సమరోత్సాహం
విశాఖ కళాభారతి ఆడిటోరియంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. పార్టీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ తదితరులు సర్కారు తీరుపై సమరభేరి మోగించారు. కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు.
విశాఖపట్నం: కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపా రు. భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టా రు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం వైఎస్సార్సీపీ నగర పార్టీ విస్తృత స్థాయి సమావేశం పెద్ద ఎత్తున జరిగింది. భారీ సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలకు నేతలు దిశానిర్దేశం చేశారు. నిరుత్సాహాన్ని పోగొట్టి ఉత్సాహం నింపారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో కార్యకర్తలదే కీలకపాత్ర అని అన్నారు. వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాల మేరకే కమిటీలు వేయాలని సూచించారు.
అనంతరం సభ్యులందరికీ రెం డు రోజులు శిక్షణ నిర్వహిస్తామన్నారు. కార్యకర్తలు క్రమశిక్షణతో మెలిగి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్, ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీ బలంగా లేనందున అధికారంలోకి రాలేకపోయామన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మండల, డివిజ న్ స్థాయి కమిటీల ఏర్పాటుకు పూనుకున్నారన్నారు. ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించడానికి కింద స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి ఉద్యమాలు చేస్తామన్నారు. 2009-2014 కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యేలు సహా పార్టీ నేతలమంతా అండగా ఉంటామన్నారు.
తలెత్తుకోలేని స్థితిలో టీడీపీ నేతలు
అమలు కాని హామీలు ఇచ్చిన చంద్రబాబు వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజల్లో తిరగలేని పరిస్థితి వస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైఎస్సార్సీపీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం కల్పిస్తామని, కమిటీల్లో నియమించి వారికి జిల్లా నాయకులందరూ అండగా నిలుస్తారని ధైర్యాన్ని నింపారు. కార్యకర్తలు సైనికుల్లా పని చేసి జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ మోసం చేసి అధికారంలోకి రావడం బాబుకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు.
మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి అధికారం చేజిక్కించుకున్నారని చెప్పా రు. పార్టీ ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు మాట్లాడుతూ చంద్రబాబు మాట లతో పేదలను మోసం చేస్తారని, చేతలతో ధనికులకు దోచిపెడతారని ఎద్దేవా చేశారు. కార్యదర్శి వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. కార్యదర్శి కంపా హనోకు మాట్లాడుతూ పార్టీ పురోభివృద్ధికి ఆది నుంచి కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తించి ప్రాధాన్యం కల్పించాలన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనా ల విజయకుమార్, కర్రి సీతారాం తదితరులు ప్రసంగించారు. ముందుగా వైఎస్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు తిప్పల నాగి రెడ్డి, చొక్కాకుల వెంటకరావు, రొంగలి జగన్నాథం, కోలా గురువులు, ఐ.హెచ్.ఫరూఖి, సత్తి రామకృష్ణారెడ్డి, దామా సుబ్బారావు, రవిరెడ్డి, పక్కి దివాకర్, పసుపులేటి ఉషాకిరణ్, గుడ్ల పోలిరెడ్డి, విల్లూరి భాస్కరరావు పాల్గొన్నారు.