్లో గ్రూప్–2 పరీక్షలు నిర్వహించారు. మొత్తం 11,030 మందికి గాను ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు జరిగిన తొలి పేపర్‌కు 9,391 (85.14 శాతం) మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు జరిగిన రెండో పేపర్‌కు 9,370 (84.95 శాతం) మంది హాజరయ్యారు.
ఒత్తిడితోనే పరీక్ష రాసిన అభ్యర్థులు
ప్రభుత్వం చేసిన నిర్వాకంతో అభ్యర్థులంతా తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దాదాపు ప్రతి ఒక్కరూ ఒత్తిడిలోనే పరీక్షలు రాశారు. కొందరు అభ్యర్థులు అస్వస్థతకు గురయ్యారు. కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి తీవ్ర ఒత్తిడికి లోనై అస్వస్థతకు గురయ్యారు. అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
భద్రత కట్టుదిట్టం
పరీక్ష సమయంలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూటమి ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించడంతో ప్రతి కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అణువణువు గాలింపు చర్యలు చేపట్టారు. మునుపెన్నడు లేని విధంగా డ్రోన్లతో పరీక్ష కేంద్రాల నుంచి 100 మీటర్ల దూరం వరకూ తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమే కాకుండా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అన్ని పరీక్షా కేంద్రాలను కెమెరాలతో అనుసంధానం చేస్తూ డ్యాష్ బోర్డుతో కూడిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
అధికారుల పర్యవేక్షణ
కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంకబత్ర బాగ్చి పలు కేంద్రాలకు వెళ్లి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఏయూలోని న్యూ క్లాస్ రూమ్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని, జైల్ రోడ్డులోని డిగ్రీ మహిళా కళాశాల, సీతంపేట పరిధిలోని బీవీకే, ప్రిజమ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ ద్వారా డీఆర్వో భవానీశంకర్ పరిస్థితిని సమీక్షించారు.
● అనకాపల్లి జిల్లా చీడికాడ మండలానికి చెందిన డి.శ్యామల కొమ్మాదిలోని విజయం స్కూల్ పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడంతో బయట నిలిపివేశారు. అలాగే రొంగలినాయుడుపాలేనికి చెందిన కొండబాబు బీవీకే కళాశాల కేంద్రానికి ఆలస్యంగా రావడంతో సిబ్బంది లోపలకు అనుమతించలేదు.
నిరుద్యోగులను మోసం చేయడమే..
నిరుద్యోగులకు మంచి చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. పైగా అభ్యర్థులు నష్టపోకుండా గ్రూప్–2 రోస్టర్‌ను సరిచేయాలని, అంతవరకు పరీక్ష వాయిదా వేయాలని ఉద్యమించినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. శనివారం రాత్రి వరకు నిరసన చేపట్టిన అభ్యర్థులు చేసేది లేక ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వేర్వేరు జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాశారు. కూటమి ప్రభుత్వం ఇందుకు మూల్యం చెల్లించక తప్పదు. ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు వచ్చే అన్ని ఎన్నికల్లో బుద్ధి చెబుతాం.
– రోహిత్ కుమార్, గ్రూప్–2 అభ్యర్థి
ఇక కోర్టులోనే తేల్చుకుంటాం..
రోస్టర్‌లో తప్పిదాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం గ్రూప్–2 మెయిన్స్ వాయిదా వేస్తుందని భావించాం. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించి పరీక్ష వాయిదాపై ఏపీపీఎస్సీకి సూచించడం, మంత్రి లోకేష్ న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాం.. అభ్యర్థులకు న్యాయం చేస్తాం అని ట్విట్టర్ ద్వారా స్పందించంతో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించాం. మేము ఊహించని విధంగా మాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం పరీక్షకు హాజరైనప్పటికీ మాకు న్యాయం జరుగుతుందనే ఆశ లేదు. ఇక కోర్టులోనే న్యాయ పోరాటం చేస్తాం.
– లోకేష్, గ్రూప్–2 అభ్యర్థి
డూప్లికేట్ హాల్ టికెట్‌తో హాజరు
సీతంపేట: డూప్లికేట్ హాల్ టికెట్‌తో గ్రూప్–2 మెయిన్స్ పరీక్షా కేంద్రంలోకి ఓ యువతి ప్రవేశించింది. సీతంపేట ప్రిజం డిగ్రీ కళాశాల సెంటర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. నెల్లూరుకు చెందిన నందిని అనే విద్యార్థిని ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అవ్వని విషయాన్ని దాచిపెట్టి మెయిన్స్ పరీక్ష కోసమని తల్లిదండ్రులతో కలిసి విశాఖ వచ్చింది. పరీక్ష కేంద్రంలో సిబ్బంది ఆమె డూప్లికేట్ హాల్ టికెట్‌ను చూసి ఈ నంబరు లేదని చెప్పారు. వెంటనే ఆమె బాత్ రూమ్‌కు అంటూ వెళ్లి అక్కడ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో పరీక్షా కేంద్రం సిబ్బంది ద్వారకా పోలీసుల సాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి తల్లిదండ్రులతో నెల్లూరు పంపించేశారు. దీనిపై ద్వారకా సీఐ రమణను వివరణ కోరగా సంఘటన జరగడం వాస్తవమే అని తెలిపారు.
పరీక్ష
పరీక్ష
పరీక్ష
పరీక్ష
పరీక్ష
పరీక్ష
Comments
Please login to add a commentAdd a comment