ఆగస్ట్ ఫెస్ట్
సృజనకు కావల్సిన కొత్త ఆలోచన.. దాన్ని కార్యరూపంలోకి పెట్టే సత్తా ఉన్నా.. కావల్సిన పైకం లేని యువత కోసం.. పెట్టుబడిపెట్టే వ్యక్తులను పరిచయం చేసే రెండు రోజుల పండుగ ‘ఆగస్ట్ ఫెస్ట్’ శనివారం మాదాపూర్ హెచ్ఐసీసీలో ఉత్సాహంగా మొదలైంది. ఎంతోమంది ఔత్సాహికులు పాల్గొన్న ఈ వేడుకలో ఉదయం తొమ్మిదిన్నరకు ‘వర్కింగ్ ఆన్ టు ట్రాక్స్’ మీద అనందశంకర్ జయంత్ ఉపన్యాసంతో సెషన్స్ ప్రారంభమయ్యాయి. తరువాత అనిల్ సుంకర, రాజివ్ చిలక, విశాల్ గొండాల్, సుకాంత్ పాణిగ్రాహి, మహేశ్ మూర్తి తదితర ప్రముఖులు ఎందరో తమ కెరీర్ తొలినాళ్ల స్ట్రగుల్‌ని, అనుభవాలను పంచుకొని యువతకు ప్రేరణనిచ్చారు. కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఇన్వెస్టర్లతో తమ ఆలోచనలను పంచుకునేందుకు ఔత్సాహికులకు అవకాశం దక్కింది.
హైదరాబాదీ చాయ్ బాతే...
ఈ ఫెస్ట్‌లో ఆలోచనల సందడికి ఇక్కడ కనిపిస్తున్న ఫొటో నిదర్శనమే కాదు.. అక్కడి వాతావరణానికి ప్రధాన ఆకర్షణ కూడా. ఈ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేస్తున్న విక్రమ్ అండ్ టీమ్ ఐడియాకి రూపం ఇది. చాయ్టైమ్.. అంటే టీ తాగడమొక్కటే కాదు.. మన ఆలోచనలు, అభిరుచులను పక్కనున్న వాళ్లతో పంచుకోవడం కూడా. తేనీటి ఆస్వాదనకు ప్రత్యేక ప్రదేశమే కాదు, భాషా ఉంటుంది. అందులో హైదరాబాద్ చాయ్ బాతే... బహుత్ అచ్ఛే రహెతే! ఇరానీ చాయ్‌కి ఉన్నంత పాపులారిటీ, పబ్లిసిటీ ఉంది దీనికి. దాన్ని క్యాచ్ చేసుకుని హెచ్ఐఐసీసీలోని ఓ మూలను చాయ్ ఘర్‌గా మార్చి, ఇదిగో ఈ భాషనూ అతికించారు ఇలా! తెలిసిన వాళ్లు గుర్తు తెచ్చుకొని నెమరు వేసుకోవడానికి, తెలియనివాళ్లు తెలుసుకొని మాట్లాడుకోవడానికి! అరే.. టైమ్ కైకూ వేస్ట్ కరే భాయ్.. బురష్ లేకే దాంత్ సాఫ్ కరో ఔర్ చాయ్ గిలాసా హాత్ మే లేలో..!
- శరాది