ప్రియురాలి ఇంటి నుంచి దొంగ పరార్!
బెంగళూరు: చైన్స్నాచర్ను పట్టుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. కాల్పులు జరిపినా అతడు దొరక్కుండా తప్పించుకు పారిపోయాడు. కర్ణాటకలోని గదగ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గదగ్ పట్టణానికి చెందిన విశ్వనాథ్ కోళివాడ చైన్ స్నాచింగుల్లో దిట్ట. అతడిపై గదగ్, హుబ్లీతో పాటు పలు ప్రాంతాల్లో పలు కేసులున్నాయి. పోలీసుల కళ్లుగప్పి నిందితుడు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతుండేవాడు.
విశ్వనాథ్ ను పట్టుకునేందుకు చాలా రోజులుగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విశ్వనాథ్ గదగ్ పాతబస్టాండ్ వద్ద ఉన్న ప్రియురాలి ఇంటికి వచ్చాడు. పక్కా సమాచారంతో మంగళవారం అర్ధరాత్రి ఇంటిని చుట్టుముట్టారు. బయటకు రావాలని హెచ్చరికలు చేసినా విశ్వనాథ్ నుంచి స్పందన రాలేదు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. అయితే, అప్పటికే నిందితుడు చాకచక్యంగా తప్పించుకొని మరోసారి ఉడాయించాడు. ఇదిలా ఉండగా అర్ధరాత్రి సమయంలో కాల్పుల శబ్ధం విని స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే, దొంగను పట్టుకునేందుకు కాల్పులు జరిపినట్లు తెలియడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.