ఉరిమిన ఉత్తరాంధ్ర
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ వద్దంటున్న ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఉత్తరాంధ్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవరోధంగా మారుతున్నారంటూ మండిపడింది. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రానీయకుండా వివిధ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు అడ్డుకున్నారు. గురువారం వేల సంఖ్యలో విమానాశ్రయం వద్దకు చేరుకున్న ప్రజలు చంద్రబాబు వాహనాన్ని ముందుకు కదలనీయకుండా నిలిపివేశారు. బాబు వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో 8 గంటల పాటు హైడ్రామా నడిపిన చంద్రబాబు..అక్కడినుంచే హైదరాబాద్ విమానంలో వెనుదిరిగారు.
మిన్నంటిన బాబు వ్యతిరేక నినాదాలు
చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు, ప్రజాసంఘాల నేతలను అడ్డుకుంటున్న పోలీసులు
విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత తొలిసారిగా గురువారం చంద్రబాబు విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు విజయవాడ నుంచి ఉదయం 11.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే చంద్రబాబు పర్యటన గురించి ముందే తెలుసుకున్న వివిధ వర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు తమ నిరసన తెలియజేయాలని తీర్మానించుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే విమానాశ్రయ పరిసరాలకు నిరసనకారులు చేరుకున్నారు.
11.30 సమయంలో చంద్రబాబు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే.. విశాఖ కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న ‘చంద్రబాబు గోబ్యాక్’ అనే నినాదాలు మారుమోగాయి. బాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు అక్కడికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు కాన్వాయ్‌ని పెద్దసంఖ్యలో మహిళలు సహా ఆందోళనకారులు చుట్టుముట్టారు. చంద్రబాబు బయటికి వచ్చి గంట సేపు గడిచినా పరిస్థితిలో మార్పులేకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. లాఠీలతో నిరసనకారుల్ని చెదరగొట్టి నెమ్మదిగా కాన్వాయ్‌ని ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశారు. అయినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం, వాహనాలకు అడ్డంగా పడుకోవడంతో చంద్రబాబు కాన్వాయ్ అంగుళం కూడా కదలలేని పరిస్థితి ఏర్పడింది.
పోలీసులు వద్దన్నా కాన్వాయ్ దిగిన చంద్రబాబు
ఈ దశలో టీడీపీ ఎమ్మెల్యేలతో కలసి నడిచి వెళ్తానంటూ పోలీసులు వారిస్తున్నా వినకుండా వాహనం దిగిన చంద్రబాబు హైడ్రామాకు తెరతీశారు. రెండడుగులు వెయ్యగానే దాదాపు అర కిలోమీటరు మేర నిలుచున్న ప్రజలంతా ఒక్కసారిగా కాన్వాయ్‌పైకి దూసుకొచ్చారు. ఆ సమయంలోనే కాన్వాయ్ వాహనంపై కొందరు చెప్పులు. కోడిగుడ్లు, టమోటాలు విసిరేశారు. చంద్రబాబుకు రక్షణ కవచంగా నిలిచిన పోలీసులు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. పోలీసుల లాఠీ చార్జీలో పలువురు గాయపడ్డారు. వాహనంలోనే కూర్చోవాలనీ, నడిచివెళ్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చంద్రబాబుని పోలీసులు హెచ్చరించారు.
విశాఖకు జై కొడితేనే వెళ్లనిస్తామన్న ప్రజలు..
మరోవైపు ప్రజలు తమ నిరసన కొనసాగించారు. ‘ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు’, తదితర నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. విశాఖను కార్యానిర్వాహక రాజధానిగా వద్దన్న చంద్రబాబు.. విశాఖలో ఎలా పర్యటిస్తారంటూ నిలదీశారు. విశాఖకు జై కొడితేనే ముందుకు వెళ్లనిస్తామనీ ప్రజా సంఘాలు స్పష్టం చేశాయి. ప్రజాగ్రహం తీవ్రమవుతూ, పరిస్థితి చెయ్యి దాటిపోతున్న నేపథ్యంలో వెనక్కి వెళ్లిపోవాలంటూ చంద్రబాబుకు పోలీసులు సూచించారు.
భారీ భద్రత నడుమ చంద్రబాబు తిరుగు ప్రయాణం
పోలీసులపై చంద్రబాబు మండిపాటు
తనను వెనక్కి వెళ్లాలన్న పోలీసులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి కాన్వాయ్ దిగి రోడ్డుపై బైఠాయించి హడావిడి సృష్టించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వేలాది మంది ప్రజలు ఒక్కసారిగా చంద్రబాబుకి వ్యతిరేకంగా నినదించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కాన్వాయ్‌లోకి ఎక్కాలని చంద్రబాబుకు చెప్పిన పోలీసులు.. పశ్చిమ జోన్ ఏసీపీ పేరుతో సెక్షన్ 151 కింద నోటీసు ఇచ్చి.. భద్రతా కారణాల దృష్ట్యా ముందస్తుగా అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. కాన్వాయ్‌లోకి ఎక్కించి ఎయిర్‌పోర్టు ప్రవేశ ద్వారం గుండా వీఐపీ లాంజ్‌లోకి పంపించారు. అనంతరం రాత్రి 7.50 గంటల సమయంలో హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానం ఎక్కించారు. కాగా చంద్రబాబు ఎయిర్‌పోర్టులోకి వెళ్లే వరకూ ఉత్తరాంధ్ర ప్రజలు గో బ్యాక్ బాబూ.., బై బై బాబూ.. మళ్ళీ రాకు బాబు అనే నినాదాలు చేస్తూనే ఉన్నారు.
మీ సంగతి తేలుస్తా.. పోలీసుల్ని దూషించిన చంద్రబాబు
హై డ్రామా క్రమంలో చంద్రబాబు పోలీసులపై పలుమార్లు విరుచుకుపడ్డారు. అచ్చెన్నాయుడు కూడా ఇష్టం వచ్చినట్లు దూషించారు. తాను అనుమతి తీసుకొనే పర్యటనకు వచ్చాననీ, అయినా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ‘40 సంవత్సరాల అనుభవం ఉన్న నన్ను ఇబ్బంది పెడతారా.. మీ సంగతి తేలుస్తా.. నన్ను ముట్టుకునే అర్హత మీకు లేదు.. రేపు రానియ్యరు.. ఎల్లుండి వస్తా.. ఎల్లుండి రానియ్యరు.. నెక్స్ట్ వస్తా.. ఐయామ్ నాట్ గోయింగ్ టూ లీవ్ యూ.. ఎవ్వరినీ వదలను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పనిసరి పరిస్థితుల్లోనే బాబును వెనక్కిపంపాం: పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా
ప్రజాగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని, శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును సురక్షితంగా హైదరాబాద్‌కు పంపామని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా చెప్పారు. నౌకాదళ పర్యవేక్షణలోని విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో గంటల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే చంద్రబాబును వెనక్కి పంపాల్సి వచ్చిందని అన్నారు. చంద్రబాబు భద్రతే ప్రధానాంశంగా భావించామని, పార్టీలు, రాజకీయాలకతీతంగానే పోలీసులు వ్యవహరించారని స్పష్టం చేశారు. చంద్రబాబు రాక సందర్భంగా జరిగిన ఎయిర్పోర్ట్ ఎపిసోడ్లో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎక్కడా కనిపించక పోవడం గమనార్హం.
నాపై చెప్పులు వేస్తుంటే పోలీసులు గాడిదలు కాస్తున్నారా?
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మండిపాటు
రాష్ట్రంలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసి, ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న తనపై చెప్పులు, కోడి గుడ్లు, వాటర్‌బాటిల్స్‌తో దాడి చేస్తుంటే పోలీసులు గాడిదలు కాస్తున్నారా.. అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలుగుతోందని విమర్శించారు. గురువారం ఆయన విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. తనపై దాడి చేస్తుంటే చూస్తూ ఉన్న వీరు పోలీసులేనా.. పోలీస్ డ్రెస్ వేసుకున్న వేరెవరైనా వచ్చారా.. అని మండిపడ్డారు. చట్టపరంగా అనుమతి ఉన్నా, పోలీసులు తనను అరెస్ట్ చేయడం పట్ల చట్టపరంగా వారిపై చర్యలు తీసుకునేలా చేస్తానన్నారు. ఏ చట్టాన్ని అనుసరించి పోలీసులు తనను అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలన్నారు. పోలీసులందరూ బాడీ కెమెరాలు పెట్టుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా వీరు పాటించలేదన్నారు. పోలీసులు లిఖిత పూర్వకంగా రాసిస్తే.. వారు ఎక్కడికెళ్లమంటే అక్కడికి వెళతానన్నారు.
పులివెందుల నుంచి రౌడీలను తెచ్చారు
విశాఖ ప్రాంత ప్రజలు దాడులకు పాల్పడరని, ఇది చాలా ప్రశాంతమైన వాతావరణమని, ఇక్కడికి పులివెందుల నుంచి రౌడీలను తీసుకొచ్చి దాడులు చేయించారని చంద్రబాబు ఆరోపించారు. 2014 ఎన్నికల్లో పంచెలు కట్టుకుని కడప నుంచి రౌడీలు వస్తే వైఎస్ విజయలక్ష్మిని ఓడించారన్నారు. 40 ఏళ్లగా తాను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, భవిష్యత్తులో కూడా ఎప్పుడూ చూడబోనన్నారు. ఓ ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇలాంటి వింతలు జరుగుతాయన్నారు.
ఇంతమంది పోలీసులు ఏం చేశారు?
జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న తన చుట్టూ 2 వేలకు పైగా పోలీసులు ఉన్నప్పటికీ ప్రేక్షక పాత్రే వహించారు తప్ప వారు చేసిందేమీ లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆత్మకూర్‌లో కూడా ఇదే విధంగా తనను అడ్డుకున్నారని, అప్పుడు హ్యూమన్ రైట్ కమిషన్‌కు ఫిర్యాదు చేశానన్నారు.